బీఆరెస్ లో విప్లవాత్మకమైన నిర్ణయం..?
భారతీయ రాష్ట్ర సమితిగా ఆవిర్భావం చెందిన తరువాత రాజకీయ సమీకరణాలు మార్చేందుకు గులాభి ముఖ్య నేతలు అత్యంత రహస్యంగా సమీకరణాలు నెరుపుతున్నారు. అటు జాతీయ రాజకీయాల్లో ఇటు ప్రాంతీయ రాజకీయాల్లో పట్టు సడలకుండా ఉండాలంటే కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే బ్యాక్ టు పెవిలియన్ అన్న నినాదాన్ని అమలు చేసే పనిలో నిమగ్నం అయిన ముఖ్యనేతలిద్దరూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల పార్టీని వీడిన ఓ ముఖ్య నాయకునికి రీ ఎంట్రీ ఇచ్చేందుకు మంత్రాంగం సాగుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. కమలం పంచన చేరిన ఈ నేతను గులాభి నీడకు తిరిగి ఆహ్వానించినట్టయితే బీజేపీ బలహీన పడుతుందని గ్రహించి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. పునరాగమనం పూర్తయితే అతనికి అవసరమైన స్థానం కూడా ఖాళీ చేయించేందుకు ప్లాన్ చేసుకున్నట్టుగా సమాచారం. ఆ నేత చేరినట్టయితే బీసీ కార్డు నినాదానికి చెక్ పెట్టడంతో పాటు ప్రత్యర్థి పార్టీ చావు దెబ్బ తింటుందని భావించిన ఇద్దరు నేతలు అధినేతను మెప్పించి ఒప్పించారని విశ్వసనీయంగా తెలుస్తోంది. గత వైభవపు ప్రాధాన్యతలో ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందన్న భరోసా మేమిస్తాం… ముందు వరసలోనే నీ కూర్చి ఉంటుందని మాట ఇస్తున్నామని కూడా భరోసా కల్పించే పనిలో ఆ ముఖ్య నేతలిద్దరూ పడ్డట్టుగా సమాచారం. అయితే రీ ఎంట్రీ తరువాత మాత్రం హైదరాబాద్ శివర్లలోని ఓ స్థానాన్ని ఖాలీ చేయించి అక్కడి నుండే బరిలో నిలుపుతాం, అక్కడున్నఆనేతకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఉత్తర తెలంగాణాలోని ఆ ముఖ్య నేతతో ఈ అంశాలపై జరుగుతున్న సుదీర్ఘమైన చర్చలపై రాయబారాలు సాగుతున్నయని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను పుర్వాశ్రమంలోకి చేర్పించుకుని ప్రత్యర్థి పార్టీలో కలవరం లేపాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. దీనివల్ల కమలం పార్టీలో ముసలం పుట్టడం ఖాయమని, గులాభి గుభాళించడమూ సాధ్యమని అంచనా వేస్తున్నారు పార్టీ ముఖ్య నాయకులు.