మంథని కాంగ్రెస్ పార్టీలో చర్చ…
దిశ దశ, మంథని:
మాజీ సర్పంచ్ వీడియో తీసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తరువాత మంథని కాంగ్రెస్ పార్టీలో ఓ కుదుపు ప్రారంభం అయినట్టుగాః కనిపిస్తోంది. అపస్మారక స్థితికి చేరుకున్న సత్యనారాయణ ప్రస్తుతం వరంగల్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆత్మహత్యాయత్నానికి ముందు వీడియోలో చేసిన వ్యాఖ్యల ప్రభావం ఎవరిపై పడుతుందోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది.
ఆసుపత్రిలో…
ఈ నెల 10వ తేది సాయంత్రం వీడియో రిలీజ్ చేసిన కాటారం మండలం విలాసాగర్ మాజీ సర్పంచ్ అందె సత్యనారాయణ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలించారు. సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నట్టు సమాచారం. ఆయన సోదరుడు శ్రీను బాబు ఆసుపత్రికి వెల్లి అందె సత్యనారాయణకు అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. అతన్ని కాపాడేందుకు అయ్యే ఖర్చుల గురించి వెనకడకుండా చూడాలని తమవంతు సహకారం ఉంటుందని శ్రీను బాబు వైద్యులతో చెప్పినట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కుటుంబంతో అనుబంధం ఉన్న వ్యక్తి కావడంతో పాటు ఇటీవలె భార్యను కూడా కోల్పోయిన సత్యనారాయణ విషయంలో శ్రీధర్ బాబు ఫ్యామిలీ ప్రత్యేక శ్రద్ద వహిస్తోందని చెప్తున్నారు.
వీడియో చుట్టే…
అందె సత్యనారాయణ ఆత్మహత్యయత్నానికి ముందు రిలీజ్ చేసిన వీడియో చుట్టే నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. ఈయన ఈ ఘటనకు పాల్పడకముందు నెలకొన్న పరిస్థితులు ఏంటీ అన్న చర్చ సాగుతోంది. అంతకుముందు రోజు జరిగిన పరిణామాలు, ఆత్మహత్యాయత్నానికి ముందు ఏం జరిగింది అన్న వివరాలను మంత్రి శ్రీధర్ బాబు తెలుసుకున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అంతేకాకుండా వీడియోలో సత్యనారాయణ కొందరి పేర్లు ప్రస్తావించిన అంశాన్ని కూడా మంత్రి సీరియస్ గా తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ పరంగా అయినా పదవుల పరంగా అయినా, ఆర్థికంగా ఎదిగేందుకు అయినా తన వంతు సహకారం అందిస్తున్నప్పటికీ కొంతమంది నిరాశకు ఎందుకు గురవుతున్నారన్న విషయం అంతుచిక్కకుండా పోయిందని శ్రీధర్ బాబు అంటున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వెన్నుదన్నుగా నిలుస్తున్నా తన వెనక మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న విషయం సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో వెలుగురావడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. తాజాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ప్రాధాన్యత ఇస్తున్న సీనియర్ల పేర్లు కూడా ఆయన నోటి నుండి రావడం వెనక అసలు కారణం ఏంటో అర్థం కాకుండా పోయిందని పార్టీ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. శ్రీధర్ బాబు అక్కున చేర్చుకుని అందలం ఎక్కిస్తున్నా కూడా కొంతమంది నాయకులు నిరాశ నిసృహలకు గురవుతుండడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సత్యనారాయణ ఊటంకించిన వారి పట్ల మంత్రి ఎలా స్పందిస్తారోనన్న కలవరం అయితే పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులపై శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుండగా, వీడియోలో పేర్లు ఉన్న వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో నన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో సత్యనారాయణ ఎపిసోడ్ విషయంలో ఫలానా వారి పాత్ర ఉందంటే ఫలనా వారి పాత్ర ఉందంటూ చర్చలు మాత్రం దండిగా సాగుతున్నాయి.