దిశ దశ, ఏపీ బ్యూరో:
సాధారణంగా వెడ్డింగ్ కార్డు అనగానే వివాహ ముహూర్తం, వేదిక, వధూ వరుల పేర్లు, విందు తదితర వివరాలు ఉంటాయి. అతిథులకు సూచనలు చేస్తూ ఎలాంటి బహుమతులు తీసుకోబడవు అంటూ కూడా ముద్రిస్తుంటారు. వీవీఐపీల ఇంట మ్యారెజెస్ అయితే కార్డు తప్పనిసరిగా వెంట తీసుకరాగలరు అని కూడా రాయిస్తుంటారు. కానీ ఏపీలో ఓ జంట కాస్తా వెరైటీగా ఆలోచించి వెడ్డింగ్ కార్డును ముద్రించింది. అయితే ఈ ఆహ్వాన పత్రికను అతిథులకు పరీక్ష నిర్వహిస్తున్నట్టుగా తయారు చేశారు. నిండూ నూరేళ్లు మీ దాంపత్య జీవనం సుఖ సంతోషాలతో కొనసాగాలని అతిథులు ఆశీర్వదించడం చూసి ఉంటాం కానీ… గెస్టులకే మార్కులు వేసే విధానం అవలంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన ప్రత్యుష ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. కాలేజీలోనే పరిచయం అయిన ఫణీంద్రతో వివాహం నిశ్చయం కావడంతో వెడ్డింగ్ కార్డులను కాస్తా డిఫరెంట్ గా ప్లాన్ చేయాలని భావించారు. విద్యార్థులను తీర్చిదిద్ది వారు ఎంత వరకు సుశిక్షుతులుగా తయారయ్యారోనన్న విషయాన్ని సంగ్రహించేందుకు తరుచూ పరీక్షలు నిర్వహించే అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రత్యూష తనదైన స్టైల్లోనే ఆహ్వాన పత్రికను ముద్రించారు. పెళ్లి వివరాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రశ్నాపత్రం రూపంలో తయారు చేశారు. అందులో ప్రశ్న వేసి ఖాళీగా ఉంచడం, అందులోని పదాల స్పెల్లింగ్ సరి చేయడం వంటి 8 రకాల ప్రశ్నాలను పొందుపరిచారు. వివిధ రకాల ప్రశ్నలతో తయారు చేసిన ఈ ఆహ్వన పత్రికలో కన్యాదానం చేసే వారి పేర్లు, పెళ్లి తేది, సమయం, వేదిక, విందు తదితర వివరాలన్ని కూడా ప్రశ్న సమాధానం రూపంలో తయారు చేయించి ముద్రించారు. ఈ ఆహ్వాన పత్రిక అందుకున్న అతిథులంతా కూడా మొదట ఇదేంటీ వెడ్డింగ్ కార్డు ఇలా ఉంది అని మొదట ఆశ్యర్యపోయినప్పటికీ తేరుకున్న తరువాత అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రియేటివిటీని గ్రహించి అభినందించారు. పెళ్లంటే నూరేళ్ల పంట అన్న నానుడికి భిన్నంగా పెళ్లి కార్డు అంటే వంద మార్కుల ప్రశ్నా పత్రం అన్న రీతిలో తయారు చేసిన తీరును చూసిన పలువురు అబ్బురపడిపోయారట. ఏది ఏమైనా క్రియేటివిటీతో విద్యనందించడమే కాదు… ఆహ్వాన పత్రిక విషయంలో కూడా తనలోని సృజనాత్మకతను పదును పెట్టారు ప్రత్యూష మేడం అంటూ కితాబిచ్చారట పలువురు.