దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆ ప్రాజెక్టు గురించి గొప్పగా వర్ణించిన ఆ నాయకుడే నేడు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ నాడు ఆ ప్రాజెక్టు కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖ్యాతి ఖండాంతరాలు దాటిందన్న రీతిలో వ్యాఖ్యానించిన ఆయనే నేడు ఆరోపణలకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
వైవిద్యమైన మార్పు…
తెలంగాణలో నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ సమయంలో నిర్మాణం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రం సస్యశామలం కాబోతోందని కూడా అభివర్ణించారు ఈటల రాజేందర్. ఉద్యమ ప్రస్థానం నుండి కీలక భూమిక పోషించిన నాయకుల్లో ఒకరైన ఈటల రాజేందర్ రాష్ట్రంలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి తరువాత స్థానంలో ఉన్న నేతల్లో రాజేందర్ కూడా ఒకరన్న పేరుండేది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య సాన్నిహిత్యం కూడా ఉండడంతో విధాన నిర్ణయాల్లో కూడా రాజేందర్ భాగస్వామ్యం ఉండేది. అయతే అనూహ్యం ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ కు, ఈటల రాజేందర్ మధ్య ఏర్పడిన అంతరం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ గా నడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ప్రస్తుతం ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కం బ్రిడ్జి పిల్లర్ ఒకటి కుంగిపోవడం సంచలనంగా మారింది. 20వ నెంబర్ పిల్లర్ కుంగుబాటుకు గురైందన్న విషయం వెలుగులోకి రావడంతో ఆదివారం సాయంత్రం బ్యారేజ్ ను సందర్శించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్ లా వ్యవహరించానని చెప్పుకున్నారని ఆరోపించారు. గతంలో వచ్చిన వరదల్లో మోటార్లు మునిగిపోయాయని, కాంక్రీట్ గోడలు కూడా కూలి పోవడంతో భారీ నష్టం వాటిల్లిందని కూడా ఈటల వ్యాఖ్యానించారు. అప్పుడే కాళేశ్వరం గొప్పతనం బయటపడిందని, అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు నిపుణులు, డిజైనర్ల సలహాలు తీసుకోవల్సిన అవసరం ఉందని కూడా అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగిపోయిన ఘటనపై కేంద్ర ఏజెన్సీలు విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు.
నెటిజెన్ల విమర్శలు…
అయితే ఈటల రాజేందర్ తీరుపై నెటిజన్లు కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పి ఇప్పుడు విమర్శలు చేయడం వెనక ఆంతర్యం ఏంటీ అన్న రీతిలో కూడా పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈటల రాజేందర్ ఆనాడే రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం చెప్పినట్టయితే ఇంతదూరం వచ్చేది కాదుకదా అంటున్న వారూ లేకపోలేదు.
https://youtu.be/2MuDlrYUig0?si=rtKRKZvuSA9TiO2Q