అంతు చిక్కని కేసీఆర్ వ్యూహం
దిశ దశ, హైదరాబాద్:
బీఆరెఎస్ అధినేత వ్యూహం అంతుచిక్కని విధంగా తీసుకునే నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒక్కోసారి చూసీ చూడనట్టుగా వ్యవహరించడం… మరో సారి సీరియస్ గా పరిగణించడం వెనక ఆంతర్యం ఏంటన్నదే మిస్టరీగా మారింది. పార్టీ ముఖ్య నాయకులు కూడా ఈ విషయంలో ఇలా వ్యవహరించడం ఏంటీ అన్న ఆలోచనలోనే కొట్టు మిట్టాడుతున్న పరిస్థితే ఉంది. రాజకీయ చతురతను ప్రదర్శించే కేసీఆర్ వెరైటీ నిర్ణయాలపై చర్చ సాగుతోంది.
ఆనాడు అలా…
నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ విషయంలో నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టారనే చెప్పాలి. దాదాపు మూడేళ్ల క్రితం రాజ్యసభ సభ్యునిగా ఉన్న డి శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన తనయ నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ మేరకు పార్టీ ఇంఛార్జిగా ఉన్న తుల ఉమ నేతృత్వంలో నిజామాబాద్ లో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి డి శ్రీనివాస్ పై చర్య తీసుకోవాలని కోరుతూ కేసీఆర్ కు లేఖ రాశారు. ఏకంగా ముఖ్యమంత్రి కూతురే సీరియస్ గా తీసుకుని రాజకీయ భీష్మునిపై చర్యలకు సిఫార్సు చేయడంతో కేసీఆర్ ఎదో ఒక నిర్ణయం తీసుకుంటారని భావించారంతా. ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా లేక షోకాజ్ నోటీస్ ఇస్తారా అన్న చర్చ కూడా సాగింది. దీంతో డిఎస్ కూడా గులాభి జెండాను వదిలేస్తారన్న డిస్కషన్ కూడా పెద్ద ఎత్తున సాగింది. అయితే ఆయన స్వతహాగా పార్టీని వీడితే రాజ్యసభ సభ్యత్వంపై వేటు వేసే అవకాశాలు ఉంటాయని కేసీఆర్ తీసుకునే నిర్ణయంపైనే వెయిట్ అండ్ సీ అన్న ధోరణిలో ఉండాలని నిర్ణయించుకున్నారన్న వాదనలు కూడా వినిపించాయి. ఆ తరువాత చిన్న కొడుకు అరవింద్ ద్వారా బీజేపీ జాతీయ నాయకులను కూడా కలిశారు డీఎస్. ఇటీవల డీఎస్ కాంగ్రెస్ పార్టీకి గాంధీ భవన్ కు తన పెద్ద కుమారుడు సంజయ్ తో పాటు వెళ్లిన విషయం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆ మరునాడే తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, సంజయ్ చేరిక సందర్భంగా వచ్చానని డీఎస్ వెల్లడించారు.
ఇప్పుడిలా…
అయితే డి శ్రీనివాస్ విషయంలో నిర్ణయాన్ని హోల్డ్ లో ఉంచిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఇద్దరు నాయకులపై వేటు వేయడం సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పాలమూరు జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావులను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కృష్ణారావు విషయంలో అధిష్టానం టచ్ మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరిస్తోంది. ఇక్కడి నుండి గెల్చిన హర్షవర్దన్ రెడ్డికి గులాభి తీర్థం ఇచ్చిన తరువాత జూపల్లికి ప్రాధాన్యత లేకుండా పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ జూపల్లి అన్నట్టుగానే ఎన్నికలు జరిగాయనే చెప్పాలి. జూపల్లి వర్గీయులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోటీ చేసి గులాభి అభ్యర్థులకు చుక్కలు చూపించారు. అప్పటి నుండి కూడా అధిష్టానానికి, జూపల్లికి గ్యాప్ తీవ్రంగా ఏర్పడడంతో ఆయన పయనమెటోనన్న చర్చ సాగింది. నియోజకవర్గంతో పాటు పాలమూరు జిల్లాలో తన పట్టు నిలుపుకోవడంతో ఎత్తులు పై ఎత్తులు వేసే జూపల్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. అలాగే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో పార్టీ అధిష్టానం వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా ఉండేది. కేటీఆర్ తో కలిసి హెలిక్యాప్టర్ లో పర్యటించడం, జిల్లా నాయకత్వం ఆయన్ను పక్కకు పెట్టిన ప్రయారిటీ ఇవ్వడం వంటి చర్యలు చేపట్టేవారు. దీంతో గత రెండేళ్లుగా పొంగులేటి పార్టీని వీడుతారన్న ప్రచారం జరిగినప్పుడల్లా ఆయన పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యక్ష్యం కావడంతో అంతా సద్దుమణిగిపోయిందనుకున్నారు. కానీ ఇటీవల ఆయన పూర్తి స్థాయిలో పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ హితులు, సన్నిహితులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆయనపై కూడా సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.
అయితే డీఎస్ పై చర్యలు తీసుకోవాలని కూతురు కవిత ప్రతిపాదనలు చేయడంతో పాటు బహిరంగ లేఖ రాసినా నాన్చుడు ధోరణితో వ్యవహరించిన కేసీఆర్, పొంగులేటి, జూపల్లి విషయంలో మాత్రం సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.