దిశ దశ, హైదరాబాద్:
రోగుల నాడి చూసి ఎలాంటి వైద్యం అందించాలో గుర్తించి చికిత్స అందించాల్సిన డాక్టర్లు ప్రజా క్షేత్రంలోనూ సక్సెస్ అయ్యారు. వైద్యో నారాయణో హరీ అంటే రోగులను బాగు చేయడమే కాదు… సమాజాన్ని కూడా తీర్చిదిద్దాలనుకున్న డాక్టర్లు చట్ట సభకు ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో రాష్ట్రం నుండి 15 మంది డాక్టర్లు విజయ బావుటా ఎగురవేసి సంచలనం సృష్టించారు. తెలంగాణలో జరిగిన మూడో విడుత ఎన్నికల్లో డాక్టర్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. గతంలో ఎక్కువగా న్యాయవాదులు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చే ఆనవాయితీ కొనసాగేది. డాక్టర్లు చాలా తక్కువ సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చే వారు. కానీ ఈ సారి మాత్రం వైద్యులు విజయ దుంధిబి మోగించిన తీరు సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో వైద్యుల పాత్ర అత్యంత కీలకంగా మారిపోయింది.
డాక్టర్ల వివరాలు ఇవే…
రామచంద్రు నాయక్ జనరల్ సర్జన్ డాక్టర్ డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణ కూడా జనరల్ సర్జన్ కాగా, సిర్పూర్ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ ఆర్థో పెడిక్ సర్జన్, మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మురళీ నాయక్ జనరల్ సర్జన్ గా, మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ కూడా జనరల్ సర్జన్ డాక్టర్ కావడం విశేషం. మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఎంబీబీఎస్ డాక్టర్ కాగా నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణికా రెడ్డి జనరల్ ఫిజిషియన్ డాక్టర్, నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పిల్లల వైద్య నిపుణులు, చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేకానంద ఎంబీబీఎస్ పూర్తి చేయగా, భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆర్థోపెడిక్ సర్జన్ కావడం గమనార్హం. కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్పైన్ స్పెషలిస్లుగా ప్రసిద్దులు, నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆర్థో సర్జన్ కాగా, జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆప్తాల్మిక్ లో ఎంఎస్ చేశారు. సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగమయి పల్మనాలజిస్ట్ లో ఎండీ పూర్తి చేశారు. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుచుకుల్ల రాజేష్ రెడ్డి ఎండీఎస్ డాక్టర్ కావడం విశేషం. ఈ సారి ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఏకంగా 15 మంది డాక్టర్లు ప్రాతినిథ్యం వహిస్తుండడం అరుదైన రికార్డేనని చెప్పాలి.