ఒకే శాఖ ప్రొసిడింగ్స్… వైరుధ్యమైన నిర్ణయాలు…

ట్రక్ షీట్ల ఊసే లేదా..?

దిశ దశ, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లాలో పూడిక మట్టి రవాణా చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన తీరు విస్మయం కల్గిస్తోంది. ఈ దందాకు అధికారులు ఇచ్చిన ప్రొసిడింగ్స్ ను పరిశీలిస్తే విచిత్రమైన నిర్ణయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిబంధనల అమలు కానీ మట్టి తవ్వకాలు జరిపే వారిపై పర్యవేక్షణ కానీ లేకుండానే నిర్ణయాలు తీసుకున్న తీరే అత్యంత విచిత్రంగా మారితే… వేర్వేరు ప్రాంతాల్లో మట్టి తరలింపు విషయంలో అధికారులు ఇచ్చిన ప్రొసిడింగ్స్ ను గమనిస్తే అధికారుల ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం అవుతుంది. వ్యాపారం కోసం తీసుకెల్తున్న పూడిక మట్టి తరలించుకునేందుకు అనుమతి ఇచ్చిన అధికారులు అన్ని రకాలుగా పరిశీలించిన తరువాతే ఇవ్వాల్సి ఉన్నప్పటికీ తమ ఇష్టానుసారంగా వ్యవహరించినట్టుగా స్పష్టం అవుతోంది.

ఒకే శాఖ…

పెద్దపల్లి జిల్లా బిట్టుపల్లి గ్రామ చెరువు నుండి 6666.66667 క్యూబిక్ మీటర్ల మేర పూడిక మట్టి తీసుకోవచ్చని అనుమతి ఇచ్చారు. ప్రొసిడింగ్ నంబర్ EE/IDNO.4/MNTY/DB/HD/246/M ద్వారా మంథని ఇరిగేషన్ అధికారులు ఇచ్చారు. అయితే ఈ ప్రొసిడింగ్ కాపీలో 38 లారీల నంబర్లతో సహా చెరువు కట్ట మీదుగా రవాణా చేయడం నిషేధం, ఒక వేళ చెరువు కట్ట కానీ, తూము కానీ దెబ్బతిన్నట్టయితే మట్టి తరలించుకపోయే వారు వెంటనే మరమ్మత్తులు చేయాలన్న నిబంధన విధించారు. అంతేకాకుండా మట్టి తరలించేప్పుడు ఖచ్చితంగా ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్న నిభందన కూడా ఇచ్చారు. అయితే ఇదే విభాగానికి చెందిన రామగుండం ఏరియాకు చెందిన ఇరిగేషన్ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా ప్రొసిడింగ్స్ విడుదల చేశారు. ప్రొసిడింగ్ నంబర్ EE/ID7/RGM/191/M ద్వారా పాలకుర్తి మండలం కుక్కలగూడురు చెరువు నుండి పూడిక మట్టి తరలించుకపోయేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. 12,500 మెట్రిక్ టన్నుల పూడిక మట్టిని తరలించుకపోయేందుకు ఏజెన్సీకి అనుమతి ఇచ్చారు. అయితే ఈ ప్రొసిడింగ్స్ లో మాత్రం నిబంధనలు కానీ, లారీల నెంబర్లు కూడా వివరించకుండానే ఆదేశాలు ఇవ్వడం విచిత్రం. నీటి పారుదల శాఖ పరిధిలో ఉన్న రెండు డివిజన్ కార్యాలయాల ద్వారా జారీ అయిన ప్రొసిడింగ్స్ విషయంలో వైరుధ్యం కనిపిస్తోంది. మంథని ఇరిగేషన్ కార్యాలయం నుండి జారీ అయిన లేఖలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల్లోగానే మట్టిని తరలించాలన్న కండిషన్ కూడా ఉండగా… రామగుండం ప్రొసిడింగ్ లో మాత్రం అలాంటి ఆదేశాలు ఏవీ కూడా లేకపోవడం విచిత్రం.

ట్రక్ షీట్ల మాటేమిటో..?

గతంలో మైనింగ్ విభాగం ద్వారా అనుమతిచ్చినప్పుడు పూడిక మట్టి తరలించే లారీలకు ప్రత్యేకంగా ట్రక్ షీట్లను ఇచ్చే వారు. అయితే ఈ సారి మట్టి రవాణా చేస్తున్న లారీలకు ప్రత్యేకంగా ట్రక్ షీట్లను ఇచ్చే సాంప్రాదాయానికి స్వస్తి పలికినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ప్రొసిడింగ్ కాపీలను లారీ డ్రైవర్లకు ఇచ్చి మట్టి తరలించుకుని వెల్తున్నట్టుగా స్థానికంగా ఆరోఫణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల అధికారులు ఇచ్చిన అనుమతికి మించి మట్టి అక్రమంగా తరలించే ప్రమాదం కూడా లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పూడికతీత మట్టిని తరలించేందుకు కమర్షియల్ అవసరాల కోసం ఇస్తున్నందున ఇలాంటి అంశాలను పకడ్భందీగా అలము చేయాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి వాటిని అధికారులు పక్కన పెట్టేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.

ఏజెన్సీ డాక్యూమెంట్స్..?

మరో వైపున ఇటుక తయారీ కోసం మట్టిని తరలించుకపోయేందుకు అనుమతి ఇస్తున్న అధికారులు సదరు ఏజెన్సీ అసలైందా కాదా అన్న విషయాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోవల్సి ఉంటుంది. జీఎస్టీ నంబర్ బట్టీలకు సంబంధించిన పర్మిషన్ కాపీలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ప్రొసిడింగ్స్ జారీ చేయాల్సి ఉంటుంది. అయితే పెద్దపల్లి జిల్లాలోని చెరువుల్లో తీస్తున్న మట్టి విషయంలో ఇలాంటి అంశాలను పరిశీలించారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. జిల్లా అధికారులు పూడిక మట్టి తరలించేందుకు అనుమతి తీసుకున్న ఏజెన్సీలకు సంబంధించిన వివరాల గురించి కూడా విచారణ చేపట్టాలన్న అభ్యర్థనలు కూడా వినిపిస్తున్నాయి.

You cannot copy content of this page