దిశ దశ, ఖమ్మం:
మున్నేరు వాగులో వరద ఉధృతి కారణంగా ఖమ్మం పట్టణంతో పాటు పరివాహక ప్రాంతాలన్ని అతలాకుతలం అయ్యాయి. వాగు నుండి వచ్చి చేరిన వరద నీరు దిగువ ప్రాంతానికి వెల్లే పరిస్థితి లేకపోవడంతో బ్యాక్ వాటర్ అంతా కూడా పరివాహక ప్రాంతాన్ని ముంచెత్తింది. శనివారం అర్థరాత్రి నుండి కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి వచ్చిన వరద నీరు ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. 10 అడుగుల మేర నీరు పరివాహక ప్రాంతాల్లో ప్రవహించిందంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం పట్టణంలోని 15 కాలనీల వరకు జలమయం కాగా, వందకు పైగా గ్రామాలు వరద నీటిలో మునిగిపోయినట్టుగా అంచనా. ప్రకాష్ నగర్ తో పాటు పలు కాలనీల్లోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నివాసితులు భవనాల పైకి వెల్లి సాయం కోసం ఎదురు చూశారు. రాజీవ్ గృహ కల్ప ప్రాంతం కూడా నీటిమయం కావడంతో కొన్ని ఇండ్లు కూలిపోయాయి. దీంతో ఈ ప్రాంత వాసులు తమకు వేరే ప్రాంతంలో ఇండ్లు కట్టించడంతో పాటు పరిహారం ఇప్పించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. కాలనీల్లోకి చొచ్చుక వచ్చిన వరద నీటిలోనే రెండు రోజులుగా నివాసం ఉండాల్సిన అవశ్యకత ఏర్పడిందని ఆయా కాలనీల వాసులు అంటున్నారు. మరో వైపున పాలేరు సమీపంలోని వంతెన కూడా వరద ఉధృతి కారణంగా ఇప్పుడా అప్పుడా అన్నట్టుగా కొట్టుమిట్టాడుతోంది. అలాగే ఇక్కడి పవర్ హౌజ్ కూడా నీట మునిగిపోయింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి తోడు… ఈ వాగు వరద నీరు కృష్ణా నదిలో కలవనుంది. అయితే కృష్ణా నదికి 11.33 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో మున్నేరు వాగు నీరు ఒత్తిడికి గురైంది. లక్షలాది క్యూసెక్కుల వదర నీటి కారణంగా పిల్ల కాలువ లాంటి మున్నేరు నీటి ఉధృతి తట్టుకోలేక వెనక్కి వచ్చింది. ఈ కారణంగానే ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరివాహక ప్రాంతలు నీట మునిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.