గృహలక్ష్మికి రూ. 12 వేల కోట్లు
14 అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
కేబినెట్ నిర్ణయాలివే: మంత్రి హరీష్ రావు
దళితబంధు, డబుల్ బెడ్ రూమ్, పోడు భూములపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలిపారు. గురువారం ప్రగతి భవన్ లో నిర్వహించిన కేబినెట్ మీటింగ్ అనంతరం ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… రాష్ట్రంలో లక్షా30 వేల మందికి దళిత బంధు ఇవ్వాలని నిర్ణయించామని, హుజురాబాద్ లో వంద శాతం అమలు చేశామని, ప్రతి నియోజవర్గంలో 1100 మందికి లబ్ది చేకూర్చబోతున్నామన్నారు. అయితే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కలెక్టర్ల ద్వారానే జరుగుతుందన్నారు. సొంత స్థలం ఉన్నవారికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం గృహాలక్ష్మి పథకం ద్వారా అందిస్తామన్నారు. నాలుగు లక్షల మంది పేదలకు గృహలక్ష్మి మంజురు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని, ఇందుకు రూ. 12 వేల కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. అయితే ఇంటి నిర్మాణం కోసం ఇచ్చే డబ్బులు మాత్రం ఇల్లాలి పేరిట మాత్రమే ఇస్తామని వెల్లడించారు. మూడు దశల్లో ఈ స్కీం డబ్బులు లబ్డిదారులకు అందజేస్తామన్నారు. గతంలో ఉన్న గృనిర్మాణాలపై ఉన్న పెండింగ్ అప్పులను మాఫీ చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన రూ. 4 వేల కోట్లు ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. రూ.
4,400 కోట్లతో గొర్రెల పంపిణీ చేపట్టి 3.50 లక్షల మందికి లబ్ది చేకూరుస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఎకరాల భూములు, 1.53 లక్షల మంది లబ్దిదారులకు పోడు పట్టాలు ఇవ్వనున్నామని చెప్పారు. ఏప్రిల్ 14న రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అబేంద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయాలని నిర్ణయించామని, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. జీవో 58,59 జీఓల ద్వారా మరోసారి రెగ్యులైరేజేషన్ అవకాశం కల్గించాలని, జీవో 58 ద్వారా లక్షా 45 వేల 668
మందికి ఇప్పటికే పట్టాలిచ్చామన్నారు. కాశీలో తెలంగాణ భక్తుల వసతి కోసం కూడా ప్రత్యేక దృష్టిసారించామని వారి కోసం రూ. 25 కోట్లతో తెలంగాణ వసతి గృహ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. శబరీమలలో కూడా రూ. 25 కోట్లతో వసతి గృహం నిర్మిస్తామని, పేదలు ,గిరిజన, దళితుల కోసం మేలు జరిగేలా కేబినెట్ నిర్ణయాలు తీసుకుందని హరీష్ రావు వివరించారు. సెక్రటేరియేట్జూన్ 2 లోగా ప్రారంభిస్తామని, గృహలక్ష్మీ పథకంతో పాటు డబుల్ ఇళ్ల స్కీం కూడా కొనసాగుతుందని మంత్రి ప్రకటించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీకి ఇంకా సమయం ఉందని తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏప్రిల్ నెలాఖరు నుండి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.