వంతుల వారికి అమ్మకు అన్నం…
గడువు ముగిసిందని ఒకరు…
తాళం వేసుకున్నారు మరోకరు…
ఎంట్రీ ఇచ్చిన సీఐ సదన్ కుమార్…
దిశ దశ, మానకొండూరు:
కడుపు పండిననాడు సంబరపడిపోయిందా తల్లి… మాసాలు గడిచిన తరువాత గర్భంలో ఉన్న బిడ్డ కాళ్లతో తంతుంటే నొప్పి భరిస్తూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయి పోయిందా అమ్మ… తన కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలను పెంచి పెద్ద చేసిన అమ్మను వృద్దాప్యానికి చేరుకున్న తరువాత పట్టించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. తండ్రి కానరాని లోకాలకు చేరిన తరువాత ఆయన ఆస్తిని పంచుకున్న అన్నదమ్ములిద్దరు అమ్మకు బుక్కెడు బువ్వ పెట్టడానికి కూడా వంతులు వేసుకున్నారు. గడువు ముగిసిందని ఓ కొడుకు ఇంటినుండి వెల్లగొడ్తే… తల్లిని చూసుకోవల్సి వస్తుందని మరో కొడుకు ఇంటికే తాళం వేసుకుని వెల్లిపోయాడు. అందరూ ఉన్నా అనాథగా మారిన ఆ అమ్మ గురించి తెలుసుకున్న సీఐ సదన్ కుమార్ రంగంలోకి దిగారు.
వంతుల వారిగా…
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. గ్రామానికి చెందిన వడ్లూరి మల్లమ్మ (75)ను ఇద్దరు కొడుకులు వంతుల వారిగా బాగోగులు చూసుకోవాలని భావించారు. తండ్రి మరణించిన తరువాత వారి ద్వార సంక్రమించిన ఆస్తిని వాటాలుగా పంచుకున్న తనయులు తల్లిని చూసుకునేందుకు వంతులు వేసుకున్నారు. దీంతో బుధవారం తల్లి తన వద్ద ఉండేందుకు గడువు ముగిసిందని తన ఇంటి నుండి పంపించి మరో కొడుకు వద్దకు వెళ్లాలని చెప్పాడు. అయితే ఆయన తన ఇంటికి తాళం వేసుకుని వేరే చోటకు వెల్లిపోయాడు. దీంతో మలమ్మను ఎవరు చూసుకుంటారో అర్థం కాకుండా పోయింది. చివరకు తండ్రి ఫోటోను కూడా బయట వేసిన తనయుడి తీరును చూసిన తల్లి కన్నీటి పర్యంతం అయింది. ఈ విషయం గురించి తెలుసుకున్న మానకొండూరు సీఐ సదన్ కుమార్ బుధవారం సాయంత్రం మల్లమ్మ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. తిరిగి గురువారం నాడు వెల్ది గ్రామానికి వెల్లిన సీఐ తాళం వేసి ఉన్న ఇంట్లో మల్లమ్మను దింపి బాగోగులు చూసుకోకపోతే తనకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. తండ్రి సంపాదించిన ఆస్తిని పంచుకున్న కొడుకులు తల్లిని చూసుకోకపోవడం ఏంటని సీఐ తనయులిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను చూసుకోలేకపోతే మల్లమ్మకు తాను అండగా నిలుస్తానని, ఆమె ఖర్చులు కూడా భరిస్తానని మాట ఇచ్చారు.
సీనియర్ సిటిజన్స్ యాక్ట్…
తల్లిదండ్రుల బాగోగులు చూసుకోని కొడుకులపై సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు చేస్తామని మానకొండూరు సీఐ సదన్ కుమార్ తెలిపారు. పేరెంట్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. నవమాసాలు పెంచి పోషించిన తల్లి బాగోగులు చూసుకునేందుకు వివక్ష ప్రదర్శిస్తున్న తీరు సరికాదన్నారు. అమ్మకు బుక్కెడు అన్నం పెట్టడానికి వంతులు వేసుకున్న కొడుకులను కనెప్పుడు కానీ, పెంచి పెద్ద చేసేప్పుడు కానీ మీ తల్లి వంతులు వేసుకుందా అని ప్రశ్నించారు. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. తనయులు ఇద్దరు పంచుకున్న ఆస్తి కూడా తండ్రి ద్వారా సంక్రమించిందే కాబట్టి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అమలు చేసి ఆస్తులపై మల్లమ్మకే హక్కులు కల్పించేందుకు చొరవ తీసుకుని ఆమె జీవితానికి భరోసా కల్పిస్తామని సీఐ సదన్ కుమార్ స్పష్టం చేశారు.