అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు
దిశ దశ, కరీంనగర్:
సొంత ఊర్లో చీరల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం ఇతర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడడమే పనిగా పెట్టుకుంది. ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ రద్దీ ఉన్న ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తోంది. కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు ఈ దొంగల కుటుంబాన్ని అరెస్ట్ చేయడంతో వారి బండారం బయట పడింది.
ఇన్నోవాలో తిరుగుతూ…
దర్జాగా ఇన్నోవాలో తిరుగుతూ రద్దీ ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానికుల కళ్లుగప్పి దొంగతనాలకు పాల్పడుతోంది ఈ ఫ్యామిలీ. అక్టోబర్ 6వ తేదిన కరీంనగర్ బస్ స్టేషన్ లోకి వెల్లిన వీరు రద్దీగా ఉన్న ఓ ప్లాట్ ఫాం వద్ద కాపు కాచి బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణీకురాలి చేతిలో ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి ఘరానా కుటుంబాన్ని పట్టుకుంది. అయితే వీరు ఒకే ప్రాంతంలో కాపు కాసి ఉండకుండా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. వీరు మహారాష్ట్రతో పాటు తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో కూడా చోరీలకు పాల్పడి ఉండారని అనుమానిస్తున్నారు పోలీసులు.
మహారాష్ట్ర నుండి…
మహారాష్ట్రలోని జల్గోన్ జిల్లా భూసావల్ గ్రామంలోని నీలంబరి హోట్ వద్ద చీరలు అమ్మే వృత్తితో జీవనం సాగిస్తున్న పాస్పులేటి దుర్గ (34), పాస్పులేటి రాము (40), పాస్పులేటి రవి (34), పాస్పులేటి రేణు (30) రెండు జంటలు ఇన్నోవా నంబర్ MH-15-BX-0557లో తిరుగుతూ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నారు. వీరి నుండి ఇన్నోవాతో పాటు 23 గ్రాముల బంగారం, రూ. 36 వేల నగదు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వన్ టౌన్ సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు.
బెడిసిన వ్యూహం…
రద్దీ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఈ రెండు జంటలు పోలీసులకు చిక్కకుండా వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ఒకే ప్రాంతంలో తరుచూ చోరీలకు పాల్పడినట్టయితే అక్కడి పోలీసులకు చిక్కుతామని భావించి ఇన్నోవాలో తిరుగుతూ వేర్వేరు చోట్ల దొంగతనాలు చేస్తున్నారు. దీంతో తమ ఉనికిని పోలీసులు పసిగట్టలేరని భావించారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 6న కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ కు వచ్చి చోరీకి పాల్పడ్డారు. అయితే కరీంనగర్ పోలీసులు అటు సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు ఇటు వారిని పట్టుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో దొంగల కుటుంబం అంచనాలు తలకిందులు అయ్యాయి. కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు చాకచక్యాన్ని ప్రదర్శించి అరెస్ట్ చేయడంతో చీరల వ్యాపారం ముసుగులో చోరీలకు పాల్పడుతున్న ఈ రెండు జంటలు కటకటాలు లెక్కించక తప్పలేదు.