ముగ్గురూ ప్రజా ప్రతినిధులే…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ లో ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు క్యాండెట్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడం ఒక ఎత్తైతే… ముగ్గురు కూడా ప్రజా ప్రతినిధులుగానే బాధ్యతలు నిర్వర్తిస్తుండడం విశేషం. అందులోనూ పంచాయితీరాజ్, అసెంబ్లీ, పార్లమెంటు వ్యవస్థలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారు కావడం గమనార్హం.
బీఆర్ఎస్ అభ్యర్థి…
ఇక్కడి నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కావడం గమనార్హం. నాలుగోసారి కరీంనగర్ నుండి పోటీ చేస్తున్న ఆయన కౌన్సిలర్ గా తన రాజకీయ జీవితాన్న ఆరంభించి ఓటమి మాత్రం ఇంతవరకు చవి చూడలేదు. బల్దియాలో ప్రతినిధిగా వరస విజయాలు, ఎమ్మెల్యేగా కూడా మూడు సార్లు గెలిచారు.
బీజేపీ అభ్యర్థి…
బీజేపీ అభ్యర్థిగా కరీంనగర్ నుండి పోటీ చేస్తున్న బండి సంజయ్ మూడో సారి కూడా గంగులకు ప్రత్యర్థి కావడం విశేషం. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా కూడా ఉన్న బండి సంజయ్ కూడా కౌన్సిలర్ గా కరీంనగర్ బల్దియాకు ప్రాతినిథ్యం వహించిన వారే. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా వ్వవహరిస్తున్న ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అరుదైన రికార్డ్ అందుకున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి…
ఇకపోతే తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుచున్న పురుమళ్ల శ్రీనివాస్ బొమ్మకల్ సర్పంచ్ గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పంచాయితీ రాజ్ వ్యవస్థలో కీలకమైన సర్పంచ్ బాధ్యతల్లో ఉన్న ఆయన గతంలోనూ ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన భార్య లలిత ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తరుపున కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
మూడు వ్యవస్థలు..
అయితే కరీంనగర్ నుండి పోటీ చేస్తున్న ముగ్గరు అభ్యర్థులు కూడా సిట్టింగులుగా ఉండడం గమనార్హం. పంచాయితీ రాజ్ వ్యవస్థలో బాగమైన సర్పంచుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్, రాష్ట్ర స్థాయిలో చట్టాలను తయారు చేయాల్సిన అసెంబ్లీలో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, దేశ స్థాయిలో చట్టాలను తీసుకవచ్చే లోకసభకు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సర్పంచ్ ఎంపీ, ఎమ్మెల్యేను ఓడిస్తారా..? ఎమ్మెల్యే ఎంపీ, సర్పంచ్ ను ఓడిస్తారా..? ఎంపీ ఎమ్మెల్యే, సర్పంచ్ పై పై చేయి సాధిస్తారా అన్నది తేలాలాంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.