బీఆర్ఎస్ సైలెంట్…
దూకుడు మాటలకు బ్రేక్…
ఈడీలు… మోడీలు ఎవ్వరొచ్చినా ఈ తెలంగాణ సమాజాన్ని ఏమీ చేయలేరు… కేంద్రంలోని బీజేపీ సర్కార్ కక్ష్య పూరితమైన చర్యలకు చరమ గీతం పాడుతాం… బస్తీమే సవాల్ చూసుకుందాం రా… మల్ల యుద్దామా… రణ క్షేత్రమా… ప్రజా క్షేత్రమా.. అన్న రీతిలో ఏక తాటిగా కేంద్ర ప్రభుత్వంపై దాడి చేసిన బీఆర్ఎస్ సైలెంట్ అయిందెందుకు..? కేంద్రంలో మతోన్మాద పార్టీని గద్దె దింపడమే మా లక్ష్యం అంటూ బీఆర్ఎస్ నాయకులు కాషాయంపై విమర్శనాస్త్రాలు సంధింస్తూ మోడీ… షా ద్వయమంటూ మండి పడ్డారు. దేశ ఆర్థిక సంక్షోభానికి కారుకులన్నారు, జీఎస్టీ ద్వార ఎక్కువ తీసుకుంటూ తక్కువ ఇస్తున్నారనీ విమర్శించారు. బడ్జెట్ లో తెలంగాణాకు మొండి చేయంటూ మండిపడ్డారు. ఘాటైన పదజాలలతో బీజేపీని ఉక్కిరిబిక్కిర చేసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఒక్క సారిగా సైలెంట్ అయ్యారు. మంత్రి హరీష్ రావు కరీంనగర్ పర్యటనలో కొన్ని టీవీ ఛానెల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు తప్ప మిగతా వారెవరూ కిమ్మనడం లేదు. నోటీసులు అందుకున్న తర్వాత కవితక్క ట్విట్ చేసి కేంద్రంపై విరుచుకపడ్డారు కానీ ముఖ్య నాయకులెవరూ స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వ్యూహమా…? వెనక్కి తగ్గడమా..?
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం విషయంలో వ్యవహరిస్తున్న తీరు వ్యూహంలో భాగమేనా లేక వెనక్కి తగ్గిందా అన్నదే అంతు చిక్కకుండా పోయింది. మొదటి సారి సీబీఐ నోటీసులు ఇస్తే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కవిత ఇంటికి వెళ్లి బాసటనిచ్చారు… భరోసాగా ఉంటామన్నారు. రెండు మూడు రోజుల పాటు వివిధ స్థాయిలో ఉన్న క్యాడర్ అంతా కవితక్క ఇంటి వద్దకే చేరింది. కానీ ఇప్పుడు ఈడీ నోటీసు అందిన తరువాత అప్పటి పరిస్థితికి భిన్నంగా మారిపోయింది. బంజారాహిల్స్ లోని ఆమె ఇంటి చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం నాటి మహిళా బిల్లు నిరసన దీక్షకు బుధవారం సాయంత్రమే ఢిల్లీకి వెల్లిపోయారు కవిత. అయితే అప్పటికి ఇప్పటికీ ఈ మార్పుల వెనక కారణాలేంటన్నదే అంతుచిక్కకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొదటి సారి నోటీసులప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన ఆమె ఇప్పుడు మాత్రం ట్విట్టర్ ప్రకటనతోనే సరిపెట్టారు. ఇవన్నింటిని గమనిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెల్తోందా లేక మరేదైనా కారణముందా అన్నదే మిస్టరీగా మారింది.
జాయింట్ ఎంక్వైరీ తప్పదా..?
పిళ్లై, కవితలను ఏకకాలంలో విచారించేందుకు ఈడీ సమాయత్తం అవుతోంది. బినామీల ద్వారా మనీ ల్యాండరింగ్ వ్యవహారాలకు పాల్పడిన తీరుతో పాటు లిక్కర్ స్కాంలో జరిగిన ప్రతి అంశాన్ని కులంకశంగా చర్చించేందుకు ఈడీ స్పెషల్ టీమ్స్ సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ రెవెన్యూ సర్విసెస్ ఆఫీసర్లు విభిన్న కోణాల్లో అటు పిళ్లైని ఇటు కవితను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇద్దరినీ విచారించిన తరువాత ఈడీ అరెస్ట్ చేయడం పక్కా అన్న సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చి విచారించిన తరువాత అరెస్ట్ చేసిన సంఘటనలు కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
రేపు నిరసన… ఎల్లుండి విచారణ..
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలపాలన్న డిమాండ్ తో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఒక రోజు నిరాహారా దీక్ష చేపట్టాలని ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో తాను ముందస్తుగానే షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నందున రాలేకపోతున్నానని 15 తరువాత విచారణ చేపట్టాలని కోరారని కవిత సన్నిహితులు మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే ఈడీకి మాత్రం తాను 11న విచారణకు హాజరవుతానని లేఖ రాశారు. దీంతో నిరసన చేపట్టిన మరునాడు కవిత విచారణకు ఈడీ కార్యాలయానికి వెల్లనున్నారు. ఒక వేళ ఈడీ కవితను అరెస్ట్ చేసినట్టయితే మరో విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ప్రకటనలను పరిశీలిస్తే మాత్రం మహిళా బిల్లు ఆందోళనలు చేసిన తరువాత మహిళా నేతను అరెస్ట్ చేశారన్న ఆరోపణలకు దిగొచ్చని చూస్తున్నట్టుగా ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు నోటీసులు ఇచ్చారు, బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేసిన మరునాడు అరెస్ట్ చేశారు అన్న నినాదాన్ని ప్రజలకు వినిపించే ఎత్తుగడ కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా విచారించే అవకాశం ఉందని, గతంలో కోర్టులు కూడా తీర్పులు ఇచ్చాయన్న విషయాన్ని కూడా కవిత ఈడీకి రాసిన లేఖలో గుర్తు చేశారు. ఒక మహిళను తన నివాసంలోనే విచారించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుండా తనను ఈడీ కార్యాలయానికి రావడం వెనక ఆంతర్యం ఏంటోనని అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పులను ఊటంకిస్తూ తనను తన ఇంటి వద్దే విచారించాలని మాత్రం ఈ లేఖలో కోరకపోవడం గమనార్హం. గతంలో సీబీఐ విచారణ విషయంలో తన ఇంటికి వచ్చి ప్రశ్నించుకోవాలని తేల్చి చెప్పిన కవిత ఇప్పుడు మాత్ర కోర్టు తీర్పుల విషయాన్ని ప్రస్తావించారు కానీ తాను కార్యాలయానికి మాత్రం రానని చెప్పకపోవడం విచిత్రం.