సింగరేణి అధికారుల చిత్ర విచిత్రాలు…
దిశ దశ, చెన్నూరు:
ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల బాధిత గ్రామాల సంక్షేమాన్ని పట్టించుకోవడంలో విఫలం అవుతున్న సింగరేణి యాజమాన్యం… అవసరం లేని చోట పనులు చేపట్టి నిధులు వృధా చేసే విధంగా వ్యవహరిస్తుండడం సంచలనంగా మారింది. సింగరేణి ప్రభావిత గ్రామాల్లో సౌకర్యాలు కల్పించేందుకు ముందుకు రాని అధికారులు ఓ రైస్ మిల్లు కోసం ప్రత్యేకంగా రహదారి వేసేందుకు నిధులు వెచ్చించడం విస్మయానికి గురిచేస్తోంది. జైపూర్ మండలం రామారావుపేట శివారులో ఉన్న ఓ రైస్ మిల్లు కోసం ప్రత్యేకంగా రోడ్డు వేసేందుకు సింగరేణి సంస్థ నిధులు కెటాయించడం విడ్డూరంగా ఉందని గ్రామస్థులు అంటున్నారు. ఇందు కోసం రూ. 95 లక్షలు కెటాయించి టెండర్ కు కూడా పిలవడం ఏంటని ఇందారం, రామారావుపేట మాజీ ఎంపీటీసీ మెంబర్లు అరికె స్వర్ణ సంతోష్ యాదవ్, రామారావు పేట మాజీ ఎంపీటీసీ పెద్దల బాపులు వ్యాఖ్యానించారు. అవసరం లేని చోట నిధులు వెచ్చించి బీటీ రోడ్లు వేయడం వల్ల సింగరేణి నిధులు వృదా కావడం తప్ప మరోటి కాదన్నారు. ఈ మేరకు సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కు కూడా వినతి పత్రం ఇచ్చిన మాజీ ఎంపీటీసీ సభ్యులు సింగరేణి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని అభ్యర్థించారు.
ఎమ్మెల్యే అభ్యంతరం…
ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు పరిసర గ్రామ అయినా రామారావుపేటలో కొత్తగా నిర్మించ తలపెట్టిన రోడ్డుకు కెటాయించిన నిధులను రద్దు చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. రెండు రోజుల క్రితం సింగరేణి అధికారులతో మాట్లాడిన వివేక్ నిధులు దుర్వినియోగం అయ్యే విధంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. వెంటనే రోడ్డు టెండర్ రద్దు చేయాలని, బాధిత గ్రామాల ప్రజల అవసరాలు తీర్చేందుకు నిధులు వెచ్చించాలని స్పష్టం చేసినట్టుగా సమాచారం.
రోడ్డు ఉండగానే…
సింగరేణి ఓపెన్ కాస్ట్ లోకి రాకపోకలు సాగించేందుకు ప్రత్యేకంగా రోడ్డు ఉన్నప్పటికీ కొత్త రోడ్డు కోసం నిధులు వెచ్చించడం వెనక ఆంతర్యం ఏంటో సింగరేణి అధికారులకే తెలియాలి. ఇప్పటికే ఉన్న రోడ్డు మీదుగా ఓసీపీకి చెందిన వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయన్న విషయాన్ని కూడా విస్మరించి కొత్త రోడ్డు కోసం ప్రతిపాదించడానికి కారణమేంటోనన్న విషయం అర్థం చేసుకోవల్సిన అసవరం ఉందని స్థానికులు అంటున్నారు. కేవలం ఒక రైస్ మిల్లు ఉన్న ప్రాంతానికి రోడ్డు వేసేందుకు రూ. 95 లక్షల సింగరేణి సంస్థ నిధులు కెటాయించడంపై స్థానికంగా చర్చ సాగుతోంది. బాధిత గ్రామాల్లోని ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు కానీ, సామూహిక అవసరాలకు కానీ నిధులు కెటాయించడానికి మీనామేషాలు లెక్కిస్తున్న సింగరేణి అధికారులు ప్రత్యేకంగా రోడ్డు వేయడం సరికాదని మాజీ ఎంపీటీసీ సభ్యుడు స్వర్ణ సంతోష్ యాదవ్ అన్నారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మించి 8 నెలలు గడుస్తున్నా కేవలం బోరు వేయించేందుకు చొరవ చూపని సింగరేణి అధికారులు రూ. 95 లక్షల రూపాయలు పెట్టి ప్రత్యేకంగా రోడ్డు వేయించేందుకు ముందుకు రావడం వెనక ఉన్న అసలు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అంచనాలు ఎలా..?
టెండర్ ప్రక్రియ చేపట్టే నాటికి అయినా, పనులు చేపట్టిన రోజయిన ఈ వ్యవహారం వెలుగులోకి వస్తుందన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా అవసరం లేకున్నా రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేయడం విమర్శలకు దారి తీస్తోంది. పక్కనే రోడ్డు ఉండడంతో పాటు కొత్తగా వేయాల్సిన రోడ్డు వల్ల ఎవరికి ఉపయోగపడుతుందన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా అంచనాలు ఎలా తయారు చేశారో కూడా అంతు చిక్కకుండా పోతోంది. ఎస్టిమేట్లు చేసినప్పుడు అధికారులు క్షేత్ర స్థాయి సర్వే జరిపారా లేదా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. సింగరేణి నిధులను వృధా అయ్యేందుకు తీసుకుంటున్న నిర్ణయాలకు స్వస్తి పలికి సమీప గ్రామాల్లోని ప్రజల సంక్షేమం కోసం నిధులు వెచ్చిస్తే బావుంటుందని స్థానికులు అంటున్నారు.