పుట్ట మధుకు పేరు ఖరారు…
దిశ దశ, కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణ భవన్ లో విడుదల చేసిన జాబితాలో జిల్లాలోని మూడు చోట్ల మినహా అన్ని చోట్ల కూడా పాతవారికే టికెట్లు ఇచ్చారు. కోరుట్ల నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ సంజయ్ కి అవకాశం కల్పించారు. వేములవాడ విషయంలో అంతా ఊహించినట్టుగానే చెన్నమనేని స్థానంలో చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు అవకాశం ఇచ్చారు. హుజురాబాద్ లో ఉప ఎన్నికల అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు కాకుండా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి అవకాశం దక్కింది. ఉమ్మడి జిల్లాలో గత కొంతకాలంగా వచ్చిన ఊహాగానాలకు చెక్ పెట్టేశారు అధినేత కేసీఆర్. మంథని నుండి పుట్ట మధుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రచారం జరిగినప్పటికీ ఆయనకే అవకాశం ఇవ్వడం గమనార్హం. ఇటీవల పుట్ట మధుకు వ్యతిరేకంగా అసమ్మతీయులంతా జట్టు కట్టినప్పటికీ పుట్ట మధే బలమైన వ్యక్తని నిర్దారించుకున్న కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అలాగే రామగుండం విషయంలో కూడా అసమ్మతి నేతల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను ప్రకటించారు. మరో వైపున చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు వ్యతిరేకంగా ఆరు మండలాల నాయకులు జట్టు కట్టి అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. గెలుపు బాటలో సుంకె రవిశంకర్ ఉన్నారని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయననే అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే సర్వేలు చేయించిన తరువాతే తుది జాబితా సిద్దం చేసినట్టుగా స్పష్టం అవుతోంది. జగిత్యాలలో టికెట్ ఎవరికి వస్తుందో తెలియదు… ఒక వేళ టికెట్ వచ్చినట్టయితే తాను వచ్చి ఓట్లు అభ్యర్థించకున్నా అండగా నిలబడాలని కామెంట్ చేసిన డాక్టర్ సంజయ్ పేరే ఖరారు అయింది. మరో వైపున హుస్నాబాద్ టికెట్ కూడా మారుతుందని ఇక్కడి నుండి మంత్రి హరీష్ రావు బరిలో నిలుస్తారన్న ప్రచారం అంతా వట్టిదేనని తేల్చి పారేసినట్టయింది. అందరూ అంచనా వేసినట్టుగానే మంత్రులు కేటీఆర్ సిరిసిల్ల, కొప్పుల ఈశ్వర్ ధర్మపురి, గంగుల కమలాకర్ కరీంనగర్ టికెట్లు కెటాయించగా పెద్దపల్లి దాసరి మనోహర్ రెడ్డినే ప్రకటించడంతో అసమ్మతీయులు చేసుకున్న ప్రచారం అంతా వట్టిదేనని తేలిపోయింది. మానకొండూరు నుండి రసమయి బాల కిషన్ పేరునే ప్రకటించడం విశేషం.