దిశ దశ, భూపాలపల్లి:
అన్నారం బ్యారేజీకి దిగువన బుంగలు పడ్డాయంటూ మీడియా వెలుగులోకి తీసుకరాగానే రాద్దాంతం చేస్తున్నారన్న లెవల్లో కౌంటర్ అటాక్ చేశారప్పుడు అధికారులు. అదంతా కామన్ అన్న రీతిలో ప్రకటనలు విడుదల చేసిన అధికారులు ఇప్పుడు మరమ్మత్తులు ఎందుకు చేస్తున్నట్టు..? నిర్మాణ సమయంలోనూ ఇలా బుంగలు ఏర్పడితే ఢిల్లీ నుండి నిపుణులను పిలిపించాం వాటిని సవరించాం అని చెప్తూనే మరో వైపున అదంతా సాధారణం అన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మాత్రం బుంగలను పూడ్చేందుకు సమాయత్తం అయ్యారు.
అన్నారం బ్యారేజీ…
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటుకు గురైన కొద్ది రోజుల్లోనే అన్నారం బ్యారేజీ గేట్లకు దిగువన బుంగలు పడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. బ్యారేజ్ బ్యాక్ వాటర్ గేట్ల దిగువ ప్రాంతానికి వచ్చి చేరుతోంది. రెండు మూడు చోట్ల ఇలా బుంగలు పడి నీరు దిగువకు వెల్తుండడంతో అధికారులు హాడావుడిగా ఇసుక బస్తాలను నాటు పడవల్లో తరలించి బుంగ పడిన ప్రాంతంలో వేశారు. అప్పటికే మేడిగడ్డను సందర్శించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) బృందం మూడు బ్యారేజీల డిజైన్లను పరిశీలించింది. అన్నారం దిగువ ప్రాంతంలో బుంగల పడ్డ విషయంపై కూడా తన నివేదికలో ప్రస్తావించిన ఈ టీమ్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నీటిని దిగువకు వదిలి సునిశితంగా పరిశీలించాలని అభిప్రాయపడింది. మూడు బ్యారేజీలు కూడా ఒకే డిజైన్ లో నిర్మించారని కూడా గుర్తించిన ఎన్డీఎస్ఏ టీమ్ వాటి నిర్మాణ తీరు తెన్నులను పరిశీలించాలని కూడా స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరుపున సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా డ్యాం సేఫ్టీ టీమ్ ఇచ్చిన నివేదికలను తప్పు పడుతూ కౌంటర్ అటాక్ చేసింది. ఆ తరువాత మాత్రం మూడు బ్యారేజీల నీటిని దిగువకు వదిలి దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ అధికారులు మీడియాను ప్రతిపక్ష పార్టీలను ఏకిపారేసినంత పని చేశారు. చివరకు ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్న తీరు మాత్రం వారి తప్పిదాలను ఎత్తి చూపుతోంది.
ఇప్పుడు రిపేర్లు…
తాజాగా అన్నారం బ్యారేజీ బుంగలను పూడ్చే పనిలో ఇరిగేషన్ అధికారులు నిమగ్నం అయ్యారు. అప్పుడు సాధారణమే అన్న ఇరిగేషన్ విభాగానికి చెందిన అధికారులే ఇప్పుడు వివిధ పద్దతుల్లో వాటిని రిపేర్లు చేయిస్తుండడం గమనార్హం. బ్యారేజీ ఐదో బ్లాక్ కు సంబంధించిన 23, 29 పిల్లర్లకు దిగువ భాగంలో సీపేజీ వద్ద మరమ్మత్తలు చేసే పనిలో నిమగ్నం అయ్యారు. రెండు రోజులుగా 38వ పిల్లర్ దిగువ బాగంలో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిన ఇరిగేషన్ అధికారులు, బుంగలు పడ్డ ఇతర ప్రాంతాల్లోనూ రిపేర్లు చేయాలని నిర్ణయించారు. రసాయన ప్రక్రియ ద్వారా గ్రౌటింగ్ పనులు చేపట్టిన అధికారులు ముందుగా బుంగలు పడ్డ ప్రాంతంలో ఇసుక బస్తాలతో రింగ్ బండ్ ఏర్పాటు చేయిస్తున్నారు. అలాగే పాలీ యూరేతిన్ విధానంతో గ్రౌంటింగ్ పనులు కొనసాగిస్తున్నారు.
మెయింటెనెన్స్ ఎవరిదో..?
అక్టోబర్ చివర్లో వెలుగులోకి వచ్చిన ఈ బుంగలపై స్పందించిన ఇరిగేషన్ అధికారులు అన్నారం బ్యారేజ్ మెయింటెనెన్స్ నిర్మాణ కంపెనీదేనని కూడా ప్రకటనలు విడుదల చేశారు. ఈఈ యాదగిరి పేరిట సోషల్ మీడియాలో ఈ ప్రకటనలు వెలువడ్డాయి. మరి ఇప్పుడు ఈ రిపేర్లకు నిధులు రాష్ట్ర ప్రభుత్వం కెటాయిస్తుందా లేక నిర్మాణ కంపెని భరిస్తోందా అన్న విషయంపై క్లారిటీ రావల్సి ఉంది. సీపేజీ అంతా కూడా మెయింటెనెన్స్ చేస్తామని బుంగలు పడినప్పటికీ ఇసుక మాత్రం రావడం లేదంటూ ఈఈ యాదగిరి విడుదల చేసిన ప్రకటనలో స్ఫష్టం చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా రిపేర్లు ఎందుకు చేస్తున్నారన్నది కూడా పజిల్ గా మారింది. ప్రతి చోట సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఉంటుంది, సీపేజీ వాటర్ అలో చేసేందుకు డిజైన్ లోనే అరెంజ్ మెంట్ ఉంటుంది, అవసరమైతే కెమికల్ గ్రౌటింగ్ చేస్తామంటూ కూడా యాదగిరి స్పష్టం చేశారు. ఇప్పుడు మత్రం శాశ్వత ప్రాతిపదికన బుంగలు పూడ్చేందుకు చర్యలు తీసుకుంటుండడం వెనక ఆంతర్యం ఏంటన్నది అంతు చిక్కకుండా పోయింది. బ్యారేజీ బ్యాక్ వాటర్ దిగువ ప్రాంతానికి లీక్ అవుతుంటే అధికారులు అప్పుడు చెప్పిన ఈ మాటలు… ఇప్పుడు చేతల్లో చూపుతున్న తీరు అందరిని విస్మయ పరుస్తున్నాయి.