కబ్జా చేశారెందుకు… సరెండర్ చేస్తున్నారెందుకు..?

సిరిసిల్ల జిల్లాలో వింత పద్దతి…

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సర్కారు భూములను కాపాడడంలో విఫలం అయింది ఎవరూ..?  ఆక్రమణలను  అడ్డుకోక పోవడానికి కారణమేంటీ..?  స్వచ్ఛందంగా భూములను అధికారులకు అప్పచెప్తున్న తీరు దేనికి సంకేతం..?

సరెండర్ తంతు…

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగెళ్లపల్లి మండలంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిలో కొంతమంది భూములను వాపస్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లకు భూములు తిరిగి అప్పగిస్తున్నామని లేఖ రాసి ఇస్తున్నారు. కొద్ది రోజులుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారు ఒక్కొక్కరుగా వచ్చి కలెక్టర్, ఎస్పీలకు లేఖలు అందిస్తూ వెల్తున్నారు. మంగళవారం తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చెందిన సంచుల కుమార స్వామి 464 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిని 3 ఎకరాల వరకు ఆక్రమించుకుని ఓ షెడ్ నిర్మాణం చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నానని అయితే తన ఆధీనంలో ఉన్న ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నానని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 250 ఎకరాల మేర ప్రభుత్వ భూమిని అప్పగించారని, మిగతా వారు కూడా తమ ఆధీనంలో ఉన్న భూమిని ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు.

ఆ లేఖలో…

సంచుల కుమార స్వామి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు రాసి ఇచ్చిన లేఖలో వివరించిన అంశాలను గమనిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కుమార స్వామి ఆధీనంలో ఉన్న 3 ఎకరాల భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు కావాలంటే రూ. 2.5 లక్షలు ఇవ్వాలని పట్వారి భూమయ్య, మాజీ సర్పంచ్, అప్పటి ఎమ్మార్వో అంజయ్య, ఆర్ఐ సంతోష్ లు అడగగా తనవద్ద లేవని చెప్పడంతో తనకు పాసు బుక్కు ఇవ్వలేదని వివరించారు. ఈ లెక్కన రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి ప్రభుత్వ భూమిని అప్పనంగా పంచిపెట్టినట్టుగా స్పష్టం అవుతోంది. తాను డబ్బులు ఇవ్వకపోవడంతో తనకు పాసు బక్కులు రాలేదని అయినప్పటికీ తాను ఆ భూమిలో సాగు చేసుకుంటున్నానని వివరించారు. ఈ లెక్కన డబ్బులు ఇచ్చిన వారికి ప్రభుత్వ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఇచ్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు కూడా తమ ఇష్టానుసారంగా వ్యవహరించి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు ముందుకు రావడం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చొరవ తీసుకోవల్సిన తహసీల్దార్, ఆర్ఐ, పట్వారిలు కూడా డబ్బులు ఇచ్చిన వారికి పాసు బుక్కులు ఇచ్చేందుకు సాహసించినట్టుగా స్పష్టం అవుతోంది.

సర్కారు భూమి

వాస్తవంగా ప్రభుత్వ భూములను లావుణీ పట్టాలు ఇచ్చి లబ్ది చేకూర్చేందుకు ప్రత్యేకంగా నిబంధనలు ఉన్నాయి. ఇందుకు అసైన్ మెంట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. లబ్దిదారులను ఎంపిక చేసిన తరువాత జిల్లా కలెక్టర్ ప్రొసిడింగ్స్ తీయాల్సి ఉంటుంది. ఇందుకు దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా కాదా అన్న విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని వారికి ఉన్న ఆస్తిపాస్తులు, ఆదాయ మార్గాలను కూడా బేరీజు వేసుకున్న తరువాత ప్రభుత్వ భూమిని అప్పగిస్తూ పట్టాలు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమి అయితే కొంతకాలం పాటు లబ్దిదారులు సాగు చేసుకున్న తరువాత పర్మినెంట్ పట్టా ఇచ్చే ఆనవాయితీ అమల్లో ఉంది. శాశ్వత పట్టాలు కూడా ఆర్డీఓ ద్వారా మాత్రమే జారీ చేయాల్సి ఉంటుంది. నివేశన స్థలాల కోసం అయితే లావుణీ పట్టాలు పొందిన లబ్దిదారులు మూడు నెలల్లో సొంత ఇళ్లు నిర్మించుకోనట్టయితే వాటిని స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అలాట్ చేయకుండానే కబ్జా చేసుకోవడం ఏంటన్నదే మిస్టరీగా మారింది. ఆక్రమించుకున్న వారు ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చి భూములు అప్పగిస్తుండడం కూడా విచిత్రంగా ఉంది. ఇంతకాలం ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న విషయం గురించి స్థానిక రెవెన్యూ అధికారులు కూడా అభ్యంతరాలు చెప్పకపోవడం, ఇందుకు సంబంధించిన నివేదికలు ఉన్నతాధికారులకు పంపించకపోవడం ఏంటన్నది కూడా మిస్టరీగా మారిపోయింది.

You cannot copy content of this page