సీలింగ్ భూముల వ్యవహారంలో అధికారులు తీరు…
ట్రిబ్యూనల్ ఆదేశించిన చొరవ చూపని వైనం
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ సీలింగ్ భూముల వ్యవహారంలో రెవెన్యూ అధికారుల వింత వైఖరి అవలంభించినట్టుగా స్పష్టం అవుతోంది. అనుబంధ విభాగం నుండి వివరాలు సేకరించే విషయంలో నిర్లక్ష్యం వహించిన తీరు విస్మయం కల్గిస్తోంది. భూ స్వాముల చేతిలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రంలో సీలింగ్ చట్టాన్ని అమలు చేసింది. ఈ మేరకు పెత్తందార్లు అదనంగా ఉన్న భూములను ప్రభుత్వానికి అప్పగించాలని, లేనట్టయితే ప్రభుత్వమే వాటిని స్వాధీనం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. 1973లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకరాం ప్రభుత్వం ఆధీనంలో వేలాది ఎకరాల భూమి ఉండాలి. కానీ వాటిని కాపాడడంతో పాటు రెవెన్యూ రికార్డుల్లో సీలింగ్ భూమి అన్న విషయాన్ని నమోదు చేయకపోవడంతో పట్టాదారుల ఇష్టారాజ్యంగా మారిపోయింది. ఇందుకు రెవెన్యూ అధికారులు కూడా పట్టాదారులకు అనుకూలంగా వంతపాడడంతో సర్కారు చేతిలో ఉండాల్సిన ల్యాండ్ బ్యాంక్ అంతా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెల్లిపోయింది. ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారులు కూడా ఈ వ్యవహారంలో తమ వారికి భూములు కట్టబెట్టేందుకు సీలింగ్ రికార్డుల వైపు కన్నెత్తి చూడకుండా ఉండే విధంగా జాగ్రత్త పడ్డారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే కరీంనగర్, జగిత్యాల ప్రాంతంలో జి వి సదాశివరావు పేరిట ఉన్న 380 ఎకరాల భూమి విషయంలో సీలింగ్ ట్రిబ్యూనల్ లో కేసు నడుస్తోంది. ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసుకున్న పట్టాదారులు ఈ కేసును రంగారెడ్డి కోర్టుకు బదిలీ చేయించుకున్నారు. అయితే ఈ కేసు ఇంకా కోర్టులోనే నడుస్తున్నందున పట్టాదారుకు చెందిన భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాల్సి ఉంటుంది. సీలింగ్ కేసు విచారణ పూర్తయి తీర్పుతో పాటు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసే వరకూ కూడా పట్టాదారులు ఎలాంటి లావాదేవీలు చేయరాదని సీలింగ్ చట్టం తేల్చి చెప్తోంది. అంతే కాకుండా సెక్షన్ 17 ఆప్ ఎల్ఆర్ఏ, 19ఏ3 ప్రకారం తుది తీర్పు, గెజిట్ విడుదల అయ్యే వరకూ జరిగే భూ క్రయవిక్రయాలపై నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడిస్తోంది. అయితే జి వి సదాశివరావుకు చెందిన భూములు విక్రయించే విషయంలో రెవెన్యూ అధికారులు మాత్రం సీలింగ్ యాక్టు విషయాన్నే పట్టించుకోకుండా లావాదేవీలకు అనుమతి ఇవ్వడం విచిత్రంగా ఉంది. బొమ్మకల్, నగునూరు శివార్లలోని భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పట్టాదారులు, ప్రైవేటు వ్యక్తులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా కూడా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం విస్మయం కల్గిస్తోంది. గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తరువాత జి వి సదాశివ రావుకు చెందిన భూములు వారసులు విక్రయించుకున్నారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. నయీం అనుచరులుగా పేర్కొంటూ పలువురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ భూములను అప్పటికే పట్టాదారుల వారసులు ప్లాట్లుగా చేసి వేరే వారికి విక్రయించారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే జివి సాంబశివరాడు వారుసుని పేరు కూడా సాంబశివరావే కావడంతో అసలు పట్టాదారుగా చెలామణి అయి విక్రయించారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. జివి సదాశివరావు వారసుల్లో విబేధాలు పొడసూపడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. పెద్ద ఎత్తున రాద్దాంతం జరిగిన ఈ అంశంలో సీలింగ్ భూములు ఉన్నాయన్న విషయం కూడా వెలుగులోకి వచ్చినా రెవెన్యూ అధికారులు రికార్డుల వైపు తొంగి చూసి చట్ట ప్రకారం రెండు పార్టీలు చేసిన రిజిస్ట్రేషన్లు చెల్లవని, సీలింగ్ యాక్టు చట్టం తేల్చి చెప్తున్న అంశంపై మాత్రం నివేదికలు ఇవ్వలేదు.
