ధర్మపురి స్ట్రాంగ్ రూం వైఫల్యాలపై ఫిర్యాదు
దిశ దశ, జగిత్యాల:
ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూం మిస్సింగ్ మిస్టరీ వ్యవహారంపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఓ వైపున హైకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ అభ్యర్థి మరోవైపున ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. హై కోర్టు ఆదేశాలతో జగిత్యాలలోని ఈవిఎం స్ట్రాంగ్ రూం తాళాలను పగలగొట్టిన తరువాత లోపలి పరిస్థితులపై సమగ్రంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని సీఈఓ వికాస్ రాజ్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, అడ్లూరిలు స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ ను కలిసి స్ట్రాంగ్ రూం వ్యవహారాల గురించి వివరించారు. ఆదివారం నూకపల్లి వీఆర్కే కాలేజీ ఈవీఎం స్ట్రాంగ్ రూం కీస్ మిస్ కావడం,. కౌంటింగ్ సమయంలో తీసిన వీడియో ఫుటేజీలు అందులో లేకపోవడం, స్ట్రాంగ్ పరిసరాలతో పాటు అందులోని సీసీ కెమెరాల ఫుటేజీ కూడా అందుబాటులో లేవన్న విషయాలను సీఈఓకు వివరించారు. అలాగే స్ట్రాంగ్ రూంలో ట్రంకు పెట్టెలు క్రమ పద్దతిలో లేవని, వాటిలో కొన్నింటికి మాత్రమే తాళాలు వేశారని, వేసిన వాటి కీస్ కూడా మాయం అయ్యాయని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. 17సీ ఫామ్స్ కు సంబంధించిన పత్రాలకు సీల్ లేకపోవడంతో పాటు నిబంధనలకు విరుద్దంగా చాలా అంశాలు సాక్షాత్కరించాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
ఈసీఐ సీఈఓ అపాయింట్ మెంట్ కోసం..
మరో వైపున భారత ఎన్నికల సంఘం సీఈఓ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వాలని కోరుతు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ న్యూ ఢిల్లీలోని ఈసీఐ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. ధర్మపురి ఎన్నికల ఈవీఎం సెంటర్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఇక్కడ జరిగిన నిబంధనలకు విరుద్దంగా జరిగిన వ్యవహారాలపై ఫిర్యాదు చేసేందుకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమాయత్తం అవుతున్నారు. ఈసీఐ నుండి అపాయింట్ మెంట్ ఫిక్స్ అయితే వెంటనే న్యూఢిల్లీకి వెల్లి కూడా ఫిర్యాదు చేయనున్నారు.
నిన్నొదల బొమ్మాళి…
ఎన్నికలు జరిగిన నాలుగున్నరేళ్లు కావస్తున్నా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రం నిబంధనలు పాటించని అధికార యంత్రాంగంపై సీరియస్ గా పోరాటం చేసే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకు హైకోర్టును మాత్రమే ఆశ్రయించి ఇక్కడి తప్పిదాలను హై కోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఆయన తాజాగా ఎన్నికల కమిషన్ తలుపు తట్టడం సంచలనంగా మారింది. స్ట్రాంగ్ రూం ఓపెన్ చేసిన తరువాత లోపల ఏలాంటి పరిస్థితులు నెలకొన్నాయో వివరిస్తూ ఫిర్యాదు చేస్తుండడం అధికార వర్గాలను కలవరపర్చే విషయమనే చెప్పాలి. ఇప్పటికే కీస్ మిస్సింగ్ మిస్టరీపై హై కోర్టు విచారించాలని ఈసీఐని ఆదేశించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషన్ అధికారుల బృందం ముగ్గురు కలెక్టర్లను, ఇతర అధికార యంత్రాంగాన్ని విచారించింది. ఈ నివేదిక ఈ నెల 26న హై కోర్టు ముందు ఈసీఐ ఉంచనుంది. మరో వైపున అడ్లూరి కూడా ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించడంతో ఆయన ఫిర్యాదులోని అంశాలను కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్న ఉత్కంఠ నెలకొంది.