దాడులపై స్పందన సరే… దారుణాల మాటేమిటో మరీ..?

ఐఎంఏ బాధ్యులకో సూచన…

దిశ దశ, పెద్దపల్లి:

సంఘ సభ్యున్ని సంరక్షించుకునే ముందు..Ima. సంస్కరించుకునే ప్రక్రియకు శ్రీకారం చుడితే ఆదర్శ ప్రాయంగా ఉంటుంది. వైద్యో నారాయణో హరి అన్న పదానికే వక్రభాష్యం చెప్తూ వ్యాపార దృక్ఫథంతో వ్యవహరిస్తున్న వారిని సన్మార్గంలో పెట్టేందుకు కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చొరవ తీసుకుంటే బావుంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైద్యులపై వరస దాడుల నేపథ్యంలో శుక్రవారం ఐఎంఏ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు పగడాల కాళి ప్రసాద రావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… వైద్యుల కోసం ప్రత్యేకంగా చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి డాక్టర్లపై జరుగుతున్న దాడుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. లేనట్టయితే జాతీయ స్థాయిలో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, రాష్ట్రంలోని 20 వేల మంది వైద్యులు ఆందోళన బాట పడుతారని స్పష్టం చేశారు. పెద్దపల్లి, మెట్ పల్లిలలో డాక్టర్లపై జరిగిన వరస దాడులు జరగడాన్ని తీవ్రంగా పరిగణించి తామీ సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు. వైద్యులపై ఇలాంటి దాడుల ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చట్టాలను తయారు చేయాల్సిన అవసరం ఉందని కాళి ప్రసాద రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా కోరారు.

ఈ సంగతో మరి..?

వృత్తి పరంగా సవాళ్లను ఎదుర్కొంటున్న వైద్యుల విషయంలో వ్యవహరించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నాన్ బెయిల బుల్ సెక్షన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారికి శిక్షలు పడే విధంగా కూడా చొరవ తీసుకోవల్సిన అవసరం ఉంది. అయితే తమ సంఘ సభ్యులపై దాడులు జరుగుతున్నప్పుడు స్పందించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వృత్తి ధర్మాన్ని విస్మరిస్తున్న వారిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్లు అంటే ప్రత్యక్ష్య దైవంగా కొలిచే సమాజం నేడు వారిపైనే దాడులకు దిగుతుండడానికి కారణాలు ఏంటో ఐఎంఏ ప్రతినిధులు లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. గాయం ఓ చోట అయితే మందు మరో చోట రాయడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదన్న విషయం వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు తెలియంది కాదు. ఇలాంటి పరిస్థితులకు అసలు కారణమేంటి అన్న విషయాలపై కూడా ఐఎంఏ ప్రతినిధులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు పెషెంట్లు ఎంత మంది ఉన్నారు..? వారికి వచ్చిన రోగం ఏమిటీ ఇందు కోసం వారి నుండి బిల్లులు వసూలు చేస్తున్న తీరు, ప్రిస్కిప్షన్ లో రాస్తున్న మందులు వివరాలను ఐఎంఏ ప్రతినిధులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో అధ్యయనం చేస్తే బావుంటుంది. అలాగే పెషెంట్ ఆసుపత్రికి రాగానే ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులు రాయడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వివిధ రకాలు పరీక్షలు, స్కానింగులు చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్న తీరును కూడా కట్టడి చేయాల్సి ఉంది. స్కానింగులో, పరీక్షలో చేస్తేనే కదా మాకు తెలిసేది అన్న వాదనలు కూడా వినిపించే ముందు పెషెంట్ పల్స్ చూసి, కండిషన్ ను అంచనా వేయకుండా డాక్టర్ వద్దకు వెళ్లగానే చకాచకా టెస్టులు చేయించుకుని రావాలని చెప్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చికిత్స కోసం ఏ ఆసుపత్రికి వెళ్లాలో అన్న విషయంలో డైలమాలో ఉన్న పేషెంట్లను తమ ఆసుపత్రికి తీసుకరావాలని దళారులను ప్రోత్సహిస్తున్న తీరును నియంత్రించాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటుందో ఐఎంఏ ప్రతినిధులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. చివరకు క్లినిక్ లు పెట్టేందుకు అర్హత లేని ఆర్ఎంపీ, పీఎంపీలను, అంబూలెన్స్ డ్రైవర్లకు కూడా కమిషన్లు ఎర వేస్తున్న సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అత్యున్నతమైన విద్యలో ఒకటైన డాక్టర్లుగా పట్టభద్రులైన వారు వ్యాపార దృక్ఫథంతో వ్యవహరిస్తున్నారన్న విషయం ఈ ఘటనలు రుజువు చేయడం లేదా..? హస్తవాసి బాగుందన్న పేరు వచ్చిన తరువాత పేషెంట్లే క్యూ కట్టే అవకాశం ఉంటుంది కానీ, పెషెంట్లను తమ ఆసుపత్రిలో చేర్పించుకునే విషయంలో ప్రొఫెషనలిజానికి మంగళం పాడుతున్న తీరు ఎంత వరకు సమంజసమో ఐఎంఏలో కీలక బాధ్యలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండున్నర దశాబ్దాల క్రితం వరకు కొన్ని ఆసుపత్రులకు బ్రాండ్ ఇమేజ్ ఉండేది. సర్కారు దవాఖాన కంటే ఎక్కువగా ఫలనా ఆసుపత్రికి వెళ్లాలని ప్రైవేటు వైద్యుల వద్దకు వెల్లేందుకు రోగులు ఉత్సాహం కనబర్చే వారు. ఇందులో కరీంనగర్ చూసుకున్నట్టయితే భూంరెడ్డి దవాఖానాకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ నేటి తరానికి తెలియకపోవచ్చు కానీ నాలుగు పదుల వయసు దాటిన చాలా మందికి తెలుసు. ఇలాంటి బ్రాండ్ విషయంలో ఒక్క కరీంనగర్ కాదు తెలంగాణాలోని చాలా చోట్ల కూడా గ్రామీణ ప్రాంత ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన డాక్టర్లు ఎందరో ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగితే బావుంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ విషయంలో మరి..?

