దిశ దశ, కరీంనగర్:
అంతా బావుందన్న భ్రమల్లోకి వెల్లిపోయిన తరువాత వెనకా ముందు చూసుకోకుండా తప్పిదాలు చేస్తుండడం సహజం. దీనికి తోడు తామేం చేసినా చెల్లుబాటు అవుతుందున్న అతి నమ్మకానికి కూడా చేరడంతో ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు కొంతమంది. సరిగ్గా ఇలాంటి తీరే కరీంనగర్ జిల్లా మానేరు ఇసుక రీచుల వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది.
ఎన్టీటీ ఉత్తర్వులు భే ఖాతర్ …
కరీంనగర్ జిల్లా మీదుగా ప్రవహిస్తున్న మానేరు నది నుండి డిసిల్ట్రేషన్ పేరిట ఇసుక విక్రయాలు జరిపేందుకు నిర్ణయించుకున్నారు. డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్ కమిటీ (DLSC)లు తీర్మాణం చేయగానే టీఎస్ఎండీసీ టెండర్ ద్వారా ఇసుక రీచులను ఏర్పాటు చేసే ప్రక్రియను కొనసాగించింది. అయితే అవసరాలకు కాకుండా వ్యాపారం కోసం రీచులను ఏర్పాటు చేసి నదిలో ఇసుక తవ్వకాలు చేయాలంటే కేంద్ర పర్యావరణ విభాగం నుండి ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ తీసుకోవల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచుల నుండి ఇసుక అమ్మకాలు సాగించినప్పటికీ ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స మాత్రం తీసుకోలేదు. ఇదే అంశంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించడంతో గత సంవత్సరం ఏప్రిల్ 28న ఎన్జీటీ ఇసుక తవ్వకాలపై స్టే విధించింది. ఓఏ నంబర్ 51/2023 ద్వారా వేసిన పిటిషన్ ను విచారించిన ఎన్జీటీ చైన్నై బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను అమలు చేయాలంటూ అప్పటి అదికారులకు ఉత్తర్వులు జారీ అయినప్పటికీ కాంట్రాక్టర్లు, టీఎస్ఎండీసీ అధికారులు సరికొత్త పల్లవి ఎత్తుకున్నారు. తాము ఇసుక రవాణా మాత్రమే చేస్తున్నామని మానేరులో ఇసుక తవ్వకాలు జరపడం లేదంటూ వాదిస్తూ ఎన్జీటీ ఉత్తర్వులకు అనుగుణంగానే నడుచుకుంటున్నామన్న భ్రమలను క్రియేట్ చేశారు. అయితే ఈయా రీచులకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన స్టాక్ యార్డుల నుండి దర్జాగా ఇసుక రవాణా జరుగుతూనే ఉంది. ఆ స్టాకు యార్డుల్లో మానేరు నదిలో తవ్వకాలు జరగకున్నా ఇసుక మాత్రం దాదాపు 9 నెలలుగా స్టోరేజ్ ఉండడం విచిత్రం. గత జనవరి 6న జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కరీంనగర్ జిల్లాలోని 8 రీచులను మూసివేయాలని ప్రొసిడింగ్స్ తీశారు. దీంతో అప్పటి నుండి కరీంనగర్ జిల్లాలోని ఇసుక రీచులు మూసివేశారు. అయితే ఎన్జీటీ స్టే ఇచ్చిన తరువాత 9 నెలల పాటు కరీంనగర్ జిల్లాలోని ఇసుక రీచుల్లో స్టాక్ ఉండగా, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రొసిడింగ్స్ జారీ చేసిన తరువాత గంటల్లోనే రీచులు మూతపడడం గమనార్హం. అంటే ఎన్జీటీ స్టేకు, కలెక్టర్ పమేలా సత్పతి ఇచ్చిన ఉత్తర్వులకు మధ్య కాలంలో ఎంత మేర ఇసుక రవాణా అయిది..? ఆ ఇసుక ఎక్కడి నుండి స్టాక్ యార్డులకు వచ్చిందన్నదే పజిల్ గ మారింది.
లాజిక్ మిస్..
ఓ వైపు తాము మానేరులో ఇసుక తవ్వకాలు జరపలేదంటూనే టీఎస్ఎండీసీ అధికారులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చారు. ఎన్నికల సమయంలో కరీంనగర్ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ పమేలా సత్పతికి ఎన్జీటీ స్టే ఉందన్న విషయం చెప్పకుండా రెగ్యూలర్ గా సాగుతున్న విధానమేనని నమ్మించి ఇసుక తవ్వకాల సమయాన్ని పొడగించాలని కోరుతూ ప్రతిపాదనలు పంపారు. కరీంనగర్ జిల్లాలోని 8 రీచుల్లో మొత్తం 74 లక్షల 32 వేల 404 క్యూబిక్ మీటర్ల ఇసుక డిసిల్ట్రేషన్ చేయాల్సి ఉండగా, 59 లక్షల 81 వేల 749 క్యూబిక్ మీటర్ల ఇసుక ఇంకా తరలించాల్సి ఉందని ప్రతిపాదనలను పంపించడంతో జిల్లా కలెక్టర్ ఇందుకు అనుమతి ఇస్తూ గత సంవత్సరం నవంబర్ 10న ఉత్తర్వులు జారీ చేశారు. అసలు తాము మానేరు నది నుండిఇసుక తవ్వకాలు జరపడం లేదని, రవాణా మాత్రమే చేసుకుంటున్నామని భ్రమలు కల్పించిన అధికారులు ఇసుక రీచులను కొనసాగించేందుకు జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు ఎందుకు పంపారన్నదే మిస్టరీగా మారింది.
మరో లేఖ కలకలం…
తాజాగా కరీంనగర్ జిల్లాలోని రెడు రీచులకు సంబంధించిన లేఖలు వైరల్ అవుతున్నాయి. టీఎస్ఎండీసీ శ్రీకాంత్ ఇసుక రీచు ఏజెన్సీలకు ఇచ్చిన ఈ లేఖల్లోనూ ఇసుక తవ్వకాలు జరిపామని చెప్పకనే చెప్పారు. Lr.NO. TSMDC/ KNR/ SAND/ 2023/ 911, తేది 21.12.2023న విడుదలైన లేఖలో వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి బ్లాక్ 1 రీచులో 29.12.2022 నుండి 28.12.2023 వరకు ఇసుక తవ్వకాలలను అగ్రిమెంట్ ఇచ్చామని వివరించారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఈ రీచు నుండి 12 లక్షల 69 వేల 760 మెట్రిక్ టన్నుల ఇసుకకు గాను లక్షా 52 వేల 587 మెట్రిక్ టన్నుల ఇసుకను సేకరించారని, ఇందులో లక్షా 44 వేల 839 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించారని మిగతా 7748.5 మెట్రిక్ టన్నుల ఇసుక నిలువ ఉందని వివరించారు. అలాగే Lr.NO.TSMDC/ KNR/ SAND/ 2023/ 912, తేది 21.12.23న ఇచ్చిన ఈ లేఖలో వీణవంక మండలం బ్లాక్ 2లో 12 లక్షల 69 వేల 760 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాల కోసం 2023 జనవరి 5న అగ్రిమెంట్ చేయగా ఈ క్వాంటిటీ ఇసుకను తొలగించేందుకు 2024 జనవరి 4 వరకు గడువు విధిస్తు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఈ రీచులో గత డిసెంబర్ 21 వరకు 2 లక్షల 50 వేల 848 మెట్రిక్ టన్నుల ఇసుకను నది నుండి సేకరించగా 2 లక్షల 23 వేల 780 మెట్రిక్ టన్నుల ఇసుకను తరలించారని మిగతా 27 వేల 068 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డులో నిల్వ ఉందని పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించిన పిటిషనర్లు బెంచ్ ముందు మానేరులో ఇసక తవ్వకాలు జరుపుతున్నాయని వివరించారు. అయితే తాము రవాణా మాత్రమే చేస్తున్నామని ఇసుక తవ్వకాలు జరపడం లేదంటూ వాదించిన క్రమంలో పిటిషనర్లు కొన్ని లైవ్ వీడియోలు, ఫోటోలను చెన్నై బెంచ్ కు అందించారు. జ్యుడిషియల్ అధికారం ఉన్న నేషనల్ గ్రీన్ ట్యిబ్యూనల్ కూడా టీఎస్ఎండీసీ అధికారులు తప్పుదారి పట్టించినట్టుగా తాజాగా వెలుగులోకి వచ్చిన అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు తేల్చి చెప్తున్నాయి.