వొడితెల కుటుంబ పరిస్థితి…
దిశ దశ, హుజురాబాద్ కరస్పాండెంట్:
కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకున్న ఆ కుటుంబానికి చెందిన ఇద్దరు కూడా ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహం చూపిన అబ్బాయ్… వరస విజయాలు అందుకున్న బాబాయ్ ఇద్దరు కూడా ఓటమి చవి చూడకతప్పలేదు. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన వొడితెల సతీష్ బాబుపై తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. బీసీ కార్డు నినాదాన్ని బలంగా వినిపించిన పొన్నం ప్రభాకర్ తనదైన మార్కు పాలిటిక్స్ ప్లే చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో వొడితెల సతీష్ బాబు ఓటమి పాలుకాక తప్పలేదు. మరో వైపున వొడితెల రాజేశ్వర్ రావు మనవడు ప్రణవ్ బాబు హుజురాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అవుతున్నారన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. మొదట్లో హుజురాబాద్ లో ప్రణవ్ పేరు చెప్పగానే వచ్చిన క్రేజీ చూసి ఆయన గెలుపు సునయాసమేనని భావించారంతా. కానీ క్రమక్రమంగా ప్రణవ్ బాబు మంత్రాంగం నెరపడంలో విఫలం కావడంతో పట్టు బిగించలేకపోయారు. దీంతో హుజురాబాద్ ప్రజలు ప్రణవ్ కు అండగా నిలబడలేకపోయారు.
జడ్పీటీసీ కోసం…
మొదట రాజకీయాల్లోకి రావాలనుకున్న ప్రణవ్ బాబు చిగురమామిడి జడ్పీటీసీ టికెట్ కోసం బీఆర్ఎస్ పార్టీలో ప్రయత్నించారు. అయితే హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న సతీష్ బాబు ప్రణవ్ బాబాయ్ మాత్రం ఆయనకు అనుకూలంగా వ్యవహరించలేదు. తన తనయుడు ఇంద్రనీల్ పొలిటికల్ ఎంట్రీకీ ఫ్రణవ్ అడ్డుగా ఉంటాడన్న ఆలోచనతో ఆయన అరంగ్రేట్రానికి బ్రేకులు వేశారన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రణవ్ బాబు హుజురాబాద్ అభ్యర్థిగా పోటీ చేశారు.