తెలంగాణాలో చెరగని ముద్ర
దిశ దశ, కరీంనగర్:
సింగాపూర్ అనగానే నేటి తరానికి దేశం పేరు గుర్తుకు వస్తుంది… కానీ ఆ ప్రాంతంలో ఆ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మాత్రం ఆ ఊరే. ఇంటిపేరు వొడితెలే అయినా ఆయన్ని మాత్రం సింగాపూర్ రాజేశ్వర్ రావు అని పిలిచేవారు ఆ ప్రాంత వాసులు. సింగాపూర్ రాజేశ్వర్ రావు అంటే ఆ కాలంలో సింగాపూర్ దేశానికి వెళ్లాచ్చారని అందుకే ఆయనకు ఆ బ్రాండ్ క్రియేట్ అయిందని కూడా అనుకునే వారు చాలామంది. కానీ నిజానికి ఆయన స్వగ్రామం సింగాపూర్ కాబట్టి ఆ ఊరి పేరే ఆయన ఇంటి పేరుగా మారిందన్న విషయం హుజురాబాదేతర ప్రాంతాల్లోని చాలమందికి తెలియదు.
వైవిద్యమైన నేపథ్యం
భూస్వామ్య కుటుంబంలో పుట్టిన వొడితెల రాజేశ్వర్ రావును హుజురాబాద్, భీమదేవరపల్లితో పాటు కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో ‘దొర’ అని పిలిచేవారు. భూస్వామ్య కుటుంబం నుండి వచ్చిన ఆయన మాత్రం వైవిద్యమైన జీవితమే గడిపారని చెప్పాలి. ‘దొర’ అంటే పెత్తందారి తనం చూపించడం కాదు… తనపై నమ్మకం ఉంచిన వారిని అక్కున చేర్చుకోవాలన్న తపనపడిన వ్యక్తిగా పూర్వీకులు చెప్తుండేవారు. తిండి గింజలు కూడా దొరకని కష్టకాలంలో తన ఇంటికి వచ్చే వారికి పట్టెన్నం పెట్టాలన్న సంకల్పంతో ఏర్పాట్లు చేశారు. 1970-80వ దశాబ్దం వరకు అన్ని వేళల్లో వొడితెల ఇంటి ఆవరణలో ఆహారం అందుబాటులో ఉండేదని అంటుంటారు. ఏ స్థాయి వారైనా వారింటికి వచ్చారంటే ఆతిథ్యం తీసుకుని వెళ్లాల్సిందేనన్న ఆనవాయితీ కొంతాకాలం పాటు సాగింది.
తొలినాళ్లలోనే…
1931 సెప్టెంబర్ 16న జన్మించిన సింగాపూర్ రాజేశ్వర్ రావు ఉన్నత విద్యాభ్యాసం వరకు హన్మకొండలో అందుకున్నారు. యవ్వనంలోకి అడుగు పెట్టిన తొలి నాళ్లలోనే ప్రజా క్షేత్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హుజురాబాద్ తాలుకా కమిటీ సభ్యునిగా, జిల్లా అభివృద్ది ప్రణాళిక కమిటీ సభ్యులుగా, నేషనల్ ఎక్స్ టెన్షన్ సర్వీసెస్ బ్లాక్స్ కు ప్రాతినిథ్యం వహించడంతో పాటు భీమదేవరపల్లి సమితి అధ్యక్షునిగా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అగ్రికల్చర్ డెవలప్ మెంట్ బ్యాంకు డైరక్టర్ గా, 1964లో సింగాపూర్ సర్పంచ్ గా ఎన్నికయిన ఆయన 1972 నుండి 78 వరకు ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ్యునిగా, 1980 నుండి 85 వరకు శాసనమండలి సభ్యునిగా భాధ్యతుల నిర్వర్తించారు. 1992లో రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన రాజేశ్వర్ రావు ఇండస్ట్రీ హౌజ్ కమిటీ సభ్యునిగా, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులుగా కూడా పని చేశారు. అలాగే 1994 నుండి 1996 వరకు సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీలో, పట్టణ, గ్రామీణాభివృద్ధి, పర్యాటక మంత్రిత్వ శాఖ కమిటీల్లో కూడా సభ్యునిగా ప్రాతినిథ్యం వహించారు. గాంధీ భవన్ ట్రస్టు సభ్యులుగా, వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ ఛైర్మన్ గా కూడా పని చేశారు.
