సర్కారు దవాఖానలో సిత్రాలు…

జగిత్యాల జిల్లా కేంద్రంలో పరిస్థితి…

దిశ దశ, జగిత్యాల:

జిల్లా కేంద్రంగా మారినా జగిత్యాల పెద్దాసుపత్రిలో సౌకర్యాలు లేకపోవడం విస్మయం కల్గిస్తోంది. అల్లంత దూరం నుండి ఆశలు పెట్టుకుని వచ్చే పేషంట్లపై ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా పరిణమించింది. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చినా తీరు మారలేదన్నట్టుగానే ఉందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. తాజాగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన మనోజ్ (18) గత మూడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. శుక్రవారం రాత్రి చికిత్స కోసం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పెద్ద దవాఖానకు వచ్చే సరికి బెడ్స్ లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది అతన్ని అడ్మిట్ చేసుకోలేదు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మనోజ్ ను ఆసపత్రిలోపల కిందనే పడుకోబెట్టాల్సి వచ్చింది. అయితే మనోజ్ జ్వరం మరింతపెరుగుతుండడంతో మనోజ్ కుటుంబ సభ్యులు అతన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న ఈ పరిస్థితికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో జగిత్యాల ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులు మరోసారి వెలుగులోకి వచ్చినట్టయింది. కేవలం జగిత్యాల జిల్లాకే కాకుండా పొరుగునే ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కూడా ఇక్కడకు పెషెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వసతులు మెరుగు పర్చడంతో పాటు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా వాసులు అంటున్నారు.

You cannot copy content of this page