దిశ దశ, దండకారణ్యం:
మార్కిజం… లెనినిజం సిద్దాంతాలతో విప్లవ పోరాటం ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్నా… ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. భారత విప్లవోద్యమ చరిత్రలో కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పశ్చిమ బెంగాల్ చారుమజుందార్ పిలుపునందుకుని 1967 నక్సల్ బరి ఉద్యమం వైపు అడుగులు వేసిన వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే ఎక్కువ. విప్లవ పంథాలో ముందుకు సాగుతూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, జనశక్తి పార్టీని నిర్మించిన కూర రాజన్నలు ఉమ్మడి జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.
బీర్పుర్ టు ఇంటర్నేషనల్…
జగిత్యాల జిల్లా బీర్పుర్ కు చెందిన ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి తనదైన ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి నక్సల్ బరి ఉద్యమం వైపు సాగారు. దళ కమాండర్ స్థాయి నుండి అంతర్జాతీయ విప్లవ సమూహాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలుగు నాట 1980వ దశాబ్దంలో ప్రారంభమైన పీపుల్స్ వార్ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆయన 1991 వరకు వివిద క్యాడర్ లలో పార్టీ నిర్మాణం కోసం పని చేశారు. 1991లో అప్పటి వరకు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొండపల్లి సీతారామయ్య అలియాస్ కెఎస్ ను తప్పించిన తరువాత ఆ బాధ్యతలను గణపతికి అప్పగించారు. 2004 వరకు పీపుల్స్ వార్ సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా పని చేసిన ముప్పాళ పార్టీని మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ (ఎంసీసీ)లో విలీనం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. దేశంలోని విప్లవ పార్టీలన్ని ఒకే గొడుగు కిందకు రావాలన్న నినాదంతో పీపుల్స్ వార్ ను ఎంసీసీలో విలీనం చేశారు. ఆ తరువాత కూడా మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన 2017లో తన బాధ్యతలను నంబాల కేశవరావుకు అప్పగించారు. అప్పటి నుండి అంతర్జాతీయ రెవల్యూషనరీ పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తూ కార్యదర్శిగా పని చేస్తున్నారు. అప్పటి నుండి ముప్పాళ తన సొంత గ్రామమైన బీర్పుర్ కు మాత్రం వెల్లిన సందర్భాలు లేవు. ఆయన పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్థిలో వాటాగా వచ్చిన ఇళ్లు శిథిలమైపోయింది. 1990 ప్రాంతం వరకు ఆయన తల్లి ఆ ఇంట్లో ఉండేవారు కాగా ఆమె మరణానంతరం ఆ ఇంటిని అలాగే వదిలేయడంతో ముప్పాళ లక్ష్మణ్ రావు సొంత ఇల్లు కూలిపోయింది.
వేములవాడ నుండి…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన కూర రాజన్న అలియాస్ కె ఆర్ ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1974లో విప్లవ పంథా వైపు అడుగులు వేసిన ఆయన సోదరుడు కూర దేవేందర్ అలియాస్ అమర్ లు కలిసి 1978, 79 ప్రాంతంలో జనశక్తి పార్టీని ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో పార్టీ సాయుధ పోరాటం సాగించినప్పటికీ ఎక్కువ ప్రభావం మాత్రం సిరిసిల్ల, దాని పరిసర ప్రాంతాల్లో తిరుగులేని పట్టు సాధించింది. ఈ క్రమంలో పార్టీ ఒక్కసారిగా వీక్ కావడంతో కూర రాజన్న కూడా తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యారు. పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన సహచరి రంగవల్లి 1999 నవంబర్ 11న మరణించారు. అయినప్పటికీ విప్లవ పంథాలోనే పయనం అవుతున్న రాజన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు బారాబంకిలో ఉన్న కెఆర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అప్పటి నుండి బాహ్య ప్రపంచలోనే తిరుగుతున్నప్పటికీ ఆయన విప్లవ భావజాలానికి మాత్రం దూరం కాలేదు. వేములవాడ పట్టణంలోని సొంత ఇంట్లో ఆయన తల్లి మల్లమ్మ జీవనం సాగించే వారు ఆమె మరణానంతరం ఈ ఇంటిని కాపాడే వారు లేకుండా పోయారు. అయితే పట్టణ అభివృద్దిలో భాగంగా రాజన్న ఇల్లు రోడ్డు వెడల్పులో భాగంగా అధికారులు కూల్చివేశారు. ఇటీవల కాలంలో వేములవాడకు వస్తున్న రాజన్న ఇల్లు ఇప్పుడు చిన్న గదికే పరిమితం అయింది. చాలా కాలం జైలు జీవితం గడిపిన రాజన్న తిరిగి ఇటీవల మళ్లీ కొన్ని కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయగా బెయిలుపై బయటకు వచ్చిన ఆయన వేమలువాడ పట్టణంలోని ఓ సత్రంలో బస చేస్తూ కోర్టు కేసులకు హాజరవుతున్నారు. అయితే ఆయనపై పోలీసులు నిఘా పెంచారని తనను ఇబ్బందులు పెడుతున్నారని తన సొంతిల్లు ఒ చిన్న గదికే పరిమితం కావడంతో తాను సత్రంలో ఉంటున్నాని రాజన్న ఇటీవల మీడియాకు వివరించారు. భారతదేశంలో సాయుధ పోరు కొనసాగిస్తున్న రెండు ప్రధాన విప్లవ పార్టీలకు చెందిన సీసీ కమిటీ సెక్రటరీల ఇండ్లు ఇలా ఉండడం విచిత్రం. విప్లవ పంథాలో కొనసాగుతున్న అగ్రనేతలకు పూర్వ కరీంనగర్ జిల్లా జన్మనివ్వగా వారు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. అయితే భారత చట్టాలకు వ్యతిరేకంగా పోరుబాట చేస్తున్న వీరిద్దరితో అనుభందం ఉన్న వారెవరని పోలీసులు ఆరా తీయడంతో పాటు కఠినంగా వ్యవహరించే వారు దీంతో వారి ఇండ్ల వైపు కూడా సామాన్యులు కానీ వారి బంధువులు కానీ కన్నెత్తి చూసేందుకు సాహసించలేదు. దీంతో అవి శిథిలమైపోయే స్థితికి చేరుకున్నాయి.