మూడు సభలకు ప్రతినిధిగా…
భారత దేశ చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించిన అరుదైన చరితను అందిపుచ్చుకున్న వారిలో సింగాపూర్ రాజేశ్వర్ రావు ఒకరు. ఆయన మూడు సభలకు ప్రాతినిథ్యం వహించిన అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి విధాన సభలో అడుగు పెట్టిన ఆయన, శాసనమండలి సభ్యునిగా పరిషత్తుకు కూడా ప్రాతినిథ్యం వహించారు. రాజ్యసభ సభ్యులుగా కూడా ఎన్నికైన రాజేశ్వర్ రావు ఒక్క లోకసభకు మాత్రం ప్రాతినిథ్యం వహించలేకపోయారు. జాతీయ స్థాయిలో రాజ్యసభ, లోకసభ, రాష్ట్ర స్థాయిలో అయితే విధానసభ, విధాన పరిషత్తులు ఉంటాయి. ఇందులో మూడింటిలోనూ ఆయన ప్రాతినిథ్యం వహించిన ఘనత సాధించారు.
ఆ క్రెడిట్ ఆయనదే…
యూరప్ లోని నెదర్లాండ్స్ పర్యటించినప్పుడు అక్కడి అధికారులు తాగు నీటి కోసం చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఇదే స్పూర్తిని అందుకున్న రాజేశ్వర్ రావు నియోజకవర్గంలోని 44 గ్రామాలకు తాగు నీరందించేందుకు తుమ్మనపల్లి వద్ద రూ. 5 కోట్ల 53 లక్షలతో పిల్టర్ నిర్మించేందుకు కృషి చేశారు. నేటికీ ప్యూరీఫైడ్ వాటర్ అంటేనే శుద్ద జలం అనుకుంటున్నప్పటికీ ఆ కాలంలోనే నెదర్లాండ్స్ లో ఆల్కలైన్ వాటర్ అందించే విధానాన్ని అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోందని గ్రహించిన రాజేశ్వర్ రావు 33 ఏళ్ల క్రితమే హుజురాబాద్ ప్రాంత వాసులకు ఆరోగ్యాన్ని అందించే తాగు నీటిని సరఫరా చేసేందుకు కృషి చేశారు.
పీవీ సన్నిహితునిగా…
బహుభాషా కోవిధులు, మౌన ముని పీవి నరసింహరావుకు వొడితెల రాజేశ్వర్ రావు అత్యంత సన్నిహితులు. మొదటి నుండి కూడా ఆయన వెన్నంటి నడిచిన సింగాపూర్ రాజేశ్వర్ రావు పీవి ప్రధానిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ మిస్సయ్యారని ప్రచారం జరుగుతుండేది. 1989 నుండి 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. ముఖ్యమంత్రులుగా చెన్నారెడ్డి, నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలకు అధిష్టానం బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. ఈ సమయంలో ఎమ్మెల్యేగా రాజేశ్వర్ రావు ఎన్నికయినట్టయితే పీవి ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించే వారన్న అభిప్రాయాలు హుజురాబాద్ ప్రాంత వాసులు వ్యక్తం చేసేవారు. అయితే ఎన్టీరామారావు శాసనమండలిని రద్దు చేయడంతో ఆయన ఎమ్మెల్సీగా చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. లేనట్టయితే ఆయన ఖచ్చితంగా సీఎం కుర్చిలో కూర్చునేవారన్న అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు. అయితే ముఖ్యమంత్రులు మార్చేప్పుడు కూడా ఏఐసీసీ దూతగా కూడా రాష్ట్ర రాజకీయాలను వొడితెల రాజేశ్వర్ రావు నెరిపారు. పలుమార్లు అధిష్టానం తరుపున హైదరాబాద్ కు వచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయి అభిప్రాయాలను సేకరించి అధిష్టానం ముందించిన సందర్బాలు కూడా లేకపోలేదు. పీవికి అత్యంత ఇష్టమైన అవధాన కార్యక్రమాలను నిర్వహించడంలో కూడా ఆయన ముఖ్య భూమిక పోషించారు. పీవి ప్రధానిగా ఉన్నప్పుడు నిర్వహించిన అష్టావధాన కార్యక్రమాల్లో చాలా వరకు సింగాపూర్ రాజేశ్వర్ రావే ఆర్గనైజ్ చేసేవారు.
