దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
ఉన్నత చదువులకు ఆటంకంగా మారిన పేదరికంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్న గిరిజన బిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. జేఈఈ అడ్వాన్స్ లో ర్యాంకు సాధించిన ఆమెకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్ల వీర్నపల్లి మండలం గోనె నాయక్ తండాకు చెందిన బదావత్ మధులత 824 ర్యాంకు సాధించడంతో బీహార్ లోని పాట్నాలో సీటు వచ్చింది. అయితే ఆమె చదువుకు అవసరమైన రూ. 3 లక్షలు వెచ్చించే పరిస్థితో కుటుంబం లేకపోవడంతో మేకల కాపరిగా కుటుంబానికి చేదోడును అందిస్తోంది. సరస్వతి పుత్రిక అయినప్పటికీ ఆమెకు లక్ష్మీ కటాక్షం లేదన్న విషయాన్ని పలు పత్రికలు వెలుగులోకి తీసుకొచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ఈ విషయం చేరడంతో మధులత చదువు యథావిధిగా కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నుండి రూ. 1.50 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఉత్త్వరులు వెలువడ్డాయి. పొస్ట్ మెట్రిక స్కాలర్ షిప్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మధులత బిటెక్ ఇంజనీరింగ్ (ఫిజిక్స్) చదివేందుకు మార్గం సుగమం అయింది.