పట్టాలు ఇవ్వకుండానే రికార్డుల్లోకి… జగిత్యాలలో భారీ స్కాం…

142 మందిని గుర్తించిన అధికారులు

దిశ దశ, జగిత్యాల:

సర్కారు భూమిలో దర్జాగా కబ్జా చేసుకుని రికార్డుల్లో తమ పేర్లు రాయించుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసిన రెవెన్యూ అధికారులు 142 మంది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని తేల్చారు.

నర్సింగాపూర్ గ్రామంలో…

జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమికి పట్టాదారులు పుట్టుకొచ్చింది నిజమేనని రెవన్యూ అధికారులు తేల్చారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గత సంవత్సరం జూన్ 28న అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జగిత్యాల ఆర్డీఓ E1/1075/2024 లేఖ ద్వారా విచారణకు ఆదేశించారు. ఈ మేరకు జగిత్యాల రూరల్ తహసీల్దార్ విచారణ జరిపి ఆర్డీఓకు నివేదిక పంపించారు. ఈ నివేదిక ప్రకారం మొత్త0 142 మంది ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని రికార్డుల్లో తమ పేర్లు రాయించుకున్నారు. 2010-11 పహాణీ రికార్డుల్లో పేర్లు రాయించుకున్న వీరంతా కూడా ధరణీ రికార్డుల్లో నమోదు చేయించుకున్నారని గుర్తించారు. ఇందులో కొంతమేర డంపింగ్ యార్డ్, ప్రభుత్వ భూమి అని కూడా రికార్డుల్లో రాసినట్టుగా తహసీల్దార్ జరిపిన విచారణలో తేల్చారు. అయితే వీరికి రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చిన దాఖలాలు మాత్రం రికార్డుల్లో లేవని కూడా అధికారులు గుర్తించినట్టు సమాచారం. గతంలో సామూహికంగా భూ పంపిణీ కార్యక్రమాలు జరిగిన సందర్బాల్లో అయిన వీరికి పట్టాలు ఇచ్చారా అన్న అనుమానంతో పాత రికార్డులను కూడా పరిశీలిస్తే ఎక్కడ కూడా ధరణీ రికార్డుల్లో ఉన్న వారి వివరాలు మాత్రం లభ్యం కానట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ భూమిని ఆక్రమించుకున్నట్టేనని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దాదాపు 100 ఎకరాల వరకు భూమిని ఆక్రమించుకుని రికార్డుల్లో తమ పేర్లు ఎక్కించుకున్నట్టుగా తహసీల్దార్ తన నివేదికలో వెల్లడించారు. అయితే రైతు బంధు కూడా అమలు చేసుకున్నారని ప్రచారం అవుతున్నప్పటికీ అధికారులు సమగ్ర వివరాలు సేకరించాల్సి ఉన్నట్టుగా సమాచారం.

ప్రముఖుల పేర్లూ…

తహసీల్దార్ ఇచ్చిన ఈ నివేదికలో పలువురు ప్రముఖుల పేర్లు కూడా రావడం గమనార్హం. బీజేపీ నాయకురాలు బోగ శ్రావణి మామ వెంకటేశ్వర్లు, మరో కౌన్సిలర్ భర్తతో పాటు పలువురు నాయకుల పేర్లు కూడా తహసీల్దార్ ఇచ్చిన నివేదికలో పేర్కొనడం సంచలనంగా మారింది. భూమిలేని నిరుపేదలతో పాటు ప్రముఖులు కూడా ఈ భూమిని కైవసం చేసుకున్నారా అన్న చర్చ స్థానికంగా మొదలైంది. గత నవంబర్ నెలలోనే తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయానికి నివేదిక పంపించగా ఇందుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు అంతర్గతంగా జరుగుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ రికార్డులను అన్నింటిని రద్దు చేసే యోచనలో ఉన్నట్టుగా సమాచారం.

కోట్ల విలువ…

జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ భూమి విలువ రూ. కోట్లలోనే ఉంటుందని తెలుస్తోంది. అత్యంత విలువైన ఈ భూమిపై వ్యూహాత్మకంగానే ఆక్రమించుకున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చే వరకూ కూడా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం కూడా విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వ భూమిని కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే పట్టించుకోని వైఖరి అవలంభిస్తే ఎలా అన్న చర్చ కూడా స్థానికంగా జరుగుతోంది. అయితే తహసీల్దార్ ఇచ్చిన ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్నది తేలాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే.

You cannot copy content of this page