విద్యా సంస్థల అధిపతిగా…
గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్యా కూడా అందుకునే పరిస్థితులు లేని కాలంలోనే రాజేశ్వర్ రావు ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు వైపు అడుగులు వేశారు. పట్టణ ప్రాంతాలకే పరిమితమైన విద్యారంగాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకరావాలన్న లక్ష్యంతో విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. 1979లో పబ్లిక్ స్కూల్, జూనియర్, ఇంజనీరింగ్ కాలేజీలను హన్మకొండలో ఏర్పాటు చేయగా మహారాష్ట్రలోని రాంటెక్ లో మరో ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించారు. తన స్వగ్రామమైన సింగాపూర్ లో 1997లో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయడం గమనార్హం. ఆ సమయంలో ఇంజనీరింగ్ చదవాలంటే హైదరాబాద్, వరంగల్ లాంటి పెద్దపెద్ద నగరాలకే వెళ్లాలన్న పరిస్థితులు ఉండేవి. కానీ ఆయన మాత్రం తన స్వస్థలంలో కూడా సాంకేతిక విద్యను అందించాలన్న తపనతో ఇక్కడ కూడా ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించారు. హైదరాబాద్ వొడితెల ఎడ్యూకేషన్ సొసైటీ, వరంగల్ ఏకశిలా ఎడ్యూకేషన్ సొసైటీ, రాంటెక్ కవికులగురు ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, సింగాపూర్ కమల ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, హైదరాబాద్ విజేత హైస్కూల్, హన్మకొండ విఎమ్మార్ పాలిటెక్నిక్, గీతాంజలి జూనియర్ కాలేజీలకు ఫౌండర్ ఛైర్మన్ గా వ్యవహరించారు. 1950 – 60వ దశాబ్దంలోనే విదేశాల్లో పర్యటించిన ఆయన ఇతర దేశాలకు వెల్లొచ్చిన తొలి తరానికి చెందిన వారిలో ఒకరు కావడం గమనార్హం.
ఉద్యమ ప్రస్థానంలో…
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కూడా అత్యంత కీలక పాత్ర పోషించిన వారిలో సింగాపూర్ రాజేశ్వర్ రావు ఒకరు. స్వరాష్ట్ర కల సాకారం కోసం మలి విడుత ఉద్యమానికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో వొడితెల తనవంతు సహకారం అందించారు. ఉద్యమ నేత కేసీఆర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నప్పటి నుండి కూడా ఆయన అండదండలు అందించి ఉద్యమ ఉధృతికి తోడ్పాటును అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యంగా ఉండే ఫ్యామిలీలో వొడితెల కుటుంబం కూడా ఒకటి కావడం విశేషం.
విగ్రాహావిష్కరణ…
స్వరాష్ట్ర కల సాకారం కావాలని తపన పడిన ఆ నేత 2011 జులై 24న కన్నుమూశారు. ఆయన 12వ వర్థంతి సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాసింగ్ రోడ్డులో విగ్రహవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 24 సోమవారం జరగునున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, శాసనమండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి, రాజేశ్వర్ రావు సోదరుడు మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే, సతీష్ బాబుతో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.