భాగ్యనగరంలో ఆపరేషన్…
దిశ దశ, హైదరాబాద్:
ట్రాఫిక్ సిగ్నల్ పడగానే మీరు ప్రయాణించే కారు వద్దకు వచ్చి అడుక్కునే వారిని చూసి జాలి పడి రూపాయో, రెండు రూపాయలో వేస్తారు. అలా రోజూ వారు సంపాదించేదెంతో తెలుసా..? ఈ డబ్బు ఎవరి చేతుల్లోకి వెల్తుందో తెలుసా..? హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సయోధ్య ఎన్జీఓ, స్మైల్ ప్రాజెక్టు టీమ్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్ లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బెగ్గర్స్ బ్రతుకు బెగ్గింగ్ కే పరిమితం అవుతుంటే ఆర్గనైజర్స్ మాత్రం వారు అడుక్కొచ్చుకున్న డబ్బును తీసుకుని దర్జాతనం వెలగబెడుతున్నారు. గురువారం చేపట్టిన ఈ స్పెషల్ ఆపరేషన్ లో భాగ్యనగరంలో దౌర్భాగ్యంగా భిక్షాటన చేస్తున్న వారి దుస్థితి వెలుగులోకి వచ్చింది. కేబీఆర్ పార్క్ జంక్షన్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ వద్ద 23 మంది యాచకులను జాయింట్ ఆపరేషన్ ద్వారా అదుపులోకి తీసుకున్నారు. ఆయా సెంటర్ల మీదుగా వచ్చిపోయే వారిని అడుక్కుంటూ రోజుకు రూ. 4,500 నుండి రూ. 6 వేల వరకు సంపాదిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కాళ్లవేళ్లా పడి అడుక్కుంటున్న వీరు కడుపు నిండా ఆహారం తింటున్నారా అంటే అదీ కూడా లేదని ఈ ఆపరేషన్ లో తేటతెల్లం అయింది. వీరు నిత్యం భిక్షాటన చేసి వసూలు చేస్తున్న డబ్బును అంతా కూడా బెగ్గర్స్ ఆర్గనైజర్ అనిల్ పవార్ కు అప్పగించాల్సిందే. కర్ణాటక రాష్ట్రంలోని గుల్భార్గాకు చెందిన అనిల్ పవార్ ఆయా సెంటర్లలో భిక్షాటన చేస్తున్న వారి నుండి రోజూ డబ్బులు కలెక్ట్ చేసుకుని రోజుకు రూ. 200 కూలీ చెల్లిస్తున్నాడని కూడా తేలింది. డబ్బులు సంపాదించి ఇస్తున్న వారికి సరిపడా డబ్బులు కూడా అనిల్ పవార్ ఇవ్వడం లేదని గుర్తించారు అధికారులు రోజుకు వీరి ద్వారా లక్షల్లో డబ్బు గడిస్తూ తన పబ్బం గడుపుకుంటున్న అనిల్ పవార్ యాచకులచే వెట్టి చేయించుకుంటున్నాడు. ఆపరేషన్ అనంతరం అనిల్ పవార్ ను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించడంతో పాటు అతని నుండి రెండు బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతనిపై భిక్షాటన నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.