ఆ రెండు పార్టీలది అదే నినాదం…

సరిహద్దు ప్రాంతంపై మమకారం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఆ ప్రాంతం అంతా ఇప్పుడు ఇతర జిల్లాల్లో చేరిపోయింది. నూతన జిల్లాల ఆవిర్భావం తరువాత ఆ నియోజకవర్గం కూడా ముచ్చటగా మూడు జిల్లాల్లో చేరిపోగా మరో నియోజకవర్గంలోని ఓ మండలంలో ఇంకో జిల్లాలో చేరింది. అయితే ఆ ప్రాంత వాసుల కొంతకాలం తాము పూర్వ జిల్లాలోనే ఉంటామని డిమాండ్ చేశారు. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఆ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతామన్న నినాదాన్ని ఎత్తుకున్నారు.

బెజ్జంకిపై బీజేపీ…

మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం కొత్త జిల్లాల ఆవిర్భావం తరువాత సిద్దిపేట జిల్లాలో చేరింది. అయితే తమ మండలాన్ని కరీంనగర్ జిల్లాలోనే ఉంచాలన్న డిమాండ్ వినిపించారు ఇక్కడి ప్రజలు. పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనల సమయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇటీవల బెజ్జంకి మండల కేంద్రంలో స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. బెజ్జంకి మండల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ అధికారంలోకి రాగానే బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతామని ప్రకటన చేశారు. దీంతో మరోసారి ఈ అంశంపై తెరపైకి వచ్చినట్టయింది.

హుస్నాబాద్ ధైన్యం…

వాస్తవంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి అత్యంత విచిత్రమైన పరిస్థితే అని చెప్పాలి. నియోజకవర్గంలోని కొన్ని మండలాలు హుస్నాబాద్, కోహెడ మండలాలు సిద్దిపేటలో చేరగా, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హన్మకొండ జిల్లాలో, సైదాపూర్, చిగురుమామిడి మండలాలు కరీంనగర్ జిల్లాలో చేరాయి. తాజాగా హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా విలీనం గురించి ప్రకటన చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలను ఒకటే జిల్లాలో కలుపుతామని, కరీంనగర్ జిల్లాలో చేర్చి ఇక్కడ ప్రజలకు పరిపాలన సౌలభ్యం ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో హుస్నాబాద్ సెగ్మెంట్లో టీపీసీసీ చీఫ్ ప్రకటన చేసి ఇక్కడి ప్రజల్లో నెలకొన్న ఆకాంక్షను నెరవేరుస్తానని హామీ ఇచ్చినట్టయింది.

అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా సరిహద్దు ప్రాంతాల్లో పూర్వ జిల్లాలో విలీనం చేస్తామన్న నినాదాన్ని ఎత్తుకుని ఇక్కడి ప్రజల్లో తమ పట్టు నిలుపుకునే ప్రయత్నాల్లో మునిగిపోయాయి. రెండు పార్టీల స్టేట్ చీఫ్ లు కూడా పూర్వ జిల్లాల పరిధిలో చేర్చుతామని ప్రకటించిన తీరుపై అక్కడి ప్రజల నుండి ఎలాంటి స్పందన ఉంటుందో తేలాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

You cannot copy content of this page