గజగజాలాడిస్తున్న గజరాజు…

144 సెక్షన్ అమలు…

దిశ దశ, ఆసిఫాబాద్:

సరిహధ్దు అటవీ ప్రాంతాల్లో ఇప్పుడు పులులే కాదు ఏనుగులు కూడా కలవరపెడుతున్నాయి. చలి కాలంలో తెలంగాణాలోకి వచ్చే పులులతోనే భయాందోళనకు గురయిన ప్రజలు ఇప్పుడు ఏనుగుల బారి నుండి తప్పించుకునేందుకు జాగ్రత్త పడాల్సి వస్తోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించి ఓ గజరాజు ఇద్దరిని హతం చేయడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. బుధవారంస సరిహద్దు గ్రామాల్లోకి వచ్చిన ఏనుగు సంచారం వెలుగులోకి రావడంతో అటవీ గ్రామాల జనం ఉలిక్కిపడ్డారు.

దారి తప్పి వచ్చిందా…

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు అవతలి వైపున ఉన్న గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతానికి ఓ ఏనుగుల మంద చేరుకున్నట్టుగా అక్కడి అటవీ అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతంలో తిరుగుతున్న క్రమంలో మంద నుండి తప్పిపోయిన ఓ ఎనుగు తెలంగాణా సరిహద్దు గ్రామాల్లోకి వచ్చి చేరింది. ఈ విషయంపై ముందుగానే అప్రమత్తం చేశామని అటవీ అధికారులు చెప్తున్నారు. చింతలమానేపల్లి, పెంచికల్ పేట, బెజ్జూరు మండలాల్లో సంచరిస్తున్న గజరాజు కారణంగా స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. చింతలమానేపల్లి మండలం బూరెపల్లికి చెందిన రైతు అల్లూరి శంకర్ ను, పెంచికల్ పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య అనే రైతును కూడా చంపేసింది. అయితే అటవీ శాఖ అధికారులు కూడా ఏనుగు సంచారం గురించి అప్రమత్తం చేసేందుకు డప్పు చాటింపు చేయిస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా శివార్లలోకి రాకూడదంటూ హెచ్చరిస్తున్నారు.

144 సెక్షన్…

వన్య ప్రాణుల సంచారం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కూడా అలెర్ట్ అయ్యారు పరివాహక గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జనసంచారాన్ని నిలువరించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. గతంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అడవుల్లోకి వచ్చిన ఏనుగు మంద అటవీ గ్రామాల వాసులను కలవరపెట్టింది. ఓ ఏనుగు చేత చిక్కిన అటవీ ఉద్యోగి హతం అయ్యాడు. ఇటీవల కాలంలో సరిహధ్దు అటవీ ప్రాంతంలోకి ఏనుగుల సంచారం తీవ్రం కావడం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా గడ్చిరోలి అటవీ ప్రాంతం నుండి దారి తప్పి వచ్చిన గజరాజు తిరుగు ప్రయాణం అయితే తప్ప స్థానికుల్లో ప్రశాంతత నెలకొనే పరిస్థితి లేదు. అయితే ఏనుగుల మంద నుండి వీడిపోవడంతోనే గందరగోళానికి గురై బీభత్సం సృష్టిస్తోందని భావిస్తున్నారు.

You cannot copy content of this page