దిశ దశ, భూపాలపల్లి:
మూడేళ్ల నాటి ఆడియో వైరల్ చేస్తున్న తీరుపై బీఆర్ఎస్ నేత, భూపాలపల్లి జడ్పీ ఛైర్ పర్సన్ భర్త జక్కు రాకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో ఇప్పుడు కావాలనే లీక్ చేసి తనపై దుష్ప్రచారం చేసేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నారని ఆరోపించారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆడియో ఇప్పుడు లీక్ చేసి తనను బద్నాం చేస్తున్నారన్నారు. గతంలోనే ఈ విషయం తన దృష్టికి రాగానే సదరు పీఏను తొలగించామని, ప్రజలకు సేవలందించాలన్న ఉద్దేశ్యంతో ప్రజా క్షేత్రంలో తిరుగుతున్నానని వివరించారు. తాము మారుమూల ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో ఉద్యోగాలు కూడా వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చామని రాకేష్ వెల్లడించారు. తన భార్యకు అంది వచ్చిన అవకాశంతో కాటారం, మహదేవపూర్, మహాముత్తార, మల్హర్, పల్మెల మండలాల్లోని ప్రజలకు సేవలందించడంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. పుట్టి పెరిగిన ప్రాంత అభ్యున్నతి కోసం అహర్నిశలు కృష్టి చేస్తుండడంతో ప్రజలు కూడా తమను ఆశీర్వదిస్తున్న తీరును తట్టుకోలేకపోతున్న కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని జక్కు రాకేష్ మండిపడ్డారు. ప్రజలతో మమేకమై తిరుగుతున్న తమపై గిట్టని వారు పాత కాలం నాటి ఆడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ చులకన చేయాలని కుట్ర పన్నారన్నారు. నిజాయితీతో ప్రజల్లో కలిసిపోయి సేవ చేయాలన్న ధృక్ఫథంతో ముందుకు సాగుతున్న తమపై జరుగుతున్న ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని జక్కు రాకేష్ ప్రజలను అభ్యర్థించారు. ముగిసిన అధ్యాయానికి సంబంధించిన ఆడియోను ఇప్పుడు ప్రత్యర్థులు విడుదల చేశారంటే వారి కుట్రలు, కుతంత్రాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చన్నారు. భూపాలపల్లి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ హర్షిణీ కానీ, తాను కానీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని రాకేష్ వెల్లడించారు. ఇంతకాలం తమపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవడంతో పాటు తమను అందలం ఎక్కించిన ప్రజలను దూరం పెట్టలేదని కూడా గమనించాలని జక్కు రాకేష్ అన్నారు. ప్రత్యర్థులు ప్రజా క్షేత్రంలో బరిలో నిలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలి తప్ప తప్పుడు దారులు ఎంచుకుని దిగజారుడుగా వ్యవహరించవద్దని జక్కు రాకేష్ హితవు పలికారు.
Disha Dasha
1884 posts
Next Post