ప్రజావాణికి చేరుకున్న బాధితుడు
దిశ దశ, కరీంనగర్:
తన భూమి వేరేవారి పేరిట రికార్డుల్లో మారిందని న్యాయం చేయాలంటూ ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోవడంతో బాధిత రైతు వినూత్న పద్దతిలో ప్రజావాణికి చేరుకున్నాడు. పట్టాదారు పేరునే మార్చి తనకు అన్యాయం చేశారని తప్పును సవరించాలంటూ ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులకు చేసిన దరఖాస్తులను హారంగా వేసుకుని కలెక్టరేట్ కు చేరుకున్నాడు. కన్నీటి పర్యంతం అవుతూ బాధిత రైతు తన గోడు వెళ్లబోసుకునేందుకు మెడలో వినతి పత్రాల హారం వేసుకుని రావడం కలకలం సృష్టించింది. కరీంనగర్ కలెక్టరేట్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుభుత్కూరుకు చెందిన నాంపెల్లి అనే రైతు తన సమస్య పరిష్కారం కోసం చేపట్టిన ఈ వినూత్న నిరసన సంచలనంగా మారింది. తనకు చెందిన 31 గుంటల భూమిని వేరే వారి పేరిట రికార్డుల్లో మార్చారని తెలిపాడు. రెవెన్యూ యంత్రాంగం చేసిన ఈ తప్పిదాన్ని సవరించి తనకు న్యాయం చేయాలంటూ తరుచూ దరఖాస్తు చేసుకుంటున్నా పరిష్కించే వారే లేకుండా పోయారని నాంపెల్లి వాపోయాడు. దీంతో ఇంతకాలం తాను అధికారులకు ఇచ్చిన వినతి పత్రాల హారాన్ని మెడలో వేసుకుని కలెక్టరేట్ లోని ప్రజావాణి వద్దకు చేరుకున్నాడు. అతన్ని గమనించిన పోలీసులు బయటే నిలువరించి తనిఖీ చేయగా పురుగుల మందు డబ్బా కూడా లభ్యం అయింది. తన సమస్యను పరిష్కరించే నాథుడే లేడని తానీ నిర్ణయం తీసుకున్నానంటూ నాంపెల్లి ఆవేదనతో వివరించారు. నాంపెల్లిని గమనించిన ఆర్డీఓ ఆనంద్ కుమార్ ప్రజా వాణి వేదికపై నుండి అతని వద్దకు వచ్చి వివరాలు సేకరించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే తనకు సంబంధించిన భూమిని వేరే వారి పేరిట మార్చి అధికారులు తప్పు చేస్తే ఇప్పుడు తనను కోర్టుకు వెళ్లాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ను కూడా కలిసి నాంపెల్లి తన బాధను వెలిబుచ్చాడు.
