ఎరగా వంద… దోచుకుంది 1.50 లక్షలు

ఇంటింటికి వెల్లి దోచుకునే దొంగల కన్న యమ డేంజర్ గా తయారయ్యారు సైబర్ క్రిమినల్స్. ఇంట్లో కూర్చొని డబ్బును దోచుకోవడం ఎలాగో నేర్చుకుని సామాన్యులను నిండా ముంచుతున్నారు. ఎదో ఓ వెబ్ లింక్ పంపించి ట్రాప్ లో పడేసి లక్షలు దోచుకునే పనిలో పడ్డారు. సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పోలీసులు ప్రయత్నిస్తున్నా… కొత్త దారులు వెతుక్కుంటూ అక్రమాలకు తెరలేపుతూనే ఉన్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటర్ నెట్ ద్వారా పార్ట్ టైం జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న ఓ యువతికి సంబంధం లేని వెబ్ లింక్ రాగానే ఓపెన్ చేసేసింది. వెబ్ లింక్ పంపిన వారు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన పర్సనల్ డాటా అంతా అప్ లోడ్ చేసేసింది. ఈ క్రమంలో భాగంగా సైబర్ క్రిమినల్స్ రూ. 100 ఆమెకు పంపించి రివార్డుకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ చూపించడంతో ఒక్కో సమాచారం వెబ్ సైట్ లో అప్ లోడు చేస్తూ బాధితురాలు ఏకంగా రూ. 1.53 లక్షల రూపాయలు సమర్పించుకుంది. తాను వెబ్ సైట్ ద్వారా పంపిస్తున్న డబ్బులు వెల్తున్నాయి కానీ తిరిగి తనకు ఎలాంటి రివార్డులు రావడం లేదని అనుమానించిన సదరు యువతి తేరుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిరిసిల్ల టౌన్ పోలీసులు సైబర్ క్రైంలో ఛీటింగ్ కేసు నమోదు చేసి నిందితులను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు.

ఇలా చేస్తే అంతే…

సాంకేతికతను అందిపుచ్చుకున్న క్రిమినల్స్ ఎదో విధంగా దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టకున్నారు. వారి ట్రాప్ లో చిక్కడమే తరువాయి అకౌంట్లలో డబ్బులు బదిలీ చేసుకుంటున్నారు. సైబర్ క్రైమ్స్ ఇటీవల కాలంలో తీవ్రంగా పెరిగాయని పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించే పనిలో నిమగ్నం అయినప్పటికీ బలవతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. మనకు సంబంధం లేని వ్యక్తి ఎందుకు డబ్బులు పంపిస్తారు.? ఆయాచితంగా డబ్బులు ఎందుకు పంపిస్తున్నారు అన్న విషయాన్ని గుర్తు ఉంచుకుని మెదిలితేనే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page