దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రభావానికి తోడు… పార్టీ అధి నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిన నియోజకవర్గమది… వచ్చే సాధారణ ఎన్నికల్లో అక్కడ పాగా వేయాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది అదిష్టానం. ప్రత్యర్థి ప్రయారిటీని తగ్గిస్తూ… అధికార పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేసుకునే దిశగా ప్రయత్నాలు సాగతున్నాయక్కడ. అయితే ఇప్పుడా సెగ్మెంట్ లో మాత్రం గణనీయంగా గ్రాఫ్ పడిపోవడంతో అధిష్టానం ఆగ్రహంతో ఊగిపోతోంది. చివరకు అక్కడి నేతకు గట్టిగా క్లాస్ ఇచ్చి నడక నడవడిక ఎలా ఎండాలో కూడా చెప్పి పంపించినట్టుగా ప్రచారం జరుగుతోంది.
తగ్గిన గ్రాఫ్ …
మూడు నాలుగు నెలల క్రితం 8 శాతం ప్లస్ లో ఉన్న ఈ నియోజకవర్గంలో నేడు మైనస్ లో రావడం ఏంటన్న మిస్టరీని ఛేదించేందుకు పలు రకాలుగా ఆరా తీసినట్టుగా సమాచారం. ప్రస్తుతం 28 నుండి 30 శాతానికే ఓటు బ్యాంకు తగ్గిపోవడం ఏంటన్న మిస్టరీ తెలుసుకున్న తరువాత అధిష్టానం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినట్టుగా సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించిన నియోజకవర్గాల్లో ఒకటైన ఆ నియోజకవర్గంపై మెయిన్ లీడర్ దృష్టి ఉంటుందన్న విషయాన్ని విస్మరించి మరీ సదరు నాయకుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని అధిష్టానం దృష్టికి చేరింది. ఉత్తర తెలంగాణాలోని ఆ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని బీఆర్ఎస్ బాద్షాలా వ్యవహరించాలని అధినాయకత్వం కలలు కని ఏరీ కోరి ఓ నాయుకునికి కీలక బాధ్యతలు అప్పగించింది. సదరు నేత నోరు జారుతున్న తీరు, క్యాడర్ తో పెరిగిపోతున్న గ్యాప్, ఆ సెగ్మెంట్ పబ్లిక్ లో పెరిగిన చులకన భావం, అధికార యంత్రాంగం కినుక వహించడం తదితర అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వివిధ వర్గాల్లో పార్టీపై ఎలాంటి అభిప్రాయం ఉంది అన్న వివరాలు సేకరించిన తరువాత అతన్ని అధిష్టానం సక్రమ పద్దతిలో నడిపించాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. పార్టీ క్యాడర్, ఆఫీసర్లతో కూడా సఖ్యత లేకపోవడం ఒక ఎత్తు కాగా అవినీతి ఆరోపణలు కూడా వస్తుండడం అధిష్టానానికి మింగుడుపడకుండా తయారైంది. ఇసుక స్మగ్లింగ్ చేస్తున్న గ్రామాలను సెలెక్ట్ చేసి మరీ నెల వారి మామూళ్లు ఇవ్వాలని ఆదేశించడంతో పాటు వివిధ శాఖల మండల స్థాయి అధికారులకు కూడా టార్గెట్లు ఫిక్స్ చేశారన్న విషయంపై బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకత్వం మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆర్థిక పరమైన అంశాలకు తలొగ్గకుండా పార్టీని బలోపేతం చేస్తాడని నమ్మకం ఉంచిన అధిష్టానం ఆ నాయకుడికే ప్రయారిటీ ఇస్తే అతను వ్యవహరిస్తున్న తీరు పార్టీ ప్రతిష్టను క్రమక్రమంగా దిగజార్చుతోందన్న విషయం గమనించిందని విశ్వసనీయంగా తెలుస్తోంది.
సహచర నాయకులతోనూ…
పార్టీకి చెందిన ఇతర నాయకులతోనూ సఖ్యత లేకుండా వ్యవహరిస్తున్న తీరు కూడా విస్మయానికి గురి చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుని వచ్చే ఎన్నికల్లో బలమైన నాయకుడిగా ఎదుగుతాడని ఆశిస్తే… స్వతహాగా పార్టీకి ఉన్న గ్రాఫ్ ను కూడా పడిపోయేలా అతని చర్యలు ఉండడం ఏంటీ అన్న విషయంపై అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం. ఆ నాయకుడు సొంతగా ఏర్పాటు చేసుకున్న క్యాడర్ వల్ల కూడా ఇమేజ్ డ్యామేజ్ అవుతోందన్న విషయాన్ని కూడా గమనించిన అధిష్టానం ఇటీవల గట్టిగా డోస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక నుండి ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టి ప్రజలతో మమేకం కావాలని, వసూళ్ల పర్వానికి బ్రేకులు వేయాలని బీఆర్ఎస్ ముఖ్య నేత హితవు పలికినట్టు సమాచారం.