దిశ దశ, చెన్నూరు:
అభివృద్దికి అమడ దూరంలో ఉన్న తామెందుకు ఓటు వేయాలి..? ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని పాలకులను ఎందుకు ఎన్నుకోవాలి..? తమ గ్రామాన్ని విస్మరిస్తున్న వారికి రాజ్యంగ బద్దంగా అధికారం ఎందుకు అప్పగించాలి అని ప్రశ్నిస్తున్నారు ఆ పల్లె జనం. లోకసభ ఎన్నికల వేళ ఆ పల్లె జనం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారం గ్రామస్థులు ఎన్నికలు బహిష్కరించాలని తీర్మాణించుకున్నారు. రానున్న లోకసభ ఎన్నికల్లో ఓటింగకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సుమారు వెయ్యి మంది ఓటర్లు ఉన్న తమ గ్రామ సమస్యలు పరిష్కరించండి మహాప్రభో అంటూ ప్రతి ఎన్నికలప్పుడూ అభ్యర్థిస్తున్నా లాభం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి వెల్లేందుకు ఉన్న ఏకైక రహదారి పూర్తి కాకపోవడంతో పొరుగూరికి వెల్లాలన్న అష్టకష్టాలు పడుతున్నామన్నారు. రోడ్డు కోసం నిధులు మంజూరైనా రిజర్వూ ఫారెస్ట్ భూమి ఉందన్న కారణంతో అర్థాంతరంగా ఆపేశారు. దీంతో సాధారణ సమయాల్లో ఆటోల ద్వారా ఇతర గ్రామాలకు వెల్తున్నప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం మాత్రం లేకుండాపోయిందని వివరించారు. వర్షాకాలం అయితే బురదమయమైన రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే పరిస్థితి ఉండదని, దీంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలే ఉండకుండా పోతాయని రాజారం గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో ప్రైమరీ స్కూల్ మాత్రమే ఉండడంతో హైస్కూల్ విద్య కోసం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పారుపెల్లికి వెల్లాల్సి వస్తోందని… గ్రామానికి చెందిన విద్యార్థులు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నరక యాతన పడుతున్నారన్నారు. అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే కనీసం అంబూలెన్స్ వచ్చిపోయే పరిస్థితి కూడా లేదని అలాంటుప్పుడు తామెందుకు ఓటు వేయాలో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. నేషనల్ హైవేకు కేవలం 10 కిలో మీటర్ల దూరంలోనే ఉన్న తమ గ్రామంలో దయనీయమైన పరిస్థితి ఉండడం ఆందోళన కల్గిస్తోందని రాజారం గ్రామస్థులు వాపోతున్నారు. అంతేకాకుండా ఓ వైపున ప్రాణహిత, మరో వైపున గోదావరి నదులు ప్రవహిస్తున్న తాగు నీటి సౌకర్యం కూడా లేకుండా పోయిందని వివరించారు. తమ సమస్యలు పరిష్కరించనందున తాము ఏ పార్టీకి కూడా ఓట్లు వేయకూడదని నిర్ణయించుకున్నామని గ్రామస్థులు ప్రకటించారు.