చల్మెడ హాస్పిటల్…
ఇకపోతే చల్మెడ పరిధిలో ఉన్న భూములు కూడా సీలింగ్ యాక్టు అమల్లో ఉన్న భూములేనని రెవెన్యూ రికార్డులే చెప్తున్నాయి. రెవెన్యూ అధికారుల పరిధిలో ఉన్న ఈ భూముల్లో వేసిన పంటలు విక్రయించి వచ్చిన డబ్బును ప్రభుత్వం ఖాతాలో జమచేయాలని ఆదేశించింది ట్రిబ్యూనల్. అయితే సీలింగ్ పరిధిలోకి వచ్చిన ఈ భూముల విషయంలో రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరించడకపోవడంతో చాలా వరకు కూడా పట్టదారులు తమ ఆధీనంలోనే పెట్టుకుని సాగు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ భూములను యాక్షన్ ద్వారా లీజుకు ఇచ్చి కౌలు ద్వారా వచ్చే డబ్బులను ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలన్న ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం ఆ దిశగా చొరవ చూపకలేదన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే సదాశివరావుకు చెందిన బొమ్మకల్ శివార్లలోని 113, 114, 115, నగునూరు శివార్లలోని 383, 488, 439, 443, 549, 550, 581, 584, 442 సర్వే నెంబర్లలోని భూములను లీజుకు ఇచ్చినట్టయితే సాగు చేసుకుని ప్రభుత్వానికి కౌలు డబ్బులు చెల్లిస్తామని కొంతమంది రైతులు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు స్పందించిన రెవెన్యూ అధికారులు 2023లో LRA NO. 02/2007, LRAT, మూడో అడిషనల్ జిల్లా జడ్జి కోర్టులో పెండింగ్ లో ఉన్నందున రైతులు ఇచ్చిన అర్జిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని తేల్చారు. అయితే ఇక్కడే రెవెన్యూ అధికారులు తప్పులే కాలేశారు. 2006లో జగిత్యాల సీలింగ్ యాక్టు ట్రిబ్యూనల్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇదే చల్మెడ మెడికల్ కాలేజీ నిర్మాణం జరిపిన భూములపై క్షేత్ర స్థాయిలో విచారణ చేశారు. 113, 115 సర్వే నెంబర్లలోని భూముల్లో సాగు చేసుకుంటున్నారని గుర్తించారు. అంతేకాకుండా 115 సర్వే నంబర్ భూమిలో చల్మెడ మెడికల్ కాలేజీకి సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. అయితే సాగు చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకునేందుకు సాహసించిన రెవెన్యూ అధికారులు హస్పిటల్ నిర్మాణాల విషయాన్ని ఎందుకు విస్మరించారన్నదే పజిల్ గా మారింది. అయితే జగిత్యాల ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు తమకు సాగు చేసుకునేందుకు లీజుకు ఇవ్వాలని అభ్యర్థించిన రైతుల విషయంలో ట్రిబ్యూనల్ విచారణ అంశం తెరపైకి తెచ్చిన అధికారులు, చల్మెడ హస్పిటల్ నిర్మాణం విషయంలో ఎందుకు విస్మరించారన్నదే వేయి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. సాధారణ రైతులు ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు కౌలుకు ఇవ్వాలని అడిగితే ట్రిబ్యూనల్ విచారణ బూచి కనిపించింది కానీ బడా బాబులు విషయంలో ఎందుకు కనిపించలేదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ప్రశ్నిస్తున్నారు. రైతులు సాగు చేసుకునేందుకు అధికారులకు కనిపించిన ట్రిబ్యూనల్ కేసు విచారణ అంశం చల్మెడ మెడికల్ కాలేజీ విషయంలో ఎందుకు కనిపించలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు.