ప్రజలతో మమేకం కండి…
కేసీఆర్ పిలుపు…
దిశ దశ, హైదరబాద్:
ప్రజల్లోకి వెల్లండి… వారితో మమేకం కండి… ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయండి… ముందస్తు ఎన్నికలకు వెల్లే ప్రసక్తే లేదంటూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. డిసెంబర్ లో జరగనున్న ఎన్నికలకు ప్లాన్ చేసుకోవాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఇందు కోసం అక్టోబర్ నాటికల్లా అన్ని పనులు పూర్తి చేసుకుని డిసెంబర్ ఎన్నికలకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. మంత్రి వర్గ సమావేశంలో ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు అత్యంత ఆదర్శ ప్రాయంగా ఉన్నాయని, వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, ప్రజా క్షేత్రంలో ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పార్టీలో అన్ని స్థాయిల నాయకులను కలుపుకపోవాలని, ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజా ప్రతినిధులు మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు మరింత చురుగ్గా పని చేయాలని, వరంగలో లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇక నుండి టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉండదని, బీఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాలు ఉంటాయని సీఎం అన్నారు.
