మేడిగడ్డ ఘటనలో క్షణాల్లో మారిన ప్రెస్ నోట్
దిశ దశ, భూపాలపల్లి:
మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజీ విషయంలో భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే పేరిట విడుదల అయిన ప్రెస్ నోట్ సంచలనంగా మారింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదైన విషయం గురించి ఎస్పీ మంగళవారం సాయంత్రం మీడియాకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మొదట విడుదల చేసిన ప్రకటనలో ఘటనకు సంబంధించిన తేదిల వివరాలు తప్పుగా ఉండడంతో పాటు బ్యారేజ్ దెబ్బతినడం వెనక ఎలాంటి నేర కోణం లేదని స్పష్టం చేశారు. అయితే ఎస్పీ పేరిట విడుదల అయిన ఈ ప్రకటనలో తేదీలు తప్పుగా పడ్డాయన్న విషయాన్ని గమనించి వెంటనే గ్రూప్ నుండి డిలిట్ చేసి మరో ప్రకటన షేర్ చేశారు. రెండో ప్రకటనలో ఘటన జరిగిన తేది, ఎఫ్ఐఆర్ జారీ చేసిన రోజు వివరాలను మార్చడంతో పాటు మరో అంశాన్ని కూడా ఛేంజ్ చేశారు పోలీసులు. మొదటి సారి విడుదల చేసిన ప్రకటనలో ఎలాంటి నేర కోణం లేదని తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించగా, రెండో సారి విడుదల చేసిన ప్రకటనలో మాత్రం ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, ఫోరెన్సిక్ సైంటిఫిక్ లాబోరేటరి (ఎఫ్ఎస్ఎల్), క్లూస్ టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయని వివరించారు. అయితే మంగళవారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటి బ్యారేజీని పరిశీలించిందని, నిపుణుల కమిటీ నిర్దారించిన దానిని బట్టి పోలీసులు ఓ నిర్ణయానికి రానున్నారని వివరించారు. నీటి పారుదల శాఖ అధికారులు ఇచ్చిన అభ్యర్థన మేరకు భద్రతా సమస్య కారణంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఈ వంతెన మీదుగా వాహనాల రాకపోకలను నిలిపివేశారని వివరించారు. దీంతో అప్పటికప్పుడు ప్రకటనలో మార్పులు చేర్పులు చేయడం వెనక ఆంతర్యం ఏంటోనన్న చర్చ మొదలైంది.