CCLA నివేదిక సరే… శాశ్వత పరిష్కారం ఎలా మరి..?

దిశ దశ, పలిమెల:

మండలంలోని భూస్వాముల భూముల విషయంలో జిల్లా అధికారులు ఇచ్చే నివేదికలు శాశ్వత పరిష్కారం చూపుతాయా..?  ఈ సమస్య పరిష్కారం కోసం అధికారులు ఎలాంటి చొరవ చూపాల్సి ఉంది..? దళిత, గిరిజనులు సాగు చేసుకుంటున్న ఈ భూములను రెవెన్యూ రికార్డుల ఆధారంగా పట్టాదారులు డెక్కన్ సిమెంట్స్ కంపెనీకి విక్రయించారు. ఒకే రోజున 102 ఎకరాల భూమికి యాజమాన్య హక్కులు మార్చడంతో రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన జిల్లా అధికారులు తాజాగా జరిగిన లావాదేవీలపై సీసీఎల్ఏకు నివేదిక అందించేందుకు సమాయత్తం అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. అయితే తాజాగా జరిగిన యాజమాన్య హక్కుల మార్పిడికి సంబంధించిన నివేదిక ఇచ్చినట్టయితే పలిమెల భూములకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం మాత్రం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు పట్టాదారుల వారసులు ముసుగులో జరిగిన భూ బదలాయింపు వ్యవహారంపై కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది.

కమాల్ అప్పుడేనా..?

పలిమెలకు చెందిన ఖాజా దబీరుద్దీన్ (పాషాదొర), పట్టేదారుగా ఉన్న ఖాజా నసీరుద్దీన్ కు చెందిన వందలాది ఎకరాల భూములను 1980వ దశాబ్దం నుండి ఈ ప్రాంతానికి చెందిన దళిత, గిరిజనులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ భూములకు సంబంధించిన అంశం చాలా కాలంగా మరుగున పడి పోగా 2008లో పట్టాదారుల వారసులుగా చెలామణి అయిన వారు రంగంలోకి వచ్చారు. కమాలోద్దీన్ అనే వ్యక్తి ద్వారా ఈ భూములకు సంబంధించిన క్రయవిక్రయాలు జరిగినట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే కమాలోద్దీన్ అనే వ్యక్తి అసలు పట్టాదారులకు వారసుడేనా..? కాదా అన్న విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. సంబంధం లేని వ్యక్తి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వాటిని రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఒక వేళ కమాలోద్దీన్ అసలు వారసుడే అయితే ఆయన ఒక్కడే ఉన్నగా మిగతా వారు ఎవరూ లేరా అన్న వివరాలను కూడా సేకరించినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పటికి హైదరాబాద్ లోని గుడి మల్కాపూర్ ప్రాంతంలో పాషాదొరకు చెందిన వారసులు నివాసం ఉంటున్నారని, మరికొంత మంది విదేశాల్లో స్థిరపడ్డారని వారి గురించి పూర్తి వివరాలు సేకరించి వాంగ్మూలాలు తీసుకున్నట్టయితే అసలు గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పలిమెల భూముల్లో కమాలోద్దీన్ ద్వారా జరిగిన కమాల్ గురించి స్పష్టత వస్తుందని స్థానికులు అంటున్నారు. అలాగే అప్పుడు జరిపిన లావాదేవీల సమయంలో రెవెన్యూ అధికారులు ఇచ్చిన ధృవీకరణ పత్రాలతో పాటు, సాక్షులు, డాక్యూమెంట్ రైటర్లను విచారించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. దీనివల్ల అధికారులు కూడా ఈ భూములకు శాశ్వత పరిష్కారం చూపినట్టు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సీలింగ్ భూములా..?

1973లో అమల్లోకి వచ్చిన సీలింగ్ యాక్టు విషయంపై కూడా జిల్లా అధికారులు దృష్టి పెడితే బావుంటుందని స్థానిక రైతులు అంటున్నారు. సీలింగ్ యాక్టు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భూ స్వాముల భూములు ప్రభుత్వ ఎన్ని ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందో కూడా తెలిసే అవకాశం ఉంది. సీలింగ్ పరిధిలో ఉన్న భూముల లావాదేవీలు జరిగినట్టయితే చట్ట ప్రకారం ఈ రిజిస్ట్రేషన్లు చెల్లవని తెలుస్తోంది. అంతేకాకుండా కొంత మేర భూమిని వివిధ కార్పోరేషన్ ల ద్వారా కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎస్సీ కార్పోరేషన్ తో పాటు ఇతర కార్పోరేషన్ల ద్వారా పలిమెలకు చెందిన భూస్వాముల భూములు కొనుగోలు చేసినట్టయితే వాటిని విక్రయించేందుకు పట్టాదారులకు కానీ వారి వారసులకు కానీ హక్కు ఉండదు. అలాంటి లావాదేవీలు జరిపిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. సీలింగ్ యాక్టు, కార్పోరేషన్లు కొనుగోలు చేసిన భూముల వివరాలను సేకరించి వాటి ఆదారంగా భూములను స్వాధీనం చేసుకున్నట్టయితే సగం సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

శ్రీధర్ బాబుపై మచ్చ…

అయితే దశాబ్దాలుగా సాగుతున్న పలిమెల భూముల వ్యవహారం చివరకు శ్రీధర్ బాబుపై ఆరోపణలు చుట్టు ముట్టేలా చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల పేర్లు కూడా ఈ భూముల క్రయ విక్రయాల్లో వినిపిస్తుండడం… వారే డెక్కన్ సిమెంట్స్ కంపెనీకి విక్రయించడం వెనక శ్రీధర్ బాబు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపణలు చేస్తున్నారు. అయితే 2008లో భూములు కొన్న వారిలో కొందరు వేరే వారికి విక్రయించారు. ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు వెల్లిన స్థానికేతర పట్టాదారులను పల్మెల ప్రాంత రైతులు నిలవరించారు. తమ భూముల్లోకి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాషా దొరకు చెందిన ఈ భూములను బిట్లు బిట్లుగా కొనుగోలు చేసిన కొంతమంది ఇతరులకు అమ్మడంతో రెవెన్యూ అధికారులు కూడా వారి పేరిట రికార్డులు మార్చేశారు. దీంతో మొఖాపై ఉన్న రైతులకు, రికార్డులకు పొంతన లేకుండా పోతోంది. మరో వైపున కొంతమంది భూమిని స్వాధీనం చేసుకోకున్నప్పటికీ వారికి స్థానిక యంత్రాంగం పొజిషన్ సర్టిఫికెట్లు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అధికార యంత్రాంగం ఈ విషయంపై ఇప్పటి వరకు చేసిన లావాదేవీలపై లోతుగా అధ్యయనం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైంది. తాజాగా డెక్కన్ సిమంట్ ఇండస్ట్రీకి ఈ భూములు విక్రయించడం… అమ్మిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి పేర్లు ఉండడంతో శ్రీధర్ బాబును ఈ వ్యవహారంలో టార్గెట్ చేసినట్టుగా స్పష్టం అవుతోంది. అయితే ఇంతకాలం సైలెంట్ గా ఉన్న పట్టాదారులు ఇప్పుడు సిమెంట్ కంపెనీకి విక్రయించడం వల్లే ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చినట్టయింది. పలిమెల భూముల విషయంలో అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరిపి శాశ్వతమైన పరిష్కారం చూపకపోయినట్టయితే ఈ సమస్య తరతరాలను వెంటాడే ప్రమాదం ఉంటుందన్న విషయం గుర్తు పెట్టుకోవల్సిన అవసరం ఉంది.

You cannot copy content of this page