దిశ దశ, వరంగల్:
వరంగల్ లోకసభ నుండి పోటీ చేసే విషయంలో అసలేం జరిగింది..? కాంగ్రెస్ పార్టీ ‘కావ్య’ అభ్యర్థిత్వం ఖరారు చేయడానికి అసలు కారణమేంటీ..? కడియం శ్రీహరి ముందుగానే వేసుకున్న వ్యూహంలో భాగంగా ముందుకు సాగారా అన్న చర్చ పెద్ద సాగుతుండగా ఈ ఎత్తుగడలను వరంగల్ ప్రజలు ఎలా రిసివ్ చేసుకుంటారోనన్నదే పజిల్ గా మారింది.
కాంగ్రెస్ కాన్ఫిడెన్స్..?
అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని రెండు లోకసభ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయం అనుకున్నారు. అటు పార్టీ ఊపు ఇటు సిట్టింగుల బలం రెండూ కలిసివస్తాయని, ఈ సారి బరిలో నిలిచేవారు అదృష్టవంతులేనన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. రెండు కూడా రిజర్వు స్థానాల్లో నిలబడ్డ అభ్యర్థులు జాక్ పాట్ కొట్టినట్టేనన్న చర్చ కూడా సాగింది. అయితే అధిష్టానం అభ్యర్థి ఎంపిక విషయంలో అచూతూచి అడుగేసినట్టే కనిపించినా వరంగల్ విషయంలో అందరి అంచనాలను తలకిందులు చేసింది. పలువురిని పార్టీలో చేర్పించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో వారిలో ఎవరో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తారని భావించినా అనూహ్యంగా కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీలో చేర్పించకోవడం అమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం చకాచకా జరిగిపోయాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించిన వారి కంటే ఆయా సెగ్మెంట్ల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు షాక్ కు గురయ్యారు. అధిష్టానం మాటను బహిరంగంగా కాదని అనకున్నప్పటికీ తమకు తెలియకుండా టికెట్ ఇచ్చారన్న ఆవేదన అయితే వ్యక్తం అవుతోంది కొంతమందిలో. స్టేషన్ ఘన్ పూర్ ఇంఛార్జి ఇందిర కూడా కడియం ఎంట్రీని పూర్తి స్థాయిలో వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో కడియం కావ్య ఎంపిక విషయంలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నది వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం స్థానిక నాయకత్వానికి సంబంధం లేకుండా అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో అతి నమ్మకంతో ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటా బయట ఎదురవుతన్న పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.
కడియం ముందు సవాళ్లు…
ఫస్ట్ టైం డైరక్ట్ పాలిటిక్స్ లోకి వచ్చిన కావ్య ముందు కూడా సొంత పార్టీ నుండి సవాళ్లు ఎదురవుతున్నాయి. తండ్రి చాటు తనయగా పాలిటిక్స్ చేస్తున్నప్పటికీ ఆమె కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల్లో చొచ్చుకపోయే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఆమె సొంత పార్టీలో నెలకొన్న వర్గపోరును సవరించే ప్రయత్నం చేయడమా లేక తనకు మాత్రం అనుకూలంగా వ్యవహరించేలా మార్చుకోవడమా చేయాల్సి ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆమె తండ్రి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుండే పరిస్థితులను చక్కదిద్దాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఇందిర, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలు కడియం ఫ్యామిలీకి డ్యామేజ్ అయ్యే విధంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. ఒక వేళ ఇందిర పార్టీ అధిష్టానం చెప్పినట్టుగా నడుచుకున్నా ఆమె క్యాడర్ తో పాటు ఆమె కూడా మనస్పూర్తిగా పని చేసే అవకాశం ఉండదన్నది నిజం. ఇకపోతే తన టికెట్ లాక్కుని గెలిచి తనకు, బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేశాడన్న అక్కసుతో ఉన్న తాటికొండ రాజయ్య కడియం వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. శ్రీహరి వ్యక్తిత్వంతో పాటు ఆయనపై అవినీతి ఆరోపణలతో పాటు ఇతరాత్ర అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఓ వర్గం ప్రజలు విశ్వసించే అవకాశం లేకపోలేదు. దీనివల్ల మౌత్ టు మౌత్ పబ్లిసిటీ పెరిగిపోయినట్టయితే ప్రతికూల పరిస్థితులను చవి చూడాల్సి వస్తుంది. సొంత సెగ్మంట్ లోని కడియం యూత్ కూడా బీఆర్ఎస్ పార్టీకే అనుకూలమని ప్రకటించడం కూడా కావ్యకు నష్టాన్ని చేకూర్చే అంశంగా చెప్పవచ్చు.
పబ్లిక్ టాక్…
ఇక్కడ అత్యంత కీలకమైన విషయాన్ని కడియం శ్రీహరి, కావ్యలు గమనించాల్సిన అవసరం అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇఛ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ తీసుకున్నారన్న అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా పదే పదే వల్లె వేస్తోంది. కడియం శ్రీహరి కూడా తన కూతురు భవిష్యత్తు కోసం తానీ నిర్ణయం తీసుకున్నానన్నట్టుగా సంకేతాలు ఇచ్చేశారు. ఇప్పటికే ఆయన పార్టీ మారిన తీరుపై సాగుతున్న చర్చకు పుల్ స్టాప్ పెట్టే విధంగా కడియం ఎత్తులు వేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్న విశ్వాసంతో ఆయన పార్టీ మారడం ఎలా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారన్న విషయంపైనే వ్యతిరేకతను మూటగట్టుకోవల్సి వస్తుంది. వరంగల్ లోని ఏఢు సెగ్మెంట్లలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ విషయం గురించి చర్చ సాగుతున్నదన్నది వాస్తవం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మార్పు రావాలన్న నినాదం ఎలా అయితే బలంగా నాటుకపోయిందో కడియం పార్టీ మారిన తీరుపై ప్రజల్లో సాగుతున్న చర్చ కూడా అదే స్థాయిలో నాటుకపోయినట్టయితే ఇదే పెద్ద సవాలుగా మారనుంది. ఇందుకు తగ్గట్టుగా ఓటర్ల వద్దకు వెల్లి కావ్యకు అనుకూలంగా మల్చుకోవల్సిన ఆవశ్యకత ఉందన్నది నిజం.