నిధులూ అక్కడే… నీరు అక్కడే… తెలంగాణాకే పెద్ద దిక్కు…

దిశ దశ, భూపాలపల్లి:

ఇక్కడి గోదావరి, ప్రాణహిత, మానేరు నదుల పరవళ్లు రాష్ట్రానికే పెద్ద దిక్కుగా మారాయి. మారుమూల ప్రాంతంగా పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం అభివృద్దికి అందనంత దూరంలో ఉంది. చారిత్రాత్మక నేపథ్యం కూడా ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా రాష్ట్ర ఖజానాకు భరోసాను ఇస్తుండగా, నీటి వనరులను అందించే ప్రధాన ప్రాజెక్టుకు కూడా వేదికగా మారింది.

ఇసుకతో…

దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతం మీదుగా ప్రవహిస్తున్న నదులు ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించేందుకు దోహదపడుతున్నాయి. దిగువ ప్రాంతం అయిన మంథని, ముత్తారం, తాడిచర్ల మండలాల మీదుగా ప్రవహిస్తున్న మానేరు నది పరివాహక ప్రాంతంలో ఇసుక రీచులను ఏర్పాటు చేసిన సర్కారు వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని అందుకుంటోంది. అలాగే కాటారం మండలంలోని వీరాపూర్, మహదేపూర్ మండలంలోని అన్నారం, పల్గులు, కుంట్లం, పూస్కుపల్లి, కాళేశ్వరం, కుదురుపల్లి, మహదేవపూర్, బొమ్మాపూర్, బెగ్లూరు, సురారం, అంబట్ పల్లి శివారుల మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నది ఇసుకను విక్రయించేందుకు ప్రత్యేకంగా రీచులను ఏర్పాటు చేశారు. అలాగే మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు సమీపంలోని కొల్లూరులో రీచ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తం మీద TGMDC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్వారీలు 23 వరకు ఉండగా అందులో ఒక్క జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే 9 రీచులు నిర్వహిస్తున్న్టట్టుగా రికార్డులు చెప్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని తాడిచర్ల, ఖమ్మంపల్లిలో మూడు, మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలో ఒక రీచు నడుస్తోంది. ప్రభుత్వ అవసరాలకు ఏర్పాటు చేసిన రీచులు వీటితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు అధికారులు.

వేల కోట్లు…

రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతం మీదుగా ప్రవహిస్తున్న నదుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టుగా స్పష్టం అవుతోంది. ఒకప్పుడు అడవులు, రహదారులు కూడా లేని ఈ ప్రాంతం నేడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిపోవడం గమనార్హం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇసుక ద్వారా వచ్చే ఆదాయంపైనే ప్రధాన దృష్టిని సారించారంటే ఈ ప్రాంతంలో లభిస్తున్న ఇసుకపై ప్రభుత్వం ఎంతమేర ఆసక్తి కనబరుస్తోందో అర్థం చేసుకోవచ్చు. మైనింగ్ విభాగం పరిధిలోనే ఉండే ఇసుక రీచుల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా TGMDC ద్వారా పర్యవేక్షణ చేయిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతమేర ఆదాయం వస్తే అంతమేర లాభం చేకూరుతుందని అధికారులు కూడా అంచనాలు వేస్తున్నారు.

భాగ్యనగారినికే…

రాష్ట్రంలోని ఇసుక రీచుల్లో సింహ భాగం ఆదాయం అందిస్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇసుక ప్రభుత్వానికే కాదు… భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్న వారికి కీలకంగా మారింది. లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక హైదరాబాద్ నగరానికి చేరుకుంటేనే అక్కడ గృహాల నిర్మాణం జరుగుతోంది.

నీళ్ల విషయానికొస్తే…

ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి నీరందించేందుకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇదే ప్రాంతంలో ఉండడం మరో విశేషం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీల నిర్మాణం, కన్నెపల్లి, సిరిపురం వద్ద పంప్ హౌజుల నిర్మాణంతో ఎగువ ప్రాంతానికి నీటిని ఎత్తిపోసేందుకు కాళేశ్వరాన్ని నిర్మించారు. అయితే మేడిగడ్డలోని 7వ బ్యారేజీ కుంగుబాటుకు గురి కావడంతో తాత్కాలికంగా నీటిని తరలించే ప్రక్రియకు బ్రేకు పడింది. పిల్లర్లు కుంగుబాటుకు గురైన 7వ బ్లాకును పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాల్సిన అవసరం ఉందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 7వ బ్లాకును పునరుద్దరించినట్టయితే ఎగువ ప్రాంతానికి నీటిని తరలించనున్నారు. ఈ నీటిని తాగు, సాగు అవసరాలకు వినియోగించుకోవలన్న ప్రతిపాదన కూడా ఉన్నందున రాష్ట్రానికి గోదావరి మీద నిర్మించిన కాళేశ్వర నుండి పెద్ద ఎత్తున నీరు తరలిపోనుంది. మంథని, మహదేవపూర్ ప్రాంతాల మీదుగా ప్రవహిస్తున్న గోదావరి, మానేరు నదులు రాష్ట్ర అవసరాలను తీర్చేవిగా మారడం గమనార్హం. ఒకప్పుడు కుగ్రామాలు, కీకారణ్యాలుగా పేరొందిన ఈ మారుమూల ప్రాంతమే నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అవసరాలను తీర్చేందుకు వేదికగా మారడం విశేషం.

You cannot copy content of this page