బయటపడుతున్న ఉనికి…
డేగ కళ్లతో పోలీసుల నిఘా…
దిశ దశ, దండకారణ్యం:
తెలంగాణాలో మావోయిస్టుల ఉనికి ఎక్కడో ఓ చోట బయట పడుతూనే ఉంది. ప్రత్యక్ష్యంగా సాయుధులై తిరగనప్పటికీ ఏదో రూపంలో నక్సల్స్ ఉనికి వెలుగులోకి వస్తున్నది. సరిహద్దుల్లోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాను షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. మహారాష్ట్ర పోలీసులు తెలంగాణాలో మారువేషంలో ఉన్న మావోయిస్టుల ఉనికిని గుర్తించడంతో పోలీసులు ఆ కోణంలో ఆరా తీయాల్సిన పరిస్థితి తయారవుతోంది.
అజ్ఞాతం నుండి అరెస్ట్ వరకు..
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ ఏరియా కమిటీ కమాండర్ గా పనిచేసిన దళకమాండర్ దంపతులు పదేళ్లకు పైగా అక్కడి పోలీసులకు చిక్కడం లేదు. అటు మావోయిస్టులతో టచ్ లో లేకుండా ఇటు లొంగుబాటలోకి రాకుండా వీరిద్దరు ఏమయిపోయారన్న అంశం అంతుచిక్కకుండా పోయింది. వీరి ఆచూకి కోసం మావోయిస్టు పార్టీ కూడా వారి గురించి పట్టించుకోకపోవడం మరింత పజిల్ గా మారింది అక్కడి పోలీసులకు. దీంతో వీరి గురించి ఆరా తీయగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియాలోని ఓ షోరూంలో పనిచేస్తున్న విషయాన్ని పసిగట్టిన గడ్చిరోలి జిల్లా పోలీసులు ఈ దంపతులను అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ లోని ఇందారం వద్ద కూడా దంపతులు ఇద్దరు పేర్లు మార్చుకుని జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా వీరు ఇక్కడే షెల్టర్ తీసుకున్నప్పటికీ వారి గురించి స్థానికంగా ఎవరికీ తెలియలేదు. చివరకు గడ్చిరోలి పోలీసులు రంగంలోకి దిగడంతో మావోయిస్టు పార్టీలో పనిచేస్తు ఇందారం వచ్చి సెటిల్ అయ్యారని గుర్తించారు. గత నెలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సర్కిల్ పరిధిలో ఓ మహిలా నక్సల్ హోటల్ లో పనిచేస్తున్న విషయాన్ని పసిగట్టిన గడ్చిరోలి పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 6 లక్షల రివార్డు ఉన్న ఈమె రెండు ఎదురు కాల్పుల ఘటనల్లో కూడా పాల్గొన్నట్టుగా అక్కడి పోలీసులు వివరించారు. మధ్యప్రదేష్ లోని జబల్ పూర్ లో నివాసం ఉంటున్న తెలంగాణలోని సూర్యపేట జిల్లా తిరుమలగిరికి చెందిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునితో పాటు ఆయన భార్యను అక్కడి ఏటీఎస్ బగలాలు అరెస్ట్ చేశాయి.
అండర్ గ్రౌండా..? అనారోగ్యమా…?
అడవులు వదిలి జనారణ్యంలోకి వచ్చిన మావోయిస్టులు అటు పార్టీకి చెప్పకుండా… ఇటు పోలీసుల ముందు లొంగిపోకుండా జీవనం సాగిస్తున్న తీరే అందరినీ ఆశ్యర్యపరుస్తున్నది. అనారోగ్య సమస్యలు వెంటాడితే పార్టీ నాయకత్వానికి చెప్పినట్టయితే లొంగిపోయేందుకు క్లియరెన్స్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. లేదా పార్టీని విభేదించి జనారణ్యంలోకి వచ్చిన వారిని కూడా ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వీరు ఎవరికి తెలియకుండా వనవాసం నుండి బయటకు వచ్చి అజ్ఞాతవాసంలో ఎందుకు జీవిస్తున్నారన్నదే అంతుచిక్కకుండా పోతున్నాది. లొంగిపోయినట్టయితే ప్రభుత్వం కూడా రివార్డులు ఇవ్వడంతో పాటు అన్ని రకాల అండదండలు ఇస్తున్నది. మహారాష్ట్రలో అయిన చదువుకునేందుకు కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా కూడా వీరంతా అజ్ఞాతంలో ఎందుకు జీవనం సాగిస్తున్నారన్నదే మిస్టరీగా మారింది.
కరీంనగర్ టు డీకే…
మరో వైపున కరీంనగర్ జిల్లాలోని కొన్ని గ్రానైట్ క్వారీల నుండి మావోయిస్టులకు పేలుడు సామగ్రితో పాటు ఇందుకు ఉపయోగించే వైర్లను కూడా సరఫరా చేస్తున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దామరంచ సబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేస్తుండగా భారీ ఎత్తున సామాగ్రిని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్ గడ్ సరిహధ్దుల్లో ఉన్న ఈ ప్రాంతానికి మందుపాతల కోసం ఉపయోగించే వైర్ బెండల్స్ దొరకడంతో అక్కడి పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. వీటిని రవాణా చేస్తున్నది కరీంనగర్ కు చెందిన వారిగా గుర్తించిన గడ్చిరోలి పోలీసులు కరీంనగర్ లో తనిఖీలు చేశారు. స్థానికంగా ఉన్న గ్రానైట్ క్వారీల పేరిట ఆర్డర్ పెట్టిన వైర్ బెండిల్స్ చత్తీస్ గడ్ కు రవాణా అవుతున్నాయని గుర్తించి విచారణ చేశారు.
ఎన్ కౌంటర్ తో…
తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేపన్ పల్లి సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ ఘటన తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయిన వారు కొమురం భీ ఆసిఫాబాద్, చెన్నూరు ఏరియా కమిటీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నట్టుగా గడ్చిరోలి పోలీసులు తెలిపారు. ఈ లెక్కన దండకారణ్యంలో సంచరిస్తున్న మావోయిస్టులకు సరిహద్దు ప్రాంతాల బాధ్యతలు అప్పగించినట్టుగా స్పష్టం అవుతోంది. అయితే వీరు కేవలం దండకారణ్యానికే పరిమితం అయ్యారా..? సరిహద్దు ప్రాంతాలకు వచ్చి పార్టీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించారా అన్న విషయంపై క్లారిటీ రావల్సి ఉంది. ఇంతకాలం అడెల్లి భాస్కర్, వెంకటేష్, బడే చొక్కారావు వంటి ముఖ్య నాయకుల పేర్లు మాత్రమే వెలుగులోకి రాగా… తాజా ఎన్ కౌంటర్ తో ప్రాణహిత పరివాహ ప్రాంత కమిటీల విషయం వెలుగులోకి వచ్చింది.