ఆదివాసీ బిడ్డ కండెల మల్లక్క
దిశ దశ, కాటారం:
దట్టమైన అటవీ ప్రాంతంలోని రహదారులు కూడా లేని ఓ కుగ్రామం అది. దీపపు కాంతులే కాంతిని అందించిన రోజుల్లోనే అక్కడ ఓ బిడ్డ జన్మించింది. ఆ ఆదివాసీ బిడ్డ ప్రాథమిక విద్యతో సరిపెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ చదువు మానేసినా… సమాజంలో చైతన్య స్పూర్తిని నింపడంలో ముందు వరసలో నిలిచింది. ఇటీవలే చివరి శ్వాస విడిచిన కండెల మల్లక్క అందించిన స్పూర్తి ఆధర్శప్రాయంగా నిలుస్తుంది.
నిమ్మగూడెం…
నూతన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేది. కాలినడన తప్ప వెల్లే పరిస్థితులు తప్ప రవాణా సౌకర్యంలోని గిరిజన గ్రామం. కీకారణ్యంలో ఉన్న ఈ గ్రామంలో ఎక్కువగా ఆదివాసిలే జీవనం సాగించే వారు. దాదాపు పదుల సంఖ్యలో ఆదివాసి కుటుంబాలు పూరి గుడిసెల్లో జీవనం సాగించే వారు. వనాలతోనే మమేకమైన అడవి బిడ్డలకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండానే ఉండేదని చెప్పవచ్చు. ఏడు దశాబ్దాల క్రితం ఈ గ్రామంలో జన్మించిన కండెల మల్లక్క చదువుకునే పరిస్థితులు కూడా ఆనాడు లేవు. ప్రాథమిక విద్యతోనే సరిపెట్టిన ఆమె ఆదివాసీల గొంతుకై పోరుబాట పట్టారు. 1980వ దశాబ్దంలో విప్లవ పార్టీల కార్యకలపాలు మొదలు కావడంతో ఈమె పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లో పనిచేశారు. అడవి బిడ్డల హక్కుల కోసం జరిగిన పోరాటానికి నాయకత్వం వహించిన కండెల మల్లక్క భూస్వాములకు వ్యతిరేకంగా కూడా నినదించారు. గ్రామంలోని మల్లిఖార్జున రావు అనే భూస్వామికి చెందిన దాదాపు 300 ఎకరాల భూములను గ్రామంలోని నిరుపేదలకు పంచాలని చేపట్టిన పోరాటానికి సారథ్యం వహించారు. అడవుల్లోనే జీవనం సాగిస్తూ సాగు చేసుకునేందుకు వ్యవసాయ భూమిలేని ఆదివాసీల కోసం పోడు వ్యవసాయం చేసుకోవడంలోనూ తనవంతు పాత్ర పోషించారు. ఈ గ్రామానికి చెందిన మల్లిఖార్జున రావు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన ఎన్టీరామారావు సమీప బంధువు కావడంతో ఆయన కోసం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అయినా కూడా సీఎం హోదాలో నిమ్మగూడెం వచ్చారు. 1986 సమయంలో ఎన్టీరామారావు పర్యటన తరువాత మల్లిఖార్జున రావును పీపుల్స్ వార్ నక్సల్స్ భూస్వామి అని హత్య చేశారు.
తుడుం దెబ్బ…
ఆదివాసీ హక్కుల సాధన కోసం సాగిన పోరాటంలోనే కండెల మల్లక్క కీలక భూమిక పోషించారు. తుడుం దెబ్బ కార్యకలాపాలను విస్తరింపజేసేందుకు శ్రీకాకుళం నుండి మొదలు నల్లమల్ల వరకు పర్యటనలు చేసి హక్కుల సాధన కోసం ఉద్యమ స్పూర్తిని రగిల్చిన చరిత్ర ఆమెది. ఢిల్లీలో జరిగిన నిరసనల్లోనూ పాల్గొని ఆదివాసీల హక్కులను హరించవద్దంటూ నినదించారు. ‘‘ జల్, జంగల్ జమీన్’’ అన్న నినాదాన్ని అందిపుచ్చుకుని ఆధివాసీ బిడ్డలు గొంతుకై పోరాటం చేసిన తీరు నేటి తరానికి అంతగా తెలియకపోవచ్చు.
సమాజ హితం…
అడవిలో పుట్టి పెరిగిన కండెల మల్లక్క కేవలం ఉద్యమాల బాటలోనే పయనించలేదు. 1990వ దశాబ్దంలో మొదలైన వనసంరక్షణ సమితీల ద్వారా వనాలను రక్షించేందుకు తనవంతు బాధ్యతలను నిర్వర్తించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన VSS ప్రతినిధిగా వనాల సంరక్షణ కోసం కూడా అటవీ ప్రాంతంలో చైతన్యం నింపేందుకు శ్రమించారు. అంతేకాకుండా వన్య ప్రాణులను చేరదీసి వాటిని పెంచి పోషించారు. అడవుల్లో స్వేచ్ఛగా తిరుగాడే ప్రాణులకు ఆహారం దొరకక, నీరు లభ్యం కాని వేళల్లో వాటిని రక్షించేందుకు కూడా చొరవ చూపారు. ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా లేని ఓ కుగ్రామంలో జన్మించిన కండెల మల్లక్క ఇటీవల మరణించిన తరువాత ఆ సమయంలో ఇక్కడి అటవీ ప్రాంతంలో పీపుల్స్ వార్ లో పని చేసి జనజీవనంలో కలిసిన జంపన్న, దేవన్నలతో పాటు పలువురు నిమ్మగూడెంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కండెల మల్లక్క చేపట్టిన పోరాటాల గురించి స్మరించుకున్న వారు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.