దిశ దశ, రామడుగు:
అనారోగ్యం బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న తండ్రి విగత జీవిగా మారిపోయాడు… బీడీలు చుడుతున్న తల్లి… మెరిట్ సాధిస్తూ ఉద్యోగం పొందిన అక్క… అక్కున చేర్చుకున్న ఆత్మీయులు మాత్రమే మిగిలారా యువకుడికి. బిటెక్ చేసి ఏదో సాధించాలన్న పట్టుదలతో ఉన్న ఆ యువకుడు ఆలోచనల సంఘర్షణతో సతమతయ్యాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే కావడం… ముందుకు సాగాలా… వెనక్కి తగ్గాలా అన్న మీమాంసతో కొట్టుమిట్టాడుతున్నాడు కళ్ల ముందు సాక్షాత్కరించిన కష్టాలను గుండెల్లో పదిలంగా దాచుకుని తన పయనం ముందుకు సాగడమేనని నిర్ణయించుకున్నాడు. నిర్దేశించుకున్న ఆ యువకుడు యూపీఎస్సీలో 27వ ర్యాంకు సాథించాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన నందాల సాయి కిరణ్ నేపథ్యంలోకి తొంగి చూస్తే…
వెలిచాలలో సాయికిరణ్ ఉంటున్న ఇళ్లు ఇదే
నందాల ఇంట ఆనందం…
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల కాంతయ్య మహారాష్ట్రలోని భీవండిలో పవర్ లూమ్స్ కార్మికునిగా పనిచేస్తుండగా క్యాన్సర్ బారిన పడడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను చూసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ తల్లి లక్ష్మీ జీవనం సాగించారు. బీడీలు చుడుతూ వచ్చిన ఆదాయంతో అటు కటుంబాన్ని పోషిస్తూ… ఇటు పిల్లలను చదివించారు. తల్లి కష్టం చూసిన ఆ ఇంట పుట్టిన బిడ్డలు కూడా కష్టాలకు పుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతోనే చదువులో రాణించారు. కూతురు స్రవంతి బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకుని మిషన్ భగీరథలో ఏఈఈగా ఉద్యోగం చేస్తున్నారు.
సాఫ్ట్ జాబ్… హార్ట్ టార్గెట్…
కుటుంబ స్థితి గతుల దృష్ట్యా జాబ్ చేస్తూనే సివిల్స్ ప్రిపేర్ కావల్సిన పరిస్థితి సాయి కిరణ్ ది. తొలిసారి ప్రయత్నంలో విఫలం కావడంతో ఉద్యోగం వదిలేసి సివిల్స్ ప్రిపేర్ కావాలని అనుకున్నాడు. కానీ సివిల్స్ ప్రిపరేషన్ కోసం ఉన్న ఉద్యోగం వదులకుంటే ఇబ్బందని బంధువులు చెప్పడంతో అటు ఉద్యోగం చేస్తూనే ఇటు కోచింగ్ తీసుకున్నాడు. తన బాబాయ్ శ్రీనివాస్ తో మాట్లాడినప్పుడల్లా కూడా తాను సివిల్స్ కొట్టి గోల్ రీచ్ అవుతానంటూ ఘంటా పథంగా చెప్పేవాడు. అదే పంథంతో సాయి కిరణ్ రెండో ప్రయత్నంలోనే యూపీఎస్సీ 27వ ర్యాంకు సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన సాయికిరణ్ సీవిల్స్ లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్దేశించే వారు లేకున్నా తనకు తానే టార్గెట్ ఫిక్స్ చేసుకుని గమ్యాన్ని చేరుకున్నాడు. సివిల్ప్ ప్రిపేరేషన్ అనగానే భారీ కసరత్తులు చేయాల్సి వస్తోందన్న భయం వెంటాడుతున్న వారికి సాయి కిరణ్ ఛేజింగ్ స్టైల్ ఆదర్శంగా నిలుస్తోంది. తండ్రి మరణించడంతో తల్లి బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న తీరును కళ్లారా చూసిన ఆ బిడ్డ తన లక్ష్యాన్ని ముద్దాడిన తీరు పదే పదే నిరాశకు గురయ్యే వారంతా ఫాలో అయితే సక్సెస్ దానంతట అదే వస్తుంది. ఆయన కుటుంబం పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నా కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యేందుకు కావల్సిన లిట్రచర్ తో పాటు కోచింగ్ కు కూడా అవసరమైన డబ్బును సమకూర్చుకుంటూ… అక్క ప్రోత్సాహంతో ముందుకు సాగిన తీరు నేటి తరానికి రోల్ మోడల్ అనే చెప్పాలి. సాయి కిరణ్ జీవన గమనాన్ని తెలుసుకుంటే అమ్మో సివిల్సా అని భయపడే యువతలో సరికొత్త ఆశ చిగురించడం ఖాయం.