అప్పులు తీర్చేందుకు తనయుడి స్కెచ్… తండ్రి ఇంట్లోనే చోరీ…

కన్నతండ్రి ఇంటికే కన్నం వేసిన ఘనుడు...

నిందితుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు

దిశ దశ, హుజురాబాద్:

చేసిన అప్పులు తీర్చాలంటే ఎలా..? ఎవరినో ముంచడం కాదు… ఎక్కడో తన చాతుర్యతను ప్రదర్శించడం కాదు… సొంత ఇంటికే కన్నం వేస్తే పోలా అనుకున్నాడా ప్రబుద్దుడు. ఇందుకు పక్కాగా స్కెచ్ వేసేశాడు… పర్ ఫెక్ట్ గా చోరీ చేయించాడు… కానీ పోలీసుల దర్యాప్తుతో అసలు నిజం తెలియడంతో కటకటాల పాలయ్యాడో కొడుకు… కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో జరిగిన చోరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది. తనకున్న అప్పులు తీర్చాలంటే తండ్రి ఇంటిలోనే చోరీ చేసేందుకు వ్యూహం పన్ని పక్కాగా దొరికి పోయాడు కొడుకు. పట్టణంలోని ప్రతాప వాడలో నివాసం ఉంటున్న రాఘవరెడ్డి ఇంట్లో ఆదివారం అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. 70 తులాల బంగారం, రూ. 1.50 లక్షల నగదు దొంగతనానికి గురి కావడం ఓ ఎత్తైతే… వాటర్ ట్యాంక్ మోటార్ స్విచ్ ఆన్ చేసి… ఓవర్ ఫ్లో అయిన తరువాత ఇంట్లో ఉన్న వారు బయటకు రావడంతో దంపతులపై దాడి చేసి చోరీకి పాల్పడ్డారు. పోలీసులకు సవాల్ గా మారిన ఈ కేసు వెలుగులోకి వచ్చిన ఒక రోజు వ్యవధిలోనే ఛేదించారు హుజురాబాద్ పోలీసులు. హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి వివరాలను మీడియాకు వెల్లడించారు.

రెక్కి వేసి…

ప్రతాప వాడలోని రాఘవ రెడ్డి ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై మొదట బీహార్ గ్యాంగ్ రంగంలోకి వచ్చిందా అన్న అనుమానం పోలీసులకు వచ్చింది. దొంగల ముఠాలు ఏమైనా హుజురాబాద్ ప్రాంతంలో సంచరిస్తున్నాయా అన్న కోణంలో ఓ వైపున విచారిస్తున్న పోలీసులకు ఇంటి దొంగలపై అనుమానం కల్గింది. ఈ కోణంలో విచారణ చేసిన హుజురాబాద్ పోలీసులు అసలు విషయాన్ని నిగ్గు తేల్చేశారు. సీసీ ఫుటేజ్, డాగ్ స్క్వాడ్ సహకారం తీసుకుంటూనే పోలీసులు సాంకేతికతపై ఆధారపడి చోరీ ఘటనను ఛేదించి సంచలనం స‌ృష్టించారు. రాఘవరెడ్డి కుమారుడు నాగరాజు స్థానిక ఓ ఆలయ కమిటీ డైరక్టర్ కాగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా కావడం గమనార్హం. నాగరాజుకు రూ. కోటీ 70 లక్షల అప్పు కాగా ఆ అప్పు తీర్చేందుకు తండ్రి రాఘవరెడ్డిని సాయం చేయాలని అభ్యర్థిస్తే ఆయన ససేమిరా అంటారు. దీంతో తన హోటల్ లో పనిచేస్తున్న వ్యక్తి ద్వారా ఓ ముఠాను ఏర్పాటు చేసి చోరీకి పాల్పడ్డాడు.

అమీర్… సమీర్…

నాగరాజు తన అప్పుల విషయం గురించి హోటల్ లో పని చేస్తున్న అమీర్ తో సంప్రదింపులు జరిపాడు. అతను హన్మకొండ జిల్లా సమీర్ ను గురించి వివరిస్తారు. ఇందుకు కరీంనగర్ సమీపంలోని మల్కాపూర్ కు చెందిన సమీర్ కూడా జత కలవగా మరో వ్యక్తి కృష్ణ కూడా చేతులు కలిపాడు. గతంలో రాఘవరెడ్డి ఇంట్లో కన్నం వేసేందుకు పలుమార్లు వాటర్ ట్యాంక్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఉన్న రాఘవరెడ్డి, అతని భార్య మాత్రం బయటకు రారు. ఆదివారం అర్థరాత్రి మాత్రం వాటర్ ట్యాంక్ ఓవర్ ఫ్లో కావడంతో బయటకు రావడంతో దంపతులు ఇద్దరిపై దాడి చేసి బెదిరింపులకు గురి చేస్తారు. దీంతో రాఘవరెడ్డి, అతని భార్య ఇంట్లో ఉన్న నగలు, నగదు వివరాలను వెల్లడిస్తారు. విదేశాల్లో స్థిరపడ్డ రాఘవరెడ్డి కూతురు ఇటీవల స్వస్థలం రావడంతో ఆమెకు సంబంధించిన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాలని నాగరాజు అతని భార్య పథకం పన్ని అమీర్, సమీర్, కృష్షాలను పురమాయిస్తారు. ఆదివారం అర్థరాత్రి ప్రతాప వాడలోని రాఘవరెడ్డి ఇంట్లోకి చొరబడ్డ అగంతకులు వ్యూహం ప్రకారం దొంగతనానికి పాల్పడి పరార్ అవుతారు.

ట్విస్ట్ అక్కడే…

వాటర్ ట్యాంక్ మోటార్ స్విచ్ ఆన్ చేసి ఓవర్ ఫ్లో అయ్యే వరకూ వేచి చూస్తే ఖచ్చితంగా బయటకు వస్తారని గమనించిన ప్రబుద్దులు చివరకు తమ పథకం సక్సెస్ అయిందని సంబురపడ్డారు. చోరీ జరిగిన తీరును సునిశితంగా పరిశీలించిన దర్యాప్తు బృందాలు దీని వెనక ఏదో గుడుపుఠాని ఉందని అనుమానించి ఆ కోణంలో విచారిస్తే అసలు నిజం బయటపడింది. హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ నేతృత్వంలో స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తిరుమల్ తో పాటు ఇతర పోలీసు యంత్రాంగం డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయడంతో గుట్టు రట్టయింది. సోమవారం ఉదయం చోరీ ఘటన వెలుగులోకి రాగా మంగళవారం మద్యాహ్నానికల్లా పోలీసులు దొంగతనం మిస్టరీని ఛేదించడం విశేషం. హుజురాబాద్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులతో పాటు స్థానికులు అభినందనలు చెప్తున్నారు. అయితే నిందితుడు నాగరాజు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా స్థానికంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం పట్టణంలోని ఓ ఆలయ డైరక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page