ఆందోళనలో పెన్షనర్లు…

సకాలంలో పెన్షన్ రాక

డీఆర్ పెరగక నిరాశ

దిశ దశ, సిరిసిల్ల:

ఆరు పదుల వయసొచ్చే వరకూ సర్కారు సేవలో తలమునకలై… పదవి విరమణ పొందిన తరువాత ప్రశాంతంగా జీవనం సాగించాల్సిన వారంతా ఆందోళన బాట పట్టారు. నిభందనల ప్రకారం సర్కారు నడుచుకోకపోవడంతో వారంతా నిరసనల పల్లవి అందుకున్నారు. రిటైరయ్యాక ఆసరనిస్తుందనుకున్న పెన్షన్ సకాలంలో చేతికి రాక ఎదురు చూపులు చూస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు పెన్షనర్లను అవస్థల్లోకి నెట్టేస్తున్నాయి.

కష్టాల కడలిలో..

వణుకుతున్న చేతులతో నిమిషానికోసారి మొబైల్ వంక చూస్తూ బ్యాంకు నుండి మెసెజ్ ఇంకా రాలేదా అన్న నైరాశ్యంతో కాలం వెల్లదీస్తున్నాయా పండుటాకులు. పెన్షన్ వస్తే మందులు కొనుక్కొవాలన్న ఆతృత కొందరిదైతే… ఇంటి అవసరాలకు ఉపయోగపడ్తాయన్న బాధ మరికొందరిది. ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు పెన్షన్ డబ్బులు అకౌంట్లో జమ ఎప్పుడు అవుతాయోనని ఎదురు చూస్తున్న పరిస్థితి తయారైంది పెన్షనర్లకు. రాష్ట్రంలో లక్షా 87 వేల మంది పెన్షనర్ల పరిస్థితి అంతా కూడా ఇలాగే ఉండడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రభావం తమపైనా పడుతుండడంతో అవసరాలను తీర్చుకునేందుకు అప్పులిచ్చే వారిని ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెన్షనర్లు. ఇంతకాలం ఉద్యోగం చేసి రిటైర్ అయిన తరువాత పెన్షన్ పై దర్జాగా బ్రతుకుతున్న తామిప్పుడు కడుపున పుట్టిన బిడ్డలపై ఆధారాపడాల్సి వస్తోందన్న మనో వేదన మరికొందరిది. తాము పోయినా తన జీవిత భాగస్వామికి కూడా పెన్షన్ వస్తుందన్న భరోసాతో కాలం వెల్లదీసే పరిస్థితికి పుల్ స్టాఫ్ పెట్టాల్సి వస్తోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది వారిలో. సకాలంలో పెన్షన్లు అందకపోవడంతో నింపాదిగా జీవనం సాగిస్తున్న పెన్షనర్లలో భరోసా లేకుండా పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించి వారిని కష్టాల కడలి నుండి బయటకు లాగే ప్రయత్నం చేయాలన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి.

కరువు భత్యం…

రాష్ట్రం ప్రభుత్వం పెన్షనర్లకు కరువు భత్యం పెంచాలని పెన్షనర్లు నిరసనలు చేపడుతున్నారు. పెండింగ్ లో ఉన్న డీఆర్ వెంటనే విడుదల చేయాలని, 2023 పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులను తొలగించాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. అలాగే వెల్ నెస్ సెంటర్లను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి నగదు రహిత వైద్య సేవలు అన్ని రకాల హాస్పిటల్స్ లో అందించే విధంగా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి నెల ఒకటో తేదినే పెన్షన్ అందించే విధంగా చర్యలు చేపట్టాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు.

రాజన్న జిల్లాలో ఇలా…

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెన్షనర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం బలరాం మాట్లాడుతూ.. జిల్లాలోని 3వేల115 మంది పెన్షనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 2022 జనవరి నుండి రావల్సిన డీ ఆర్ చెల్లించడంతో పాటు కొత్త నిభందనలను అనుసరించి డీఆర్ పెంచాలని డిమాండ్ చేశారు. ఆదాయపు పన్ను నుండి పెన్షనర్లను మినహాయించాలని కూడా కోరారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం సభ్యులు రాజిరెడ్డి, దత్తాద్రిగౌడ్, బాలనాగాచారి, భూమయ్య, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page