ఇటీవల కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రులతో అనుసంధానం పెట్టుకున్న విషయంలో ఎన్నెన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అందులో చట్టపరంగా వెలుగులోకి వచ్చిన రెండు ఉదాహారాణలే సజీవ సాక్ష్యం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లలో రెండు వేర్వేరు కేసుల్లో అంబూలెన్స్ డ్రైవర్లు అరెస్ట్ అయ్యారు. అయితే ఈ రెండు కేసుల్లోను కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రులతో ఉన్న లింక్ వెలుగులోకి వచ్చింది. రెండో కేసు నేపథ్యంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ… అంబూలెన్స్ డ్రైవర్లు కమిషన్లకు కక్కుర్తి పడి వ్యవహరించారని, డాక్టర్లు కూడా ఇలాంటివి ప్రోత్సహించవద్దని అప్పీల్ చేశారు. పోలీసులు ఈ కేసులో డాక్టర్లపై క్రిమినల్ కేసులు నమెదు చేయకున్నప్పటికీ వాస్తవాలు మాత్రం కరీంనగర్ కు చెందిన ఆ రెండు ఆసుపత్రుల వల్లేనన్నది వాస్తవం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నమోదయిన ఈ రెండు కేసుల గురించి కూడా ఐఎంఏ బాధ్యులు దృష్టి సారించి వైద్య వృత్తికే కళంకం తెస్తున్న వారిపై కూడా కఠినంగా వ్యవహరించేందుకు చొరవ చూపిస్తే ఇలాంటి ఘటనలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉండవు కావచ్చు. తాజాగా సీఎం రిలీఫ్ పండ్స్ కోసం అవకతవకలకు పాల్పడిన ఘటనలో కూడా తెలంగాణలోని కొన్ని ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. ఇలాంటి ఘటనలు వైద్య వృత్తికి ఎంతటి కళంకాన్ని తెచ్చిపెడుతాయో కూడా అర్థం చేసుకోవల్సిన అవసరం ఉంది.

You cannot copy content of this page