కౌశిక్ రెడ్డి చేసే పాపాలన్ని కేసీఆర్ చేయిస్తున్నవే…

నయీం బెదిరించినప్పుడే వెనకడుగు వేయలేదు.

తెలంగాణ ప్రజల చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది

సూపారి ఇచ్చి రాజేందర్ ను చంపాలనుకున్నారు…

కేసీఆర్ లాంటోళ్లను మస్తుమందిని చూశా

ఈటల రాజేందర్ సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ సతీమణీ జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను చంపించేందుకు రూ. 20 కోట్ల సూపారి ఇచ్చేందుకు స్కెచ్ వేశారని, తన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరి రక్తపు బొట్టు చిందినా అందుకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మంగళవారం శామీర్ పేటలోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆయన మాట వివనని వారిని చంపించేందుకు కూడా వెనుకాడడం లేదని, కేవలం ఈటల రాజేందర్ పేరు ఉందన్న కారణంగానే హుజురాబాద్ లో అమరవీరుల స్థూపాన్ని కూల్చి కొత్తది కట్టించారని అటువంటి వాళ్లు ఈటలను చంపేందుకు స్కెచ్ వేసి ఉంటారన్నారు. ఈటలను లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే ఈ వ్యూహం రచించి ఉంటారని జమున అనుమానం వ్యక్తం చేశారు. అయితే తమను చంపితే చంపిస్తారు కావచ్చు కానీ తెలంగాణ ప్రజలు తమ ఆయుధమైన ఒక్క వేలితో కేసీఆర్ ను భూస్థాపితం చేస్తారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉద్యమంలో కుడి భుజంగా ఉన్న ఈటల రాజేందర్ ను చంపించాలనుకోవడం సబబా అంటూ ప్రశ్నించారు. తాను ఉద్యమాల కుటుంబం నుండి వచ్చానని, ఇలాంటి కేసీఆర్ లను మస్తు మందిని చూశానని, స్వరాష్ట్ర ఉద్యమం అప్పుడు మాజీ నక్సల్ నయీం బెదిరింపులకు గురి చేసినా వెనక్కి తగ్గలేదన్నారు. రాజకీయంగా తమ కుటుంబాన్ని దెబ్బ తీయలేక ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారని, ఉద్యమంలో చేరిన నాడు 10 లక్షల కోళ్లతో వ్యాపారం చేసిన తామిప్పుడు 2 లక్షల కోళ్ల వరకే పరిమితం అయినా ఆనందంగా ఉన్నామని ఇందుకు కారణం ఓ దుర్మార్గునితో పోరాటం చేస్తున్నామన్న సంతోషం ఉందని ఈటల జమున అన్నారు. వందల కోట్లు సంపాదించకున్నా ఓటు అనే ఆయుధం తమ వద్ద ఉందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని, కౌశిక్ రెడ్డి ముదిరాజ్ సమాజాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆమె ఆరోపించారు. తక్కువ కులం వాళ్లని తిడ్తున్న వాళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దెమీద కూర్చోవడానికి కారణం వాళ్లేనన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజ్ సమాజాన్ని ఇష్టారీతిన తిట్టడానికి కారణం ముఖ్యమంత్రి కాకపోతే సీఎం కేసీఆర్ ఆయన్ని ఎందుకు మందిలించలేదని ప్రశ్నించారు. తన కుటుంబంలో కూడా ఆడవాళ్లు ఉన్నారన్న విషయాన్ని గమనించి మహిళలను దుర్భాషలాడుతున్న వారిని ఎందుకు హెచ్చరించడం లేదన్నారు. కౌశిక్ రెడ్డి ద్వారా హుజురాబాద్ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం వెనక కారణం కేసీఆర్ ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఈటలను గెలిపించారన్న కోపమేనని జమున దుయ్యబట్టారు. ఆ బలంతోనే కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నాడని, ఆయనను తిట్టేందుకు డిక్షనరీలోని తిట్లు కూడా సరిపోవని, హుజురాబాద్ ప్రజలు కౌశిక్ రెడ్డిని పిచ్చి కుక్క అంటూ సంబోధిస్తున్నారని జమున అన్నారు. ఇలాంటి శాడిస్టులను చేరదీసి కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారని, రానున్న కాలంలో కౌశిక్ రెడ్డి మెడలో మహిళలే చెప్పుల దండలు వేస్తారంటూ మండిపడ్డారు. లేనట్టయితే చట్టాలను చేతుల్లోకి తీసుకుని ప్రజలే బుద్ది చెప్తారని, ఊర్లలో కూడా ఆయన్ని తిరగనివ్వరని, ఇలాంటి శాడిస్టులకు మద్దతు ఇవ్వకపోతేనే పోలీసులకు గౌరవం ఉంటుందని, వారు తమ పని తాము చేసకుంటూ పోతేనే సమాజాంలో విలువ ఉంటుందని జమున హితవు పలికారు. ఆడియోలో వినిపిస్తున్న మాటలు తనవి కావని చెప్తున్న కౌశిక్ రెడ్డి ముదిరాజులకు సారీ చెప్పాడవంటే ఏమని అర్థం చేసుకోవాలో చెప్పాలన్నారు. గతంలో మహిళలపై ఇలాగే మంత్రి దయాకర్ రావు కూడా నోరు పారేసుకున్నా సీఎం ఏ మాత్రం పట్టించుకోలేదని, మహిళా ఉద్యోగులు, అధికారుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ జమున దుయ్యబట్టారు. రాష్ట్రంలోని మహిళా సమాజమంతా కూడా ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని, మహిళలు తల్చుకుంటే సర్కారును కూల్చేయవచ్చన్నారు. మహిళల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న దుర్మార్గులు, శాడిస్టులకు చెప్పుల దండలు వేసి ఊరేగించడం ఖాయమన్నారు. కౌశిక్ రెడ్డి ఇసుక నుండి మొదలు కిరాణం షాపుల వారి నుండి కూడా లంచాలు వసూళ్లు చేస్తున్నాడని జమునా ఆరోపించారు. తామెప్పుడు పదవుల కోసం పాకులాడలేదని, ఉప ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజలు తమను అక్కున చేర్చుకోవడమే గొప్ప వరంగా భావిస్తున్నామన్నారు. ఉద్యమ కుటుంబం నుండివ వచ్చినందున ఈటలకు రాజకీయాల్లో వెన్నుదన్నుగా నిలుస్తనాను తప్ప ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చేది లేదని, పరోక్షంగా మాత్రమే ఉంటానని జమున కుండబద్దలు కొట్టారు.

You cannot copy content of this page