కమ్ముకున్న గోదావరి అటు… కమ్యూనిటీ పోలిసింగ్ ఇటు…

దిశ దశ, దండకారణ్యం:

రాష్ట్రమంతటా వరద సహాయక చర్యల్లో మునిగి తేలుతుంటే అక్కడ మాత్రం డబుల్ డ్యూటీలో మునగి తేలుతున్నారు పోలీసులు. ఓ వైపు పొంగి పొర్లుతున్న వరద నీటితో నదీమ తల్లి భయం గుప్పిటకు చేర్చగా… మరో వైపున అన్నల ఉన్నికి కట్టడి చేసే పని మాత్రం వారికి తప్పడం లేదు. సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగం కంటి మీద కునుకు లేకుండా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి తయారైంది.

అప్రమత్తంగా ఆ జిల్లాలు

మహారాష్ట్రలోని మరట్వాడ, విదర్భ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వరద నీరు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదికి వచ్చి చేరుతోంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తితే శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల ద్వారా ఎల్లంపల్లి మీదుగా గోదావరి నదిలోకి నీరు వచ్చి చేరుతోంది. మరో వైపున పెన్ గంగా, వైన్ గంగాల నుండి వస్తున్న వరద నీరు ప్రాణహిత నది మీదుగా కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుండగా, లోతట్టు ప్రాంతమైన దమ్మూరు వద్ద చత్తీస్ గడ్ నుండి ప్రవహిస్తున్న ఇంద్రావతి నది గోదావరి నది కలిసిపోతోంది. అయితే ఇందులో ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి నది పరివాహక ప్రాంతాలన్ని కూడా దట్టమైన అడవులు విస్తరించి ఉన్నాయి. అటు మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రల్లోని దండకారణ్య అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ సమాంతర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అక్కడి కీకారణ్యాలను అలంబచన చేసుకుని అన్నలు తిరుగులేని పట్టు సాధించారు. ఈ నేపథ్యంలో పొరుగునే ఉన్న ఉత్తర తెలంగాణాలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాల పోలీసులు రెండు రకాల డ్యూటీలు చేయాల్సి వస్తోంది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వరద నీరు పెద్ద ఎత్తున దిగువ ప్రాంతమైన ఈ మూడు రాష్ట్రాల సరిహద్దులకే వచ్చి చేరుతోంది. రోజుక లక్షల క్యూసెక్యూల నీటిని దిగువకు వదలాల్సిన పరిస్థితి ఏర్పడడంతో గోదావరమ్మ నిండుకుండను మరిపిస్తోంది. దీంతో సరిహద్దు ప్రాంత పోలీసు అధికారులు ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని కాపాడేందుకు సాహసించాల్సిన పరిస్థితి ఏర్పడగా, మరో వైపును పొరుగునే ఉన్న అటవీ ప్రాంతం నుండి మావోయిస్టులు ఎంట్రీ ఇవ్వకుండా ఉండేందుకు కూడా పకడ్భందీ చర్యలు తీసుకోవల్సి వస్తోంది.

కమ్యూనిటీ పోలిసింగ్…

సీపీ, ఎస్పీలతో పాటు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ప్రతి పోలీసు అధికారి కూడా అటు వరద బాధిత ప్రాంతాల్లో రక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇస్తునే గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ పోలిసింగ్ కార్యక్రమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. నది పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితిని అంచనా వేస్తూ… ఇదే అదనుగా భావించి మావోయిస్టులు సరిహద్దుల్లోకి చొరబడే అవకాశం ఉన్నందున కట్టడి చేసే పనిలో బార్డర్ పోలీసులు నిమగ్నం కావల్సి వస్తోంది. వర్షంలో తడుస్తూనే పల్లె పల్లెను తిరుగుతూ పోలీసులు పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను చైతన్యవంతం చేస్తుండడం గమనార్హం. భూపాలపల్లి జిల్లా పల్మెల అటవీ ప్రాంతంలో పోలీసులు ప్రతికూల వాతావరణంలో కూడా కమ్యూనిటీ పోలిసింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

You cannot copy content of this page