క్యాంపేనర్ క్యాండెట్… క్యాండెట్ క్యాంపేనర్

హుజురాబాద్ ముఖ చిత్రంలో విచిత్రం

దిశ దశ, హుజురాబాద్:

రెండేళ్ల క్రితం తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రచారం చేసిన నాయకుడు నేడు అభ్యర్థిగా… నాడు అభ్యర్థిగా బరిలో నిలిచిన వ్యక్తి నేడు క్యాంపేనర్ గా మారిపోయారు. వైవిద్యమైన రాజకీయాలకు కేరాఫ్ గా మారిన హుజురాబాద్ ముఖ చిత్రాన విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

2021 ఉప ఎన్నికల్లో

ఉద్యమనేత ముఖ్య అనుచరుడిగా ఉన్న ఈటల రాజేందర్ తో నెలకొన్న విబేధాలు ముదిరి పాకాన పడడంతో హుజురాబాద్ లో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. దీంతో హుజురాబాద్ నుండి బీజేపీ అభ్యర్థిగా ఈటల పోటీ చేశారు. ఈ క్రమంలో బలమైన అభ్యర్థి కోసం అన్వేషించిన గులాభి బాస్ ప్రత్యేకంగా కసరత్తులు చేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఎంపిక చేశారు. ఉద్యమకారుడు కావడంతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో గెల్లు అభ్యర్థిత్వం వైపు అధినేత కేసీఆర్ మొగ్గు చూపారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గులాభి పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఉప ఎన్నికల వరకూ అదే పార్టీలో కొనసాగారు. అనూహ్య పరిణామాలు… గులాభి పార్టీ నాయకుల సమీకరాణాల నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. దీంతో కౌశిక్ రెడ్డి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు.

సాధారణ ఎన్నికల్లో…

ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెల్లు శ్రీనివాస్ ను కాకుండా పాడి కౌశిక్ రెడ్డిని ఎంపిక చేసింది. దీంతో హుజురాబాద్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి నియోజకవర్గలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు హుజురాబాద్ ప్రాంత ముఖ్య నాయకులు అంతా కూడా ప్రచారం చేస్తుండడం గమనార్హం. పాడి కౌశిక్ రెడ్డిని గెలిపించాలంటూ 2021 ఉప ఎన్నికల్లో గులాభి పార్టీ అభ్యర్థిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా రంగంలోకి దిగారు. ఉప ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని కోరిన గెల్లు శ్రీనివాస్ ఇప్పుడు తన పార్టీ అధిష్టానం నిర్ణయించిన పాడి కౌశిక్ రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థిస్తుండడం గమనార్హం.

అంటీముట్టనట్టుగా…

అయితే 2021 ఉప ఎన్నికల తరువాత హుజురాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన బీఆర్ఎస్ అధిష్టానం మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. కౌశిక్ రెడ్డి వైపు మొగ్గు చూపిన అధినేత కేసీఆర్ ఆయనకే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మండలిలో విప్ అవకాశం కూడా ఇచ్చారు. కాబోయే అభ్యర్థి కౌశిక్ రెడ్డేనని అధిష్టానం కుండబద్దలు కొట్టింది. దీంతో గెల్లు శ్రీనివాస్ భవితవ్యంపై నీలినీడలు అలుముకోగా ఆయనకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు. ఈ క్రమంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత నియోజకవర్గానికి వచ్చేందుకు సమాయత్తం అయినప్పటికి పార్టీ పెద్దలు నిలువరించినట్టుగా ప్రచారం జరిగింది. ఓ దశలో గెల్లు శ్రీనివాస్ కు భారీ సన్మానం ఏర్పాటు చేసేందుకు కూడా సిద్దమైనప్పటికీ తుది నిమిషంలో ఆయన పర్యటనను రద్దు చేయించారన్న ప్రచారం కూడా హుజురాబాద్ లో ఉంది. దీంతో ఆయన కొన్ని శుభ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు హుజురాబాద్ లో పర్యటించిన ప్రాధాన్యత లేకుండానే వచ్చి వెళ్లారు. చివరకు ప్రజా ఆశీర్వద సభకు హాజరైన గెల్లు శ్రీనివాస్ కు ప్రసంగించేందుకు కూడా అవకాశం ఇవ్వని పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం గెల్లు శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరూ ప్రచారం చేస్తున్న తీరు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు అంటీముట్టనట్టుగా వ్యవహరించిన నేతలు ఇద్దరూ ఓట్లు అభ్యర్థించేందుకు కలిసి ప్రచారం చేస్తున్న విధానంపై స్థానికంగా చర్చించుకుంటున్నారు.

You cannot copy content of this page