వాళ్లెందుకు డుమ్మా..?

రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం అక్కడ కాస్తా వైవిద్యంగా సాగింది. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే ఈ ఆందోళనకు అటెండ్ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన నిరసనకు చాలా మంది కౌన్సిలర్లు, నాయకులు దూరంగా ఉండడం వెనక ఆంతర్యం ఏంటోనన్న చర్చ సాగుతోంది. మంత్రుల నుండి సాధారణ కార్యకర్త వరకు ఈ నిరసనల్లో పాల్గొన్నప్పటికీ హుజురాబాద్ లో మాత్రం వారు దూరంగా ఉండడంపై పార్టీ వర్గాలు దృష్టి పెట్టాయని తెలుస్తోంది.

కారణం అదేనా..?

ఇటీవల స్థానిక మునిసిపల్ ఛైర్ పర్సన్ కు వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపించిన కౌన్సిలర్లు అంతా కూడా అవిశ్వాస తీర్మాణం నోటీసు ఇచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో వీరు నోటీసులు ఇచ్చినప్పటికీ చైర్ పర్సన్ గందె రాధిక హై కోర్టును ఆశ్రయించారు. దీంతో అవిశ్వాసంపై జరగాల్సిన సమావేశం వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చినప్పటికీ వారు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. స్థానిక ఛైర్ పర్సన్ పై వ్యతిరేకత ప్రదర్శిస్తున్నందున కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం ఎందుకు అనుకున్నారేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరి అసమ్మతి గళం గురించి స్థానిక ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చర్చించగా, ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వద్దకు పంచాయితీ చేరింది. మరోవైపున ఛైర్ పర్సన్ కోర్టును ఆశ్రయించడంతో నిర్ణయం హోల్డ్ లో పడిపోయినట్టయింది. కానీ కౌన్సిలర్లు మాత్రం నో కాంప్రమైజ్ అన్న రీతిలో వ్యవహరిస్తున్నట్టుగా గురువారం నాటి ఆందోళనకు దూరంగా ఉండడాన్ని బట్టి స్పష్టం అవుతోంది. మొత్తం 29 మంది కౌన్సిలర్లలో ఐదార్గురు మాత్రమే ఈ ఆందోళణకు అటెండ్ కావడం గమనార్హం. ఏది ఏమైనా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపును అందుకుని కూడా అసమ్మతి నాయకులు దూరంగా ఉండడం మాత్రం హుజురాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది.

You cannot copy content of this page