అక్కడ మరణ మృదంగం సాగనుందా..?

అంచనాల్లో వైఫల్యమా..?

ముందు చూపు లేని తనమా…?

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ సిగలో మరో నగ చేరబోతోంది. కొద్ది రోజుల్లోనే టూరిస్టులను ఆకర్షించేందుకు సమాయత్తమవుతోంది. మానేరు రివర్ ఫ్రంట్ లో తొలి అడుగు వేసిన కేబుల్ బ్రిడ్జి అహ్లాదం మాటున విషాదాన్ని పంచనుందా..? వంతెన నిర్మాణం విషయంలో ముందు చూపు లేకుండా వ్యవహరించారా అంటే అవుననే వినిపిస్తోంది. ఆదిలోనే ఈ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు తీసుకొచ్చి సమస్య పరిష్కారానికి చొరవ చూపించాల్సిన అవసరం ఉంది.

ప్రమాదాలకు కేరాఫ్ కానుందా..?

కరీంనగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు నిధుల వరద పారుతోంది. అయితే ఈ నిధులతో చేపడుతున్న పనుల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన ఆవశ్యకత అధికారయంత్రాంగంపై ఉంది. దేశంలోనే అతి తక్కువగా ఉన్న కేబుల్ బ్రిడ్జిని కరీంనగర్ లో నిర్మాణం చేపట్టారు. గతంలో కరీంనగర్ నుండి వరంగల్ కు ఉన్న మానేరు వంతెనపై నిర్మాణం చేపట్టిన ఈ వంతెన స్థానికులకు వాహనదారులకు సవాల్ విసరబోతోంది. కరీంనగర్ నుండి వాహనదారులు వంతెనపైకి వెల్లేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగే కిందకు వచ్చే వాహనదారులు కూడా అతి జాగ్రత్తగా దిగాల్సిన పరిస్థితులే నెలకొన్నాయి. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వంతెనను కొంతదూరం వరకు నిర్మాణం జరిపి వాహనాలు కిందకు దిగి సాధారణ రోడ్డుపైకి చేరుకునే విధంగా డిజైన్ చేస్తుంటారు. వంతెన అప్రోచ్ రోడ్డును పిల్లర్స్ దగ్గరే వేసేందుకు అధికారులు విముఖత చూపుతుంటారు. దీనివల్ల వాహనాలు వంతెన పైకి వెల్లేప్పుడే అయినా కిందకు దిగే అప్పుడే అయినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని గమనించి ఇలా నిర్మాణం చేస్తుంటారు. అయితే కరీంనగర్ మానేరు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పిల్లర్లకు సమీపం నుండే అప్రోచ్ రోడ్డు వేయడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయన్నఆందోళన వ్యక్తమవుతోంది.

బైపాస్ రోడ్డుపైనే…

ఈ తీగల వంతెనను బైపాస్ రోడ్డుకు అను సంధానం చేసే విధంగా అధికారులు డిజైన్ చేయడం ఇబ్బందికరంగా మారే ప్రమాదం లేకపోలేదు. హైదరాబాద్, రామగుండం రాజీవ్ రహధారికి లింక్ చేసి ఉన్న బైపాస్ రోడ్డు కావడంతో 24 గంటలూ వాహనాల రాకపోకలు సాగిస్తూనే ఉంటాయి. భారీ వాహనాల నుండి మొదలు బైకుల వరకు చాలా మంది కరీంనగర్ లోకి రాకుండా బైపాస్ మీదుగానే వెల్లేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అంతేకాకుండా బైపాస్ కు ఇరువైపుల కూడా నివాసాలు కూడా ఉండడంతో స్థానికులు కూడా తరుచూ బైపాస్ రోడ్డునే ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో కేబుల్ బ్రిడ్జిని బైపాస్ రోడ్డుకు లింక్ చేయడం వల్ల వంతెన మీద నుండి కిందకు వచ్చే వాహనాలు కంట్రోల్ తప్పే అవకాశాలు ఉంటాయి. అలాగే బైపాస్ రోడ్డు నుండి వచ్చి వెల్లే వాహనాలను అతి వేగంగా నడుపుతుండడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో కేబుల్ బ్రిడ్జిపై నుండి వచ్చే వాహనాలు కిందకు వచ్చినప్పుడు బైపాస్ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలు ఢీ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది వాస్తవం. అంతేకాకుండా బైపాస్ రోడ్డపై ప్రత్యేకంగా ఐలాండ్ నిర్మాణం చేపడతుండడంతో ఇక్కడ రోడ్డు మరింత ఇరుకుగా మారనుంది. దీంతో తరుచూ ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా కేబుల్ బ్రిడ్జిని హౌజింగ్ బోర్డు కాలనీ రోడ్డుకు లింక్ చేస్తే వంతెన పైకి వెల్లే వాహనాదారులే అయినా, కిందకు వచ్చే వాహనాదారులే అయినా ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే బైపాస్ రోడ్డు మీదుగా వెల్లే వాహనాల ప్రమాదాలు కూడా నిలువరించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించకుండా ఇంజనీరింగ్ అధికారులు ఎలా డిజైన్ చేశారన్నదో అంతుచిక్కకుండా పోయిందని నగరవాసులు అంటున్నారు. తాజాగా ఇక్కడ నిర్మిస్తున్న ఐలాండ్ లోకి కారు దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి మరణించిన విషయాన్ని కూడా అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది. ఎత్తు నుండి వచ్చేప్పుడు ఒక్కోసారి వాహనాలు అదుపుతప్పే ప్రమాదం కూడా ఉంటుందన్న విషయాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే రానున్న కాలంలో ఇది యాక్సిడెంట్ జోన్ అయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

You cannot copy